అభివృద్ధి, సంక్షేమంలో మాది ప్రజాప్రభుత్వం

ఏపీ ఎన్జీవో మహాసభలో సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి

ప్ర‌భుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులు

 మీ సంతోషం, మీ భవిష్యత్తు మన ప్రభుత్వ బాధ్యత‌

ఎప్పుడూ నిజాయితీ కమిట్‌మెంట్‌తోనే అడుగులు వేశాం

గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టింది

అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది మనమే

పదవీ విరమణ వయస్తును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం

కోవిడ్‌ టైంలో  రెవెన్యూ తగ్గినా డీబీటీని అమలు చేశాం

10వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం

కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించాం

ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చాం

జీపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌కు రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్‌ వస్తుంది

ఈ పెన్షన్‌ స్కీమ్‌ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

బాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు

బాబు, ఆయన వర్గానికి నా మీద కడుపు మంట

పెండింగ్‌లో ఉన్న డీఏను దసరా కానుకగా అందిస్తాం

హెల్త్‌ విభాగంలో మహిళా ఉద్యోగులకూ 5 రోజుల క్యాజువల్‌ లీవ్‌

 విజయవాడ: అభివృద్ధి, సంక్షేమంలో మాది ప్రజాప్రభుత్వమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.మీ సంతోషం, మీ భవిష్యత్తు మన ప్రభుత్వ బాధ్యత అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు.  
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఏమ‌న్నారంటే..

