టార్గెట్‌ 175.. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తే సాధ్యమే

వాటిని గుర్తు చేస్తూ ‘గడప గడపకు’ నాణ్యతగా నిర్వహించాలి

ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సీఎం భేటీ  

అమరావతి: సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి ప్రతి నెలా పథకాలను అందిస్తుండటాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా నిర్వహించే బాధ్యత మీదేనని ప్రాంతీయ సమన్వయర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దీనిపై ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం సమావేశమై మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. 

నెలలో కనీసం 10 రోజులు
‘ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టాం. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. మీ నియోజకవర్గాలే కాకుండా మీకు అప్పగించిన బాధ్యతలను కూడా నెరవేర్చాలి’ అని సీఎం జగన్‌ నిర్దేశించారు. ‘పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది.  మీ అందరిపై నమ్మకంతో ప్రాంతీయ  సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించా’ అని గుర్తు చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు.


 
నిధులు సద్వినియోగం బాధ్యత మీదే..
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదేనని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్‌ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో కచ్చితంగా ఆరు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు స్పష్టం చేశారు.

బూత్‌ స్థాయిల నుంచి కమిటీల నియామకం
బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. బూత్‌ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలని స్పష్టం చేశారు. వాటితోపాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని, పథకాల్లో సింహభాగం వారికే అందిస్తున్నామని గుర్తు చేశారు. అదే రీతిలో పార్టీ బూత్‌ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. 

వాస్తవాలతో ప్రజల్లోకి: గడికోట
అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించామని, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా చేకూర్చిన మేలును నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సీఎం జగన్‌ ఆదేశించారని శాసనసభా వ్యవహారాల కో ఆర్డినేటర్, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా నినాదం అని ఆయన ప్రకటించారు. శుక్రవారం తాడేపల్లిలో గడికోట విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారన్నారు. అనుబంధ సంఘాలు సహా అన్ని కమిటీల ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. ఆగస్టు లోపు వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీలు, అక్టోబర్‌ లోపు మిగిలిన అన్ని కమిటీలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఇక రానున్న రోజుల్లో సీఎం జగన్‌ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉంటారని చెప్పారు. ఎల్లో మీడియాను ఎదుర్కొన్న పార్టీ సోషల్‌ మీడియా సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.  

Back to Top