చరిత్రలో నిలిచిపోయే విజయగాథ ఇది

ఇంటింటి దీపాలు, సాధికారత సారధులకు అభినందనలు

వరుసగా మూడో ఏడాది ‘వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ’ అమలు

రూ.1261 కోట్లతో కోటి 2లక్షల 13 వేల అక్కచెల్లెమ్మలకు మేలు

ఈ మూడేళ్లలో సున్నావడ్డీ కింద రూ.3,615 కోట్లు అందించాం

ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది

గ‌త ప్ర‌భుత్వం పొదుపు సంఘాల అక్క‌చెల్లెమ్మ‌ల‌ను న‌ట్టేట ముంచింది

రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ పేరుతో చంద్ర‌బాబు మోసం చేశాడు

కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు ఆపలేదు

మీ ఇబ్బందులే.. నా ఇబ్బందులుగా భావించి తోడుగా ఉన్నా..

35 నెలల పాలనలో రూ.1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించాం

అందులో అక్కచెల్లెమ్మలకు నేరుగా వెళ్లిన సొమ్ము రూ.94,318 కోట్లు

పిల్లలకు మంచి మేనమామగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అమలు

2024లో మన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలోనే పది పరీక్షలు రాస్తారు

అవినీతి, వివక్షకు చోటులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

ఒంగోలు సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఒంగోలు: ‘‘ఇంటింటి దీపాలకు, సాధికారత సారధులకు, బాధ్యతలకు ప్రతిరూపాలకు, తమ రెక్కల కష్టాలతో పిల్లలను పెంచుకుంటూ.. కుటుంబాలను నిలబెడుతున్న మణిమాణిక్యాలకు, రాష్ట్రంలోని ప్రతి ఇంటి చరిత్రను సువర్ణ అక్షరాలతో తిరిగి రాస్తున్న అక్కచెల్లెమ్మలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఒంగోలు పీవీఆర్‌ మున్సిపల్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి వరుసగా మూడో ఏడాది స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ నగదు రూ.1261 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. దీని వల్ల అక్షరాల 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుందన్నారు. మూడేళ్లలో అక్షరాల రూ.3,615 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ నగదు అందజేశామని చెప్పారు. 

అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

‘బ్యాంకుల నుంచి పొదుపు సంఘాలుగా రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన అక్కచెల్లెమ్మలందరికీ, మన రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తూ.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన రూ.1,261 కోట్లు బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి ఒంగోలు ప్రారంభించడానికి మీ మధ్యకు వచ్చాను.

మనం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది చెల్లించిన సున్నావడ్డీ కింద ఏప్రిల్‌ 2020లో రూ.1258 కోట్లను చెల్లించాం. రెండవ ఏడాది 2021 ఏప్రిల్‌లో మరో రూ.1100 కోట్లు మన ప్రభుత్వం ప్రతి అక్కచెల్లెమ్మ అకౌంట్లలో జమ చేసింది. వరుసగా మూడో ఏడాది 2022 ఏప్రిల్‌లో ఇదే ఒంగోలు నుంచి డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి జరిగేలా వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం కింద రూ.1261 కోట్లు నేరుగా జమ చేస్తున్నాం. దీని వల్ల అక్షరాల 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకానికి మూడు సంవత్సరాల  కాలంలో క్రమం తప్పకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు భరోసానిస్తూ, అన్న తోడుగా ఉంటాడు.. కచ్చితంగా సున్నావడ్డీ డబ్బు నా బ్యాంక్‌ అకౌంట్‌లో పడుతాయనే నమ్మకం కల్పిస్తూ.. మూడేళ్లలో అక్షరాల రూ.3,615 కోట్లు అందజేశాం. 