 •  
 • ఏపీ ఎన్జీవోల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా సంఘంలో సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు.
 • సంక్షేమాన్ని అందించడంలో, అభివృద్ధిని పంచిపెట్టడంలో, సేవా ఫలాలను ప్రజలదాకా తీసుకువెళ్లడంతో ప్రజా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు.
 • ఈ రోజు నిర్ణయాలు తీసుకునేది, పాలసీలు తీసుకువచ్చేది, రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి. కానీ, అమలు చేసేది ప్రజలకు కావాల్సిన ప్రతి పౌరసేవలను కూడా ప్రజలకు అందించేది మాత్రం మీ భుజస్కందాల మీదే జరుగుతోంది.
 • కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. మీ సంతోషం, మీ భవిష్యత్‌ కూడా మన ప్రభుత్వ ప్రధాన్యతలే అని, అది నా బాధ్యత అని ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాను.
 • ఈ రోజు ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరి ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వంతో పోల్చిన కూడా మన ప్రభుత్వం అంతకన్నా మిన్నగా మీ అందరి పట్ల సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను.
 • ఉద్యోగులకు సంబంధించి ఎంత మిన్నగా మనందరి ప్రభుత్వం ప్రవర్తిస్తోందో చెప్పడానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
 • 2019లో మనం అధికారంలోకి వచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. 
 • ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తూ..అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంతగా కమిట్‌మెంట్‌ చూపించామంటే..ఏకంగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను ఈ రోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీ వార్డులోనూ రిక్రూట్‌ చేసింది మీ అందరికీ తెలుసు.
 • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని చెప్పారు. వారి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని, వారిని వదిలేయమని ఎంతో మందిlప్పారు. ఆర్టీసీ ఉద్యోగులపై మమకారంతో ఎక్కడా తప్పు చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీరందరూ చూశారు. నిజాయితీతో, కమిట్‌మెంట్‌తో అడుగులు వేశాం.
 • పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం మనదే అని చెప్పడానికి సంతోషపడుతున్నాను.
 • గత ప్రభుత్వహయాంలో అతి తక్కువ జీతాలకు పని చేస్తున్న ఉద్యోగులను కేవలం ఎన్నికల ఆరు నెలల ముందు వరకు కనీసం ఒక్క రూపాయి కూడా జీతం పెరగని ఈ వర్గాలకు, దయనీయస్థితిలో ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచాం. 
 • గత ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల వరకు జీతాలు పెంచలేదు. ఓట్ల కోసం ఆరు నెలల ముందు దుర్భుద్దితో జీతాలు పెంచారు. 
 • మన ం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన ఆ జీతాలను మరింతగా పెంచి ఇస్తున్నాం. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలు, మెప్మా రిసోర్స్‌పర్సన్, శానిటేషన్‌ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ వర్కర్లు, హోం గార్డులు, మధ్యాహ్నం భోజనం వండే ఆయాలు, ఇలా అందరి జీతాలు మనమే మనసు పెట్టి పెంచి ఇస్తున్నాం.
 • గత ప్రభుత్వ హయాంలో 1100 కోట్లు ఉండే జీతాలు మన హయాంలో రూ.3300 కోట్లకు పెరిగింది. చిరునవ్వుతోనే అందరికీ మంచి చేస్తున్నాం.
 • కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్‌వోఆర్‌లు తగ్గినా కూడా, కోవిడ్‌ ఖర్చులు భారీగా పెరిగినా కూడా రాష్ట్రంలోని నిరుపేదలను బతికించేందుకు, రెక్కాడితే గానీ డొక్కాడని మన రాష్ట్ర ప్రజలను ఎంతగా డీబీటీ ద్వారా ఆదుకున్నామో మీకు తెలుసు. దేశానికే ఆదర్శంగా నిలబడేలా ఉద్యోగస్తుల మీద ప్రజలకు గౌరవం పెరిగేలా లంచాలకు, వివక్షకు తావు లేకుండా డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందించాం.
 • ఇవన్నీ కూడా నా స్థాయిలో జరిగినా కూడా ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వుతో ఉన్నారంటే దానికి కారణం మీరే.
 • మానవ చరిత్రలో ఊహించని గడ్డు కాలం వస్తే..అందరం కూడా సమష్టిగా ఎదుర్కొన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలను ఒదిలేయలేదు. ఉద్యోగుల పట్ల మానవత్వం సడలలేదు.
 • గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ కారుణ్య నియామకాలు, 10 వేల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేశాం. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉన్న 14,615 మందిని సొసైటీ పరిధిలో నుంచి ప్రభుత్వంలోకి తీసుకున్నాం. జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా 16 శాతం హెచ్‌ఆర్‌ ఇచ్చే విషయం, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బతికించడం, కార్మికులకు తోడుగా నిలిచాం.
