11 ఆహార శుద్ధి పరిశ్రమలను వర్చువల్‌గా ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్‌ జగన్

తాడేప‌ల్లి: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా వాటికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు మంగళవారం ఉదయం వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం, ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. 

 ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...

ఇవాళ మనం 421 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్లను ప్రారంభించుకున్నాం. ఇవన్నీ కూడా 1912 ఆర్బీకేలకు మ్యాప్‌ చేయబడినవి. మొత్తం 945 కలెక్షన్‌ సెంటర్లకు ఏర్పాటుకు నిర్ణయించాం. అదే విధంగా తొలిదశలో 344 కోల్డ్‌ రూమ్‌ల పనులు జరుగుతున్నాయి. వీటిలో 43 కోల్డ్‌ రూమ్‌లను ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇవి కూడా దాదాపు 194 ఆర్బీకేలతో అనుసంధానం అయి ఉన్నాయి. ప్రతి ఆర్బీకేను కోల్డ్‌ రూమ్స్, కలెక్షన్‌ సెంటర్లకు మ్యాపింగ్‌ చేస్తూ...  ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్‌ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటిని ఆర్బీకే పరిధిలో తీసుకుని పోవాలి. గ్రేడింగ్, సెగ్రిగేషన్‌ వంటి కార్యక్రమాలు ఆ స్ధాయిలో జరిగితే... సెకండరీ ప్రాసెసింగ్‌ అనేది జిల్లా స్ధాయిలో.. జిల్లాకొకటి ఉండేటట్టుగా అడుగులు పడుతున్నాయి. 

రైతులు తాము అమ్ముకోవాల్సిన ఉత్పత్పులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేలా చేస్తున్నాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు కూడా కనీస మద్ధతు ధర ఇస్తూ... ఆర్బీకేలలో పోస్టర్లలో డిస్‌ప్లే చేశాం. మార్కెట్‌లో పోటీ ఉండేటట్టు ఏర్పాటు చేశాం. ఏ ఆర్బీకే పరిధిలోనైనా ఆ పంటకు సంబంధించిన ధర పడిపోతే ఆర్బీకే స్ధాయిలోనే జోక్యం చేసుకుని.. మద్ధతు ధరకు కొని రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు అన్నీ ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులన్నింటితో రైతుకు తాను పండించే పంటకు ఇంకా మెరుగైన రేటు వచ్చే పరిస్థితి వస్తుంది.

శ్రీసిటీలోమరో రూ.1600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు శంకుస్ధాపన చేయడం ఆనందం కలిగిస్తోంది. మోన్‌ డ లీజ్‌ కంపెనీ రెండో విడతలో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి  ముందుకురావడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది. చాక్‌లెట్, క్యాడ్‌బెర్రీ, బోర్న్‌విటా వంటివి తయారు చేస్తున్న ఈ ప్యాక్టరీ దినదినాభివృద్ది చెందాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 

దేవుని దయ వలన సత్యసాయి జిల్లా ధర్మవరంలో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ద్వారా... ధర్మవరం ప్రాంతానికి సంబంధించిన వేరుశెనగ రైతుల పంటకు మరింత విలువ పెరుగుతుంది. వేరుశెనగ రైతులకు  మెరుగైన ధరలు ఇవ్వగలిగే పరిస్థితి రావాలని ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించాం. ధరల స్థిరీకరణనిధి ద్వారా రూ.3వేల కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించడంతో పాటు,  ఈ నాలుగేళ్లలో దాదాపుగా రూ.8వేలకోట్లు ఇతర పంటల కొనుగోలు కోసం ఖర్చు చేశాం. మార్కెట్‌లో రైతులకు పంటమద్ధతు ధరలు తగ్గినప్పుడు వారికి తోడుగా ఉండేందుకు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నాం. రైతులకు మద్ధతు ధరలు లభించనప్పుడు ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా వారికి మద్ధతు ధరలు కల్పిస్తోంది. ఆర్బీకేలో డిస్‌ప్లే చేసిన రేటు కన్న రైతులకు తక్కువ ధర వస్తే.. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ పంటలను సేకరిస్తుంది. 
రూ.75 కోట్లతో వేరుశెనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్నాం. ఇదిసత్యసాయి జిల్లా రైతులకు అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. 55,620 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో ఈ యూనిట్‌  15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే .. ఈ ప్రాంతంలో వేరుశెనగ పంట నుంచి చిక్కీ, వేరుశెనగ ఆయిల్, పీనట్‌ బట్టర్‌ వంటి ఇతర ఉప ఉత్పత్తులు తయారై... పంటకు మార్కెటింగ్‌ పెరుగుతుంది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది.

ఇవాళ నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లును చిత్తూరులో జిల్లాలో 3, అన్నమయ్యజిల్లాలో ఒకటి  చొప్పున ప్రారంభిస్తున్నాం. దాదాపు 14,400 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల మార్కెటింగ్‌ సౌకర్యం పెరుగుతుంది.  రైతులకు మంచి ధరలు లభిస్తాయి. 2414 మంది రైతులకు మంచి జరుగుతుంది. 

సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ.. దాదాపు 10,800 టన్నుల టమోట ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లకు ఇవాళ శంకుస్ధాపన చేసుకున్నాం. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నాం. దీనివల్ల టమోట రైతులందరికీ మంచి జరుగుతుంది.రైతులకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి. వీటికి అదనంగా 250 మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటుతో మార్కెట్‌లో టమోట రైతుల ఇబ్బందులు తీరుతాయి. మార్కెట్‌లో ధరలు పడిపోయినా అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. మంచి ధరలకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. 

మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకెండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 32 పై చిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్‌ మిల్లెట్‌ యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా మిల్లెట్స్‌కు ఎంఎస్‌పీ అందించింది కూడా మన రాష్ట్రంలోనే. మిల్లెట్స్‌ రేటు పడిపోతే.. జోక్యం చేసుకుని కొర్రలు వంటి చిరుధాన్యాలకు కూడా ఎంఎస్‌పీ అందించాం. ఇందులో భాగంగా విజయనగరంలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 7,200 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతో రావడం ఈ ప్రాంతంలో రైతులకు మంచి జరుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు వస్తాయి. 

అదే విధంగా కర్నూలులో ఆనియన్‌ డీహైడ్రేషన్‌ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నాం. రూ.1 లక్ష పెట్టుబడితో ప్రతిఒక్కరికి దాదాపు రూ.12వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిది. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతాం.

తాజా వీడియోలు

Back to Top