కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం వైయ‌స్ జగన్‌

 విజయవాడ: గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  అనంతపురం కరీమున్నిసా కుటుంబ సభ్యులను సీఎం వైయ‌స్‌ జగన్‌ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హోం మంత్రి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాగా, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. 

వైయ‌స్ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం వైయ‌స్ జగన్‌ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం వైయ‌స్‌ జగన్‌, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.

Back to Top