 • అక్షరాల 55 వేల మంది ఆర్టీసీ కార్మికులను రెగ్యులర్‌ చేశాం. 1998–2008 నాటి డీఎస్సీ అభ్యర్థులను కూడా న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇచ్చాం. భాషాపండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్, ఎంఈవోల నియామకాలు, ఎంపీడీవోలకు పదోన్నతులు ఇచ్చాం.
 • గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ప్రతి సమస్యను పరిష్కరించాలి. ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే తపన, తాపత్రయంతో చిత్తశుద్ధితో వారిసమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగులకు తోడుగా నిలబడ్డాను. 
 • కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇచ్చింది మనందరి ప్రభుత్వమే అని గర్వంగా చెబుతున్నాను. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే విషయంలోనూ, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అప్కాస్‌ కిందకు తీసుకువచ్చి, దళారులు లేకుండా ఆ ఉద్యోగులందరికీ నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తున్నాం.
 • ఇలా కుదిరినంతగా ప్రతి ఒక్కరికీ అండగా నిలబడ్డానని చెప్పడానికి గర్వపడుతున్నాను.
 • ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద మమకారం, ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలను విస్తరించాను.
 • మీ అందరిని చిన్న ప్రశ్న అడుగుతున్నాను. పని ఒత్తిడికి సంబంధించి, పనులు అయ్యే విషయాలకు సంబంధించి చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మీరే చూడండి. గతంలో ప్రతి గ్రామంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు. ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ఉండేవి. మరి ఇప్పుడు ఎంత మంది ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఎన్ని కార్యాలయాలు గ్రామ స్థాయిలో ఉన్నాయి.
 • గ్రామ వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లీనిక్స్, కడుతున్న డిజిటల్‌ లైబ్రరీలు, నిర్వీర్యమై మూత పడే పరిస్థితుల నుంచి నాడు–నేడుతో కార్పొరేట్‌ స్కూళ్లతో పోటీగా గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ బడులు. ఈ వ్యవస్థలు అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. ఇవన్నీ కూడా విస్తరించింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఇవన్నీ బాగుంటేనే ఉద్యోగస్తులు కూడా బాగుంటారు. 
 • ఇవేవి బాగలేకపోతే ఆ తరువాత ప్రజలు గవర్నమెంట్‌ బడికి రారు. టీచర్లు నిర్వీర్యం అవుతాయి. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఈ బడులను తీసేస్తారు. గవర్నమెంట్‌ ఆసుపత్రులు నిర్వీర్యం అవుతాయి. పేషేంట్లు రావడం మానేస్తారు. దీంతో డాక్టర్లు, నర్సులను పీకేస్తారు. 
 • ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావడం లేదు కదా, ప్రైవేట్‌ బస్సులు ఎక్కుతున్నారని ఆర్టీసీని కూడా మూసేస్తారు. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు, ఉద్యోగులు ఇద్దరూ కూడా బాగుంటారు.
 • 13 జిల్లాలు 26 జిల్లాలు కావడంతో విస్తరించిన ఉద్యోగుల వ్యవస్థ ఎంత భారీగా ఉందో చూడండి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ యంత్రాంగం ఎలా విస్తరించిందో మీ అందరికీ కూడా తెలుసు.
 • గతంలో పెద్ద జిల్లాకు ఒక చిన్న కలెక్టర్‌ ఉండేవారు. ఈ రోజు అదే జిల్లాకు ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు. ఇద్దరు ఎస్పీలు, సబ్‌ కలెక్టర్లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలందిస్తున్నారు. ఉత్సాహంగా అడుగులు వేస్తున్న పరిస్థితిగతంలో ఎప్పుడూ జరగలేదు.
 • అనేక సంవత్సరాలుగా పరిష్కారం చూపకుండా, ఇవాళ నేను ప్రస్తావించే ఈ అంశం కూడా..అనేక సంవత్సరాలుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేశారు. అప్పటికప్పుడు మాటలు చెప్పి తరువాత వదిలేశారు. 
 • గాలికి వదిలేసిన సీపీఎస్‌ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో మనసు పెట్టి, ఎంతో నిజాయితీగా అడుగులు ముందుకు వేశాం. పరిష్కారం చూపాలనే చిత్తశుద్ధితో అనేక సమావేశాలు, అనేక ఆలోచనలు చేశాం. ఎంతో అధ్యాయనం తరువాత మొట్ట మొదటిసారిగా ఒక పరిష్కారం చూపాలని ఆలోచన చేశాం. 