అంతేకాకుండా బ్యాంకులతో కూడా మాట్లాడటం జరిగింది. గతంలో అక్కచెల్లెమ్మలు 12.5 శాతం 13.5 శాతం వడ్డీలు బ్యాంకులు వసూలు చేసేవి. కనీసం బ్యాంకులతో మాట్లాడి వడ్డీలు తగ్గించే కార్యక్రమం గతంలో జరగలేదు. మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపన, తాపత్రయం చూపించాం. అందులో భాగంగా.. వడ్డీలను 8.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించడం జరిగింది. దీని వల్ల ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ సొమ్ము ఇస్తున్నాం. మిగిలిన సొమ్ము మీద కూడా అతితక్కువ వడ్డీకే ఆ రుణాలు కూడా అక్కచెల్లెమ్మలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని సవినయంగా తెలియజేస్తున్నా..

2014–19 వరకు గత ప్రభుత్వం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేసిందేమిటీ అని ఒక్కసారి గమనించండి. గత ప్రభుత్వం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేయడంతో.. ఏ, బీ గ్రేడ్లుగా ఉండే సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. చాలా సంఘాలు ఎన్‌పీఏ, అవుట్‌స్టాండింగ్‌ జాబితాల్లోకి చేరడం మన కళ్ల ఎదుటే చూశాం. 

అప్పటి ప్రభుత్వం ఒకపక్క వ్యవసాయ రుణమాఫీ అని రైతులను మోసం చేసింది. మరోపక్క పొదుపు సంఘాల రుణాల మాఫీ అని అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచింది. అక్షరాల కోటి మందికిపైగా అక్కచెల్లెమ్మలను గత ప్రభుత్వం మోసం చేసింది. పొదుపు సంఘాల రుణాలు మోసం మాత్రమే కాకుండా.. 2014–19 మధ్య కాలంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని కూడా ఎత్తివేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్‌ నుంచి సున్నావడ్డీకి ఇవ్వాల్సిన సొమ్మును పూర్తిగా ఎగనామం పెడుతూ.. పథకాన్ని రద్దు చేసిన పరిస్థితులు చూశాం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కేవలం వడ్డీ ద్వారానే జరిగిన నష్టం రూ.3,036 కోట్లు. ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అప్పులు, చంద్రబాబు మాఫీ చేస్తానని చెప్పి.. చేయకపోవడంతో ఆ మోసంతో, సున్నావడ్డీ పథకం రద్దు చేయడంతో అక్కచెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా మారింది. 

అక్కచెల్లెమ్మలు చేసిన అప్పులు, వడ్డీలు, వడ్డీలకు చక్రవడ్డీలు.. ఇవన్నీ ఏకమై.. తడిసి మోపెడై.. అక్షరాల 2019 నాటికి చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.25,517 కోట్లు ఎగబాకడం చూశాం. ఫలితంగా చంద్రబాబు చేసిన మోసం పుణ్యాన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల్లో 18.36 శాతం సంఘాలన్నీ అవుట్‌ స్టాండింగ్, ఎన్‌పీఏ జాబితాలోకి చేరాయి. 

మన ప్రభుత్వం వచ్చాక అక్కచెల్లెమ్మ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అక్కచెల్లెమ్మలు నిలదొక్కుకున్నారు. గర్వంగా తలెత్తుకున్నారు. గతంలో 18.36 శాతం అవుట్‌ స్టాండింగ్, ఎన్‌పీఏలుగా ఉన్న సంఘాలు.. ఈరోజు కేవలం .73 శాతం అంటే కనీసం ఒక్క శాతం కూడా లేని పరిస్థితి. ఈరోజు పొదుపు సంఘాలు అన్నీ ప్రగతిబాట పట్టాయి. మనం అధికారంలోకి వచ్చే నాటికి స్వయం సహాయక సంఘాలుగా ఉన్న అక్కచెల్లెమ్మలు.. దాదాపు 80 లక్షలు మాత్రమే ఉంటే.. ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకంతో 1.02 కోట్ల మంది పొదుపు సంఘాల్లో ఉన్నారు. ఏకంగా 20 లక్షల మందికి పైగా పొదుపు సంఘాల ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. చరిత్రలో నిలిచిపోయే ఇదొక గొప్ప విజయగాథ. తమ చరిత్రను తిరగరాసుకొని, రాష్ట్ర చరిత్రను తిరిగి రాస్తున్న అక్కచెల్లెమ్మల విజయగాథ.. వారికి అండగా నిలబడిన ప్రభుత్వ విజయగాథ. ఈ ప్రభుత్వం మీద వారికి ఎంత నమ్మకం ఉందో చెబుతున్న.. గొప్ప విజయగాథ. ఇంత మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సగర్వంగా అన్నగా, తమ్ముడిగా తెలియజేస్తున్నాను. 

ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే రాష్ట్రంలో జీర్ణించుకోలేని పరిస్థితి, కడుపు మంట ఎక్కువగా కనిపిస్తుంది. దుష్టచతుష్టయం రాష్ట్రంలో జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఎంత బాధగా ఉందో నా ప్రసంగం ముగింపులో చెబుతాను. 

మహిళా పక్షపాత ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా.. దేశ చరిత్రలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా అక్కచెల్లెమ్మలకు ఎంతగా అండగా నిలబడ్డామో నాలుగు మాటల్లో తెలియజేస్తాను. మచ్చుకగా పది పథకాల గురించి తెలియజేస్తాను. 

జగనన్న అమ్మఒడి ద్వారా 44.50 లక్షల మంది తల్లులకు మంచి జరుగుతుంది. తద్వారా 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఈరోజు ఇంత మంచి జరుగుతున్న ఈ కార్యక్రమంతో ప్రతి సంవత్సరం పిల్లలంతా బడిబాట పడుతున్నారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు మా అన్న ఉన్నాడు.. పిల్లలను చదివిస్తాడు.. ప్రతి ఏటా రూ.15 వేలు నా చేతుల్లో పెడుతున్నాడని ప్రతి అక్కచెల్లెమ్మ మొహంలో ఆనందం కనిపిస్తుంది. అక్షరాల రూ.6500 కోట్లు ప్రతి సంవత్సరం అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. అమ్మఒడి పథకానికి ఇప్పటి వరకు రూ.13,023 కోట్లు చెల్లించడం జరిగింది. 

వైయస్‌ఆర్‌ ఆసరా పథకం.. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశాం కాబట్టే.. పొదుపు సంఘాల్లో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. అక్కచెల్లెమ్మల సంఖ్య కేవలం 34 నెలల కాలంలోనే 20 లక్షల మందికి పైగా పెరుగుదల కనిపిస్తుంది. 80 లక్షల నుంచి 1.02 కోట్లకు పెరిగిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలకు 2019 ఎన్నికల నాటి వరకు అప్పు మొత్తం 4 విడతల్లో వారి చేతికే ఇవ్వడం ద్వారా ఆ అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి బయటకు లాగాం. మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే రెండు విడతల్లో ఆసరా పథకానికి రూ.12,758 కోట్లు ఇచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నా. 

వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 45–60 సంవత్సరాల మధ్య ఉన్న అక్షరాల 24.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తే కుటుంబాలు బాగుపడతాయని, ఎప్పుడూ, ఎక్కడా కనీవిని ఎరుగని విధంగా వైయస్‌ఆర్‌ చేయూత పథకం తీసుకువచ్చాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ మంచి జరిగిస్తూ.. అక్షరాల రూ.9,180 కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. డబ్బులు ఇవ్వడమే కాకుండా.. ఆ అక్కచెల్లెమ్మలను ప్రగతిబాట వైపు నడిపించాలని ఆరాటపడ్డాం. ఐటీసీ, రిలయన్స్, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, హిందుస్థాన్‌లివర్, అమూల్‌  వంటి పెద్ద సంస్థలు, బ్యాంకులతో మాట్లాడి అందరినీ అనుసంధానం చేశాం. అక్షరాల 1,20,518 రిటైల్‌ దుకాణాలు అక్కచెల్లెమ్మలు నడిపిస్తున్నారు. అక్షరాల 3,42,907 యూనిట్లు ఆవులు, గేదెలు, గొ్రరెలు, మేకలు వంటి పశుసంపద పెంపకానికి అక్కచెల్లెమ్మలు ముందుకువచ్చారు. వరుసగా అదే అక్కచెల్లెమ్మకు చేయూత ద్వారా వరుసగా క్రమం తప్పకుండా నాలుగుదఫాల్లో రూ.75 వేలు ఇచ్చే గొప్ప పథకానికి రాష్ట్రంలో శ్రీకారం జరిగింది. 

