మనసుతో చూశా.. బాధ్యతతో తోడుగా నిలబడ్డా.. 

కాబట్టే ప్రతిపక్షానికి దిక్కుతోచడం లేదు, వారి మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయి 

అమలాపురం సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మనది మహిళా పక్షపాత ప్రభుత్వమని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా..

అమలాపురం జనుపల్లిలో నాల్గవ విడత వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ నిధులు విడుదల

1,05,13,365 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1354 కోట్లు జమ  

సున్నావడ్డీ పథకం ద్వారా మాత్రమే అక్షరాల రూ.4,969 కోట్లు అందించాం

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది

నాలుగేళ్ల పాలనలో అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందించిన సాయం రూ.2,31,123 కోట్లు 

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కోసం ఈ నాలుగేళ్లలో రూ. 75 వేల కోట్లు ఖర్చు

ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మాత్రమే రూ.49,845 కోట్లు కేటాయించాం 

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా సంతోషంగా ఉంది

14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క మంచి చేయని చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి..

బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా..?

పేదలకు ఇళ్లు కట్టించే ప్రయత్నం ఈ 75 ఏళ్ల ముసలాయన ఎప్పుడైనా చేశాడా..?

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అసలు సామాజిక న్యాయం ఉందా..?

బాబును సీఎం చేయడానికి దత్తపుత్రుడు ఎందుకు పరిగెడుతున్నాడు..?

చంద్రబాబుకు మాట అంటే విలువ లేదు.. విశ్వసనీయత లేదు

చంద్రబాబు దుర్మార్గపు పాలనకు, మనందరి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి

అమలాపురం: ఇళ్లలో మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే.. మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికం పరంగా, విద్యా, మహిళా రక్షణ కోసం చేయగలిగే ప్రతీ పని కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్కచెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడని సగర్వంగా తెలియజేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటా సాధికారతతో ఆవిర్భవించాలని బలంగా నమ్మిన ప్రభుత్వంగా అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం జనుపల్లిలో వరుసగా నాల్గవ ఏడాది వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  1,05,13,365 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సున్నావడ్డీ నగదు రూ.1,354 కోట్లను జమ చేశారు. ఇప్పటి వరకు సున్నావడ్డీ పథకం ద్వారా ఈ నాలుగేళ్లలో రూ.4,969 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అంతకు ముందు అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
మనసు నిండా చెరగని ప్రేమతో, చిక్కటి చిరునవ్వులతో, ఆత్మీయతలు, ప్రేమానురాగాలు పంచిపెడుతున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్సులతో అమలాపురంలో జరుపుకుంటున్నాం. అక్కచెల్లెమ్మల సాధికారత కొరకు సంబంధించిన మంచి కార్యక్రమం జరుగుతుంది. మన ఇళ్లలో మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే.. మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఎప్పుడూ చెబుతూ ఉంటా. అటువంటి సంతోషాన్ని చూడాలని, ప్రతి ఇంట్లో అలాంటి వెలుగులు చూడాలని దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో గొప్ప కార్యక్రమం అమలాపురం నుంచి అమలు చేస్తున్నాం. 

ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికం పరంగా, విద్యా సాధికారత కొరకు, వారి రక్షణ కోసం చేయగలిగే ప్రతీ పని కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్కచెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

అక్కచెల్లెమ్మల కోసం వారి ఆశీస్సులను కోరుతూ వారికి సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల కోసం సున్నావడ్డీ తిరిగి జమ చేయడం కోసం అమలాపురం వచ్చాను. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న దాదాపు 1.05 కోట్లమంది అక్కచెల్లెమ్మలు తీసుకున్న బ్యాంక్‌ రుణాల మీద సున్నావడ్డీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా వరుసగా నాల్గవ ఏడాది కూడా విడుదల చేస్తున్నాం. 9,48,122 పొదుపు సంఘాల గ్రూపులు తీసుకున్న రుణాల మీద అక్షరాల 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ, వారి కట్టిన రుణాలకు సంబంధించిన వడ్డీని రూ.1354 కోట్లను నేరుగా ఆ అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. 

ఈరోజు మనం జమ చేసే 1354 కోట్ల రూపాయలతో కలిపి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నా అక్కచెల్లెమ్మలకు కేవలం సున్నావడ్డీ పథకం ద్వారా మాత్రమే అక్షరాల రూ.4,969 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరిగిందని సగర్వంగా మంచి అన్నగా, తమ్ముడిగా తెలియజేస్తున్నాను. ఇది మన చరిత్ర అయితే..

