కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం

సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. పథకాలకు ఆమోదం తెలుపుతూనే గత ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతూ చౌకధరలకు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దు చేసింది. సచివాలయంలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్‌ ఆమోదం తెలిపిన అంశాలనపై వివరించారు. 
– జగనన్న అమ్మఒడి పథకం కింద ప్రతీ సంవత్సరం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న తల్లులకు రూ.15 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కావాల్సిన ఆర్థిక వనరులను సుమారు రూ.6455 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తల్లికి లేదా తల్లి అందుబాటులో లేనప్పుడు గార్డియన్‌కు అందజేయడానికి నిర్ణయం. ఈ పథకం పొందేందుకు తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు ఉండాల్సిందిగా నిర్ణయించాం. అర్హత ఉండి కూడా రేషన్‌ కార్డు లేకపోతే అప్లయ్‌ చేసిన అర్జీ ఉన్నా దాన్ని కూడా విచారణ చేసి రియల్‌టైం గవర్నెన్స్‌ డేటా అప్‌లోడ్‌ అయ్యి ఉన్నా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా జనవరిలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని జనవరిలో సీఎం వైయస్‌ జగన్‌ లాంచ్‌ చేసిన వెంటనే తల్లుల అకౌంట్‌లోకి జమ అవుతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

– గర్భవతులు, బాలింతలు ఆరు నెలల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ గుర్తించబడిన 77 మండలాల్లో అదనపు పౌష్టికాహారాన్ని అమలు చేయాలని నిర్ణయం. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుంటాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక శాతం రక్తహీనత, పౌష్టికలోపం ఉన్నట్లుగా గుర్తించబడిన 77 మండలాలకు అదనంగా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి రూ.128 కోట్లు అదనంగా వెరసి మొత్తం 305 కోట్లు అవుతుందని, దీంట్లో 47 కోట్లు కేంద్రం వాటా ఉంటుందన్నారు.  

– కృష్ణా, గోదావరి నదుల ద్వారా ప్రవహించే అన్ని పంట కాల్వలను శుద్ధి చేయాలని కృష్ణ, గోదావరి కాల్వల శుద్ధి మిషన్‌ ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. సీఎం చైర్మన్‌గా, చీఫ్‌ సెక్రటరీగా వైస్‌ చైర్మన్‌గా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, పర్యావరణం, ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌ గోదావరి, గుంటూరు, కృష్ణా నాలుగు జిల్లాల్లో కలిపి 130 పంట కాల్వల్లో మురుగునీరు కలిసినట్లుగా గుర్తించాం. దీని వలన అనారోగ్యానికి గురికావడం, కేన్సర్‌ వస్తుందని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేస్తాం. దానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాని తెలిపారు.  

– రాష్ట్రంలోని షెడ్యుల్డ్‌ కులాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను మూడుగా విభజించాలని, మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర షెడ్యుల్డ్‌ కులాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ఆమోదించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో  వైయస్‌ జగన్‌కు ఎస్సీ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకు ఇచ్చిన మాట మేరకు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపామన్నారు. 

 Read Also: "అమ్మ ఒడి' పథకానికి కేబినెట్‌ ఆమోదం

– వివిధ రంగాల ద్వారా ప్రజా సేవలు అందించే ప్రతిభావంతులకు వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైం అవార్డులను అందించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. విద్యా, సామాజిక సేవ, వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్, సివిల్‌ సర్వీసెస్, పరిశ్రమలు, వాణిజ్యం, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో విజయాలు సాధించి సమాజ హితం కోసం పాటుపడేవారిని వంద మందిని గుర్తించి సత్కరించాలని నిర్ణయించామని, జనవరి 26న 50 మందిని, ఆగస్టు 15న 50 మందిని సత్కరించాలని, అవార్డుతో పాటుగా రూ.10 లక్షల నగదు ఇవ్వాలని, కేంద్రంలో పద్మశ్రీ లాంటి గుర్తింపు మన రాష్ట్రంలో ఇవ్వాలని ఆమోదించడం జరిగింది. 

– హజ్‌ యాత్రికుల కోసం, జెరూసలెం యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని మూడు లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి రూ.60 వేలు, 3 లక్షలకు పైబడి ఉన్న వారికి రూ.30 వేలకు పెంచాలని మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగిందని మంత్రి నాని తెలిపారు.  

– కంకర పరిశ్రమలను గుర్తించి ప్రభుత్వం జీఓ ఇచ్చిన ఆరు నెలలోపు కంకర నుంచి రోబో శాండ్‌ తయారు చేయడానికి మిషినరీ మెరుగుపరుచుకోవడానికి ఎవరు ముందుకు వస్తారో వారికి అదనంగా రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పావలా వడ్డీకే రుణం అందించాలని, అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే 50 కిలోమీటర్ల పరిధిలో యూనిట్‌ ఉంటే 20 శాతం వాడే విధంగా చర్యలు తీసుకుంటాం. 

– అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో 300 గజాల వరకు ఇళ్లు నిర్మించుకున్నా  రెగ్యూలరైజ్‌ చేయాలని కేబినెట్‌ ఆమోదించింది. తెల్ల రేషన్‌ కార్డు ఉండి వంద గజాల లోపు ఇళ్లు నిర్మించుకొని ఉంటే రూ.1 రిజిస్ట్రేషన్‌ చేసి రెగ్యులరైజ్‌ చేయాలని, 
బీపీఎల్‌ కుటుంబాలు అయితే వంద నుంచి 3 వందల గజాల్లో ఇళ్లు కట్టుకుంటే ఆ ఇళ్లకు రిజిస్టార్‌ ఆఫీస్‌లో ఉన్న మార్కెట్‌ ధరను జిల్లా కలెక్టర్లు నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేస్తారు. దారిద్య్రరేఖకు ఎగువ ఉన్న కుటుంబాలకు గజం నుంచి 3 వందల గజాల వరకు ఇళ్లు నిర్మించుకొని ఉంటే కలెక్టర్‌ నిర్దేశించిన మార్కెట్‌ విలువ బట్టి రెగ్యులరైజ్‌ చేయడం జరుగుతుంది. రెగ్యులరైజ్‌ చేసి ఇళ్లను ఐదు సంవత్సరాల పాటు విక్రయించకుండా నిబంధన తీసుకువచ్చామని చెప్పారు.  గతంలో పేదలకు ఇచ్చిన పట్టాలు, మరొక పేదవారు కొనుగోలు చేసి ఉంటే రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. 

– గ్రామ, వార్డు సచివాలయాల్లో 397 అదనపు జేఎల్‌ఎం పోస్టులకు ఆమోదం తెలియజేయడం జరిగింది. 

– గత ప్రభుత్వాల దోష నిర్ణయాల వల్ల ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఊరట కలిగిస్తూ ఆమోదం. 

– హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం. 

– రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సాంకేతికంగా అండదండగా ఉండేందుకు ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ అగ్రి ల్యాబ్‌ ఏర్పాటు. 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ఏర్పాటు. అలాగే జిల్లా స్థాయి ల్యాబ్, నాలుగు ప్రాంతీయ కోడింగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం. 147 అగ్రి ల్యాబ్‌లు 2020 మార్చి, ఏప్రిల్‌ మాసం నుంచి పనిచేయడం మొదలుపెడతాయి.  

– 9 కోస్తా జిల్లాల్లోని 46 నియోజకవర్గాల్లో ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటుకు తీర్మానం.

– విభజన తరువాత రాజ్‌భవన్‌ మొదటి సారిగా రాజధానిలో ఏర్పాటు చేయడం వల్ల తాత్కాలిక పద్ధతిలో 35 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం. 

– న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించి చట్టంలో మార్పు చేయాలని నిర్ణయం. గతంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి వచ్చే రూ.2ను రూ.20గా మార్చాలని తీర్మానం చేశాం. 

– నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 130కిపైగా ఆస్పత్రుల్లో 716 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద అర్హులైనవారికి సేవలు ప్రారంభమవుతాయి. 

– నవంబర్‌ 7వ తేదీన అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ 20 వేల లోపున్న డిపాజిట్‌దారులందరికీ డబ్బులు చెల్లించడానికి నిర్ణయం. తొలుత రూ.10 వేల లోపు ఉన్నవారికి డబ్బులు ఇస్తాం. దీనికి రూ.264 రిలీజ్‌ చేయడం జరిగింది. 3,69,650 మందికి దీని ద్వారా లబ్ధిచేకూరుతుంది. 

– నవంబర్‌ 14వ తేదీన స్కూల్స్‌లో నాడు – నేడు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న స్కూల్‌ ఫొటో తీసి.. మూడు నాలుగు సంవత్సరాల తరువాత అభివృద్ధి చేసిన ఫొటో కూడా చూపిస్తాం.

– 21న మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేత గుర్తింపబడిన 80 పైచిలుకు డీజిల్‌ బంకుల్లో లీటర్‌కు రూ. 9 సబ్సిడీ బంకులోనే అందించేలా నిర్ణయం. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని రూ.10 వేలు అందించాలని, తూర్పు గోదావరిలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రస్తుతం ఓఎన్జీస్‌లో విలీనం కాబడిన ఆ సంస్థ ద్వారా నష్టపోయిన మత్స్యకార్మికులకు రూ.80 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

– తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా అనే వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని, తీవ్రమైన పక్షవాతం, కండరాల హీనతతో మంచానపడిన వారికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయం. 

– కిడ్నీ వ్యాధి గ్రస్తులు (డయాలసిస్‌ స్టేజ్‌ 2, 3, 4) నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం.

– ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు ఉంటే విశ్రాంతి సమయంలో రోజుకు రూ. 200 ఇవ్వాలని, నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం.  

– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం రూ. 8 వేల వేతనాన్ని రూ.16 వేల వేతనం ఇవ్వాలని తీర్మానం. 

– కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో నారా చంద్రబాబు తన సమీప బంధువులకు 498.93 ఎకరాలను కేవలం నామమాత్రపు ధర అయిన రూ. లక్షకు కేటాయించారు. అంతేకాకుండా ఆ భూమిని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువస్తూ జీఓ జారీ చేయడం రాజకీయాల్లో అత్యంత అనైతికంగా భావిస్తూ.. గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది.  

– విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో అత్యంత విలువైన 13 ఎకరాల 83 సెంట్ల భూమిని  లూలూ అనే సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారు. మార్కెట్‌ విలువ ఎకరా రూ. 50 కోట్లు ఉంటే.. హీనాతి హీనంగా రూ. 4 లక్షలకు కేటాయించారు. ప్రజల ఆస్తిని కొల్లగొట్టే రీతిలో ఉన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్మానించడం జరిగిందని మంత్రి పేర్ని నాని వివరించారు. 
 

Read Also: "అమ్మ ఒడి' పథకానికి కేబినెట్‌ ఆమోదం

Back to Top