 • చివరికి విదేశాల్లో అమలవుతున్న వివిధ పెన్షన్‌ స్కీమ్‌లను కూడా ఆ«ధ్యాయనం చేసిన తరువాత చివరకు దేశంలోని  అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు చేయగలిగిన ఎంప్లాయి ఫ్రెండ్లీ గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకునిరావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
 • ఈ రోజు ప్రభుత్వం మీద అసాధ్యమైన బరువు పడకుండా, ప్రభుత్వాలు భారం ఎక్కువై భవిష్యత్‌లో చేతులు ఎత్తేసే పరిస్థితి రాకుండా, అదే సమయంలో ఉద్యోగులు రిటైర్డ్‌మెంట్‌ అయినతరువాత చిరునవ్వుతో బతికేలా, వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్‌కు కూడా పంపించాం. జీపీఎస్‌ స్కీమ్‌ను తీసుకువచ్చాం. ఆలోచన చేయండి.
 • మాట తప్పే ఉద్దేశమే ఉంటే..మొత్తంగా ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునేవాళ్లం. కానీ మంచి చేయాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తపన, తాపత్రయంతో బహుశ ఈ విషయంలో నేను గడిపినంత సమయం చాలా తక్కువ విషయాల్లో టైం ఇచ్చాను. అంత ఎక్కువుగా మీకు మంచి జరగాలని అడుగులు వేశాను. ఒక మంచి సొల్యూషన్‌ ఇవ్వగలిగాను.
 • ఈ రోజు ఒక్కటైతే చెప్పగలను..ఈ పెన్షన్‌ స్కీమ్‌ రాబోయే రోజుల్లో దేశమే మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి అమలు చేస్తుందని చెబుతున్నాను. ఉద్యోగస్తులు రిటైర్డు అయిన తరువాత వారికి మంచి జరగాలని తీసుకువచ్చిన స్కీమ్‌.
 • అదే సమయంలో ప్రభుత్వాల మీద మరి ఎక్కువ భారమై ఆ ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి రాకుండా మంచి స్కీమ్‌. ఈ స్కీమ్‌ దేశానికే ఆదర్శమవుతుంది.
 • స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 నాటి వరకు రాష్ట్రంలో 3.97 లక్షల మంది, 2019 నుంచి మనం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఏకంగా 2,06,630 మందిని ఉద్యోగాల నియామకాల ద్వారా శాశ్వత ఉద్యోగులను నియమించాం. మన ప్రభుత్వంలో ఈ రోజు మరో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.
 • గ్రామ స్థాయిలోనే సేవలందించేందుకు అక్షరాల 1.35 లక్షల మంది మన పిల్లలు కనిపిస్తారు. 53,126 మందిని మన హెల్త్‌ సెక్టార్‌లో నియమించాం. 
 • నష్టాల ఊబిలో నుంచి ఆర్టీసీని, తద్వారా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను కాపాడే కార్యక్రమంలో భాగంగా మరో 53 వేల మందిని రెగ్యులరైజ్‌ చేశాం.
 • గత ప్రభుత్వంలో విసికిపోయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం. కేబినెట్లో అనుకున్నాం. 2014 జూన్‌కు ముందు ఐదేళ్లు ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ జిల్లాల్లో తిరగడం మొదలుపెట్టగానే మీరు వచ్చి  అన్నా..మాకు ఇబ్బందులు ఉన్నాయి. 2014 వరకు తీసుకోండి మేమంతా బాగుపడుతామని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ప్రతి జిల్లాలోనూ అడిగారు. అప్పుడు ఆలోచన చేస్తానని మాటిచ్చాను. అధికారంలోకి వచ్చిన తరువాత ఆలోచన చేసి ఇంతగా తాపత్రయపడి మళ్లీ క్యాబినెట్‌లో పెట్టి అందరికీ న్యాయం చేశాను.
 • ఇవన్నీ కూడా మనసు పెట్టి, మీకు కూడా మంచి జరగాలని, మీ ముఖంలో చిరునవ్వులు చూడాలని తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాను.
 • మెటర్నిటి అడాప్షన్‌ బెనిఫిట్స్‌ కూడా విస్తరించాను. అబ్కాస్‌ ఏర్పాటు ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేశాం. 1వ తారీఖున వారికి జీతాలు ఇస్తున్నాం. లక్ష మంది చిరునవ్వులకు మంచి చేస్తున్నాను.
 • ఎన్జీవోలు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నిశ్చితంగా ఉద్యోగాలు చేసుకునేందుకు కావాల్సిన వాతావరణం కల్పించడంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన స్ఫూర్తిగా అడుగులు ముందుకు వేస్తున్నాను.
 • ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది మనందరి ప్రభుత్వం అయితే గత పాలకులు సహకార రంగాన్ని మూసివేశారు. ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఉద్యోగులను ఇంటికి పంపించారు. గత ప్రభుత్వానికి అడ్డగోలు రికార్డు, మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించండి.
 • చంద్రబాబు సొంతంగా రాసిన మనసులో మాట పుస్తకాన్ని గమనించండి. ఇదే పెద్ద మనిషి ఉద్యోగుల గురించి ఏం రాశారో తెలుసా? చంద్రబాబు అన్న మాటలు ..రాష్ట్రంలోని ఉద్యోగుల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే 1.09,006 మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని 40.67 శాతం అదనంగా ఉన్నారని అప్పట్లో చంద్రబాబు తేల్చారు. ప్రస్తుత శాశ్వత ఉద్యోగాల కాలపరిమితులకు ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని రాసుకున్నారు. 