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం.. దీని ద్వారా 3.28 లక్షలమంది నా కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరిగించే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. రూ.982 కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 

వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలో తొలిసారిగా పేదల్లో ఉన్న ఓసీ వర్గాలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకు మంచిచేసే గొప్ప ముందడుగు పడింది. పేదవాడు ఏ కులంలో ఉన్నా మంచి జరగాలని, ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండాలని గొప్ప అడుగు ముందుకుపడింది. 45–60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటూ 3.93 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇచ్చే గొప్ప అడుగు ముందుకుపడింది. రూ.589 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక.. గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇస్తున్న పెన్షన్‌ కేవలం రూ.1000 మాత్రమే. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్‌ లబ్ధిదారుల సంఖ్య 44 లక్షలలోపే.. కానీ ఈరోజు అక్షరాల 61.74 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు, నా వికలాంగ సోదరులకు పెన్షన్‌ ఇస్తున్నాం. ముష్టివేసినట్టు రూ.1000 అనే రోజులు పోయి.. ఈరోజు రూ.2500 ప్రతి చేతిలోనూ పెడుతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇందులో కేవలం నా అవ్వలు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు మాత్రమే.. 36.46 లక్షల మందికి ప్రతి నెలా 1వ తేదీ వచ్చిన వెంటనే తలుపుతట్టి, గుడ్‌మార్నింగ్‌ చెప్పి, చిరునవ్వుతో ఎటువంటి ప్రయాస లేకుండా చేతిలో రూ.2500 పెట్టి వారి ఆశీస్సులు, దీవెనలు తీసుకొని నా వలంటీర్‌ తమ్ముళ్లు, చెల్లెల్లు వెళ్తున్నారు. 

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు.. దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా అక్షరాల 31లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈరోజు మీ అన్నగా, తమ్ముడిగా ఇంటి పట్టాలు ఇచ్చాం. 31 లక్షల కుటుంబాలు అంటే దాని అర్థం 1.25 కోట్ల జనాభాకు రాష్ట్రంలో ఉన్న నాలుగింట ఒక వంతు మందికి చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. అందులో 15.60లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ఇళ్లన్నీ పూర్తయితే.. ఆ అక్కచెల్లెమ్మలకు మీ అన్న, మీ తమ్ముడు ఇచ్చే ఆస్తి విలువ ఎంతో తెలుసా..? ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5–10 లక్షల ఉంటుందని అనుకున్నా.. రూ.2–3 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్టు అవుతుంది. 

అక్కచెల్లెమ్మలకు అండగా, తోడుగా ఉండాలి. వారి పిల్లలను కూడా గొప్పగా మంచి మేనమామగా చదివించాలని ఆరాటపడ్డాం. మన పిల్లలను మనం గొప్పగా చదివించాలని తపన పడ్డాం. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. క్లాస్‌ టీచర్ల కాన్సెప్టు నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టులోకి వచ్చాం. సీబీఎస్సీ సిలబస్‌ మన పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. 2024లో జరిగే 10వ తరగతి పరీక్షలు.. మన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో రాబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను. పిల్లలు గొప్పగా జరగాలి.. మన పిల్లల జీవితాల గురించి ఆలోచన చేసిన మేనమామ ఉన్నాడని ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియజేస్తున్నాను. 

