నేడు సీఎం వైయ‌స్ జగన్‌ నెల్లూరు జిల్లా కావలి పర్యటన

‘చుక్కల భూముల’ చిక్కులకు చెల్లు

2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కు 

వీటి మార్కెట్‌ విలువ రూ.20 వేల కోట్లు  

రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు 

నెల్లూరు జిల్లా కావలిలో నేడు సీఎం వైయ‌స్ జగన్‌చే ప్రారంభం

నెల్లూరు: దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెక్‌ పెడుతున్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి. 
వందేళ్ల క్రితం బ్రిటిష్‌ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ – ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. అవే చుక్కల భూములు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభు­త్వం వీరి కష్టాలను మరింత సంక్లిష్టం చేస్తూ అనాలోచితంగా  ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు ఉండాలని నిర్ణయించారు.

రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభించాయి.

వారు వాటిని అమ్ముకొనేందుకు, రుణాలు పొందడానికి, తనఖాకు, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కలిగింది. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కాగా, సీఎం జగన్‌ శుక్ర­వారం ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన అషో్టత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొంటారు.
 
అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.    

తాజా వీడియోలు

Back to Top