 • సాంఘీక సంక్షేమ ఉద్యోగులను నియమించడం చంద్రబాబు మానేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించుకోవాలని రాశారు. ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా స్తంభింపజేయాలని చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు.
 • ఉద్యోగుల మీద చంద్రబాబు రాసుకున్న పుస్తకంలో ఏమన్నారంటే..అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు ఏపీ విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌరసరఫరాల సంస్థల్లో 65 శాతం, రెవెన్యూలో 64, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 60 శాతం అవినీతిపరులని చంద్రబాబు తన పుస్తకంలో రాసుకున్నారు. ఇదే ప్రజాభిప్రాయం అంటూ తన బుక్‌లో ప్రస్తావించారు. ఆశ్చర్యమనిపించింది. చంద్రబాబు ఎవరిని అడిగారు. ఏ మనిషిని అడిగారని ఆశ్చర్యమనిపించింది.  
 • ఏసీబీ రైడ్‌లో పట్టుబడితే ఆయన అవినీతిపరుడు అని లెక్కలు కడితే బాగుంటుంది. చంద్రబాబు తనంతట తానే లెక్కలు కట్టి అవినీతిపరులు అని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్‌. ఇలాంటి మనిషి మీకు మంచి  చేయగలడా? ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014 నుంచి 2019 వరకు ఉద్దేశపూర్వకంగాతానే శాశ్వత ఉద్యోగాలను తగ్గించారు.
 • ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఆర్టీసీ, గవర్నమెంట్‌ ఆసుపత్రులు, స్కూళ్ల పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి.
 • గ్రామ స్థాయిలో పాలనకు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. లంచాలు తీసుకుని జన్మభూమి కమిటీలతో సంక్షేమ పథకాలు అందించారు.
 • పబ్లిక్‌ సెక్టార్‌లో 1999 నుంచి 2004 వరకు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ఈ పెద్దమనిషి మూసివేయించారు.ఏకంగా రాష్ట్ర సచివాలయంలో ఇంప్లిమేటేషన్‌ సెక్రటేరెట్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను మూసివేయించే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని సహకార సంస్థలను పప్పు బెల్లాలకు తన వారికి అమ్ముకున్నారు. 
 • ఉద్యోగులను చంద్రబాబు నడిరోడ్డుపై పడేసిన చరిత్ర ఆయనదే. ఆల్వీన్, నిజాం షుగర్స్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ, ఏపీ పేపర్‌మిల్స్, ఇలా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు.
 • చంద్రబాబు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ముసలికన్నీరు కార్చుతున్నారు. ఆలోచన చేయండి. మనందరి ఉద్యోగుల అనుకూల ప్రభుత్వంపై ఎవరి ప్రలోభాలకు గురి కావద్దని మీ అందరిని కోరుతున్నాను.
 • చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు వీరందరికీ కూడా ఉన్నదంతా ఒక్కేటే..కేవలం నా మీద కడుపు మంట మాత్రమే. వీరికి రాష్ట్రంపై ప్రేమ లేదు. వీరు చేసే రాజకీయ విమర్శలు, వేసే నిందలను పట్టించుకోవద్దు. కట్టుకథలను, రెచ్చగొట్టే మాటలను నమ్మవద్దని మీ అందరిని సవినయంగా కోరుతున్నాను.
 • పోలీసుల మీద, ప్రభుత్వ ఉద్యోగులపై పగబట్టి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. మొన్ననే చూశాం. పుంగనూరు, అంగళ్లలో పోలీసులపై దాడులు చేయించారు. ఒక పోలీసు కన్ను పోగొట్టారు. ఇది ధర్మమేనా, మీకు పర్మిషన్‌ రూట్లో వెళ్లండి అంటే పోలీసులపై దాడులు చేస్తారా? 47 మంది పోలీసులపై దాడి చేశారు. శవ రాజకీయాలకు వెనుకాడని పరిస్థితిని గమనించండి.
 • ఉద్యోగుల ప్రయోజనాలకు, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గమని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తూ..
 • రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. అందులో ఒక్క డీఏ ఇస్తా బాగుంటుందని బండి శ్రీనివాస్‌ అడిగారు. ఇందులో జులై 2022 డీఏను ఈ రోజు దసరా పండుగ నాడు మీ అందరికీ ఇస్తానని హామీ ఇస్తున్నాను.
 • మెడికల్, హెల్త్‌ డిపార్టుమెంట్‌లో ఉన్న మహిళా ఉద్యోగులకు మిగతా డిపార్టుమెంట్ల మాదిరిగానే 5 రోజుల అడిషనల్‌ క్యాజువల్‌ లీవ్‌ను కూడా మంజూరు చేస్తున్నాను. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీది, మీకు  తోడుగా ఉంటున్న ప్రభుత్వం ఇది. మీరు అనుకున్న స్థాయిలో కొద్దో గొప్పో నేను చేయలేకపోవచ్చు కానీ మనసునిండా ప్రేమ మాత్రం ఎక్కుగానే ఉందని మరచిపోవద్దు. ఈ ప్రభుత్వం మీది..కచ్చితంగా మీకు మంచి చేసే విషయంలో నాలుగు అడుగులు ఎప్పటికీ వేయడానికి ముందుంటానని మరొక్కసారి తెలియజేస్తూ..మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

తాజా వీడియోలు

Back to Top