పిల్లలు గొప్పగా చదవడమే కాకుండా.. ఇంగ్లిష్‌లో పునాదులు పడటమే కాకుండా.. ఆ పిల్లలు ఇంకా పైస్థానంలోకి వెళ్లాలి. మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద చదవులు చదవాలి. చదవులు కోసం ఏ తల్లిదండ్రీ అప్పులపాలు కాకూడదు. బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల కోసం ఆ పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బందిపడకూడదని అంతగా ఆ తల్లిదండ్రులు, పిల్లల కోసం మీ అంతగా ఆలోచన చేశాడు.. మీ అన్న, మీ తమ్ముడు, మీ జగన్‌ అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

జగనన్న విద్యా దీవెన.. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా అక్షరాల 21.55 లక్షల మంది తల్లులకు అక్షరాల రూ.6,969 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ఆ తల్లుల చేతుల్లోకి చేర్చాం. ఆ పిల్లల చదువులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ సొమ్మును తల్లులకే ఇవ్వడం జరుగుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. గతంలో.. చంద్రబాబు పెట్టిన రూ.1800 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా మన పిల్లల కోసం మీ జగనన్న తీర్చాడని సగర్వంగా తెలియజేస్తున్నా. 

జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్న 18.77 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి పిల్లల బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు, ఖర్చులు భరించలేని పరిస్థితి రాకూడదని, డాక్టర్లు, డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివే పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ చదివే విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ చదివే పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఇప్పటి వరకు రూ.3,329 కోట్లు జమ చేయడం జరిగింది. 

వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ.. అక్కచెల్లెమ్మలు, పిల్లల కోసం ఇంతగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండకపోవచ్చు. అక్కచెల్లెమ్మలు గర్భిణులుగా ఉన్నప్పుడు వారు బాగుండాలి.. పిల్లలు బాగా పుట్టాలి. పిల్లలకు రక్తహీనత ఉండకూడదు. పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు విటమిన్స్, మినరల్స్‌ ఉండాలి. మంచి ఆహారం ఇవ్వాలని ఆలోచన చేసిన ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. గతంలో చంద్రబాబు హయాంలో సంపూర్ణ పోషణ పథకానికి రూ.500 కోట్లు పెట్టని పరిస్థితి. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద 34.20 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 6 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు అందరికీ మంచి చేస్తూ.. అక్షరాల రూ.2000 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్నాం. 

కేవలం 10 పథకాల గురించి మాత్రమే చెప్పాను. మనం అమలు చేస్తున్న నవరత్నాలు.. మన రాష్ట్రంలో ఈరోజు అనేక సామాజికవర్గాల చరిత్రను మారుస్తున్నాయి. మనం అమలు చేస్తున్న పథకాల ద్వారా కేవలం 35 నెలల కాలంలో నేరుగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతుల్లోకి డబ్బులు వెళ్లే కార్యక్రమం. అక్షరాల రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లోనే పెట్టాం. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. బటన్‌ నొక్కిన వెంటనే నగదు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. 1వ తేదీన పెన్షన్‌ పొద్దునే తలుపుకొట్టి ఇంటి వద్దకు వస్తుంది. 

లంచాలు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి.. ఎవరైనా మిస్‌ అయిపోయి ఉంటే దరఖాస్తు చేసుకోండి.. జూన్‌లో, డిసెంబర్‌లో ఇస్తానని చెప్పాను. ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆరాటపడిన ప్రభుత్వం మనది. 

రూ.1,36,694 కోట్లలో అక్కచెల్లెమ్మలకు నేరుగా వెళ్లిన సొమ్ము రూ.94,318 కోట్లు అందించాం. ఇంత గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి పథకాలను మీ అందరికీ చేర్చడంలో ఎక్కడా జాప్యం చేయలేదు. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురుతిరిగినా చెక్కుచెదరని సంకల్పం చూపించాం. నాకు ఇబ్బంది ఉందని కోతలు పెట్టే ఆలోచన చేయలేదు. నా ఇబ్బందుల కంటే.. మీ ఇబ్బందులు ఎక్కువని, మీ ఇబ్బందులు.. నా ఇబ్బందులుగా భావించి అన్నగా, తమ్ముడిగా మీ అందరికీ తోడుగా ఉన్నానని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

 

Back to Top