గత ప్రభుత్వంలో 2014–19 మధ్య అప్పట్లో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు. అక్షరాల రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. రూ.14,205 కోట్లు చెల్లించకుండా చేసిన మోసం ఒకటైతే.. 2016లో అక్కచెల్లెమ్మలకు కట్టాల్సిన సున్నావడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడం మరో దారుణం. ఇలా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేసి, 2016 అక్టోబర్‌ నుంచి రద్దు చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి చంద్రబాబు హయాంలో జరిగిన ఘోరాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తోంది. 

చంద్రబాబు చేసిన మోసానికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఏగ్రేడ్, బీగ్రేడ్‌ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లకు దిగజారిపోయాయి. 2016 అక్టోబర్‌ నుంచి సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్మును కూడా ఇవ్వకపోవడంతో ఆ అక్కచెల్లెమ్మలు ఎదురువడ్డీ కట్టాల్సిన సొమ్ము అక్షరాల రూ.3,036 కోట్లు. ఇలా పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేసినందుకు అప్పులన్నీ తడిసిమోపెడై 2019 ఏప్రిల్‌ నాటికి అక్షరాల రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు చేసిన మోసానికి 2019 ఏప్రిల్‌ నాటికి 18.36 శాతం అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ మొండి బకాయిలుగా ఎన్‌పీఏలుగా తేలాయి. అటువంటి దారుణమైన 2014–19 మధ్య పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోమని ప్రతి అక్కచెల్లెమ్మను కోరుతున్నాను. అది నారా వారి చరిత్ర, అది నారీ వ్యతిరేక చరిత్ర అని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అందరినీ కోరుతున్నాను. 

మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడింది. మన ప్రభుత్వం రాగానే వైయస్‌ఆర్‌ ఆసరా తీసుకువచ్చాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూత ఇలా ఇచ్చిన ప్రతీ మాట నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్న ఈ ప్రభుత్వం వల్ల పొదుపు సంఘాల్లో మొండి బకాయిలు ఎంతంటే కేవలం 0.3 శాతం. బాబు హయాంలో ఎక్కడ 18.36 శాతం, మన ప్రభుత్వంలో ఎక్కడ 0.3 శాతం అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. 

ఈ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్షరాల 99.67 శాతం రికవరీ రేటుతో దేశానికే మన అక్కచెల్లెమ్మలు ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి మీ బిడ్డ పరిపాలన జరుగుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మనందరి ప్రభుత్వం ఏర్పడకముందు పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షల మంది అయితే.. ఈరోజున అక్కచెల్లెమ్మలు ప్రభుత్వం మీద నమ్మకంతో, చేస్తున్న మంచిని గమనించి కోటి 16 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్నారంటే.. అక్షరాల 25 లక్షల పైచిలుకు మంది పొదుపు సంఘాల్లో చేరి ప్రభుత్వం ఎంతబాగా పనిచేస్తుందో నిదర్శంగా నిలబడ్డారు. 

మనం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3 లక్షల రుణం వరకు మనం ఇచ్చే సున్నావడ్డీతో పాటు మిగిలిన రుణాలన్నీ కూడా బ్యాంక్‌ల నుంచి అతితక్కువ వడ్డీకే అంటే గతంలో 12 నుంచి 14 శాతం వసూలు చేస్తున్న పరిస్థితులు ఉండేవి. దీనిపై బ్యాంక్‌ల ప్రతినిధులతో మాట్లాడి కన్వీన్స్‌ చేశాం. ఏకంగా ఆ రుణాల మీద వడ్డీని కూడా 8.5 నుంచి 9.5 శాతానికి తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న 25,571 కోట్ల రుణాలను మొత్తం నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మాటిచ్చి మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డ ఇప్పటికే మూడు పర్యాయాల్లో ఇప్పటికే రూ.19,178 కోట్లు ఆసరాగా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకువచ్చి అక్కచెల్లెమ్మలను సంతోషంగా వారి కాళ్లమీద వారిని నిలబెట్టగలిగాం. 

మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలో మనం అమలు చేసిన పథకాల వివరాలు.. 

  • జగనన్న అమ్మ ఒడి ద్వారా అక్షరాల 44.48 లక్షల మంది నా చెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరే ఇతర రాష్ట్రంలో కూడా లేదని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. 
  • వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 26.39 లక్షల మందికి అందించిన సాయం రూ.14,129 కోట్లు అని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు, ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు. 
  • నా అక్కచెల్లెమ్మలు బాగుండాలనే తలంపుతో వైయస్‌ఆర్‌ కాపు నేస్తం తెచ్చాం. 3.56 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం రూ.1518 కోట్లు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వమూ ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు, ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు. 
  • వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం తీసుకువచ్చాం. ఆ పథకం ద్వారా 4.39 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం రూ.1257 కోట్లు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వమూ ఇలాంటి పథకాలను అమలు చేసిన పరిస్థితులు లేవు, ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం ఎక్కడా లేదు. 
  • వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా 80 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం అక్షరాల రూ.19,178 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 
  • అక్కచెల్లెమ్మలు బాగుండాలి. వారి కాళ్ల మీద వారు నిలబడాలంటే అప్పులు అతి తక్కువ వడ్డీకే అందుబాటులోకి రావాలని పరితపించి వైయస్‌ఆర్‌ సున్నావడ్డీని తీసుకువచ్చాం. అక్షరాల ఈ పథకం ద్వారా 1,05,13,365 మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సున్నావడ్డీ కింద ఇచ్చిన సాయం అక్షరాల రూ.5 వేల కోట్లు. 
  • నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, వారి పిల్లలు ఇంకా బాగుండాలి. పేదరికం నుంచి అక్కచెల్లెమ్మల కుటుంబాలు బయటపడాలంటే ఆ పిల్లలు బాగా చదవగలిగితేనే బయటపడతారని ఆ పిల్లలను చదివించడం కోసం ఏ అక్క, ఏ చెల్లెమ్మ కూడా అప్పులపాలు కాకూడదని దేశంలో ఎక్కడా జరిగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జగనన్న విద్యా దీవెన తీసుకువచ్చాం. 26.99 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ.. ఆ పిల్లలకు చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద అందిస్తున్నాం. అక్షరాల రూ.10,636 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. 
  • పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం ఆ తల్లులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకువచ్చాం. అక్షరాల 25.17 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువుతున్న పిల్లల కోసం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు మీరు కాలేజీలకు పంపించండి సంవత్సరానికి రూ.20 వేలు వసతి దీవెన కింద ఇస్తున్నాం. పాలిటెక్నిక్‌ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు. రెండు దఫాల్లో ఇస్తున్నాం. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇచ్చిన సొమ్ము రూ.4,275 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 
  • నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, చక్కటి గూడు ఉండాలి, ఆ సొంతింటి కోసం నా అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని నా అక్కచెల్లెమ్మల పేరిట అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చాడు. ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు పేదల చేతుల్లో పెట్టింది గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఏ ఇతర రాష్ట్రంలో ఈ మాదిరిగా జరిగించిన రాష్ట్రం ఏదీ లేదు. ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉన్నాయి. స్థలాలు ఇవ్వడమే కాకుండా అక్కచెల్లెమ్మలకు గూడు కట్టించాలని, 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగిస్తున్నాం. ఒక్కసారి ఇళ్లు పూర్తయితే ఆ ఏరియాను బట్టి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్కపథకం ద్వారానే రూ.2–3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అయ్యింది. 
  • నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో, ఆర్థిక స్వాలంబన ఉండాలనే లక్ష్యంతో నా అక్కచెల్లెమ్మల కోసం వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం తీసుకువచ్చాం. 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలకు మంచి జరిగిస్తూ, 6 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు సైతం మంచి చేస్తూ వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కోసం సంవత్సరానికి రూ.2 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ పథకానికి రూ.6,141 కోట్లు ఖర్చు చేశాం. 
  • నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు బాగుండాలని తాపత్రయపడ్డాను. ఏ అవ్వాతాత, ఏ మహిళా ఇబ్బంది పడకూదని, దివ్యాంగులు సైతం ఇబ్బందులు పడకూడదని వలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే.. చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి అవ్వాతాతలకు గుడ్‌ మార్నింగ్‌ చెప్పే మనవళ్లు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను. పెన్షన్‌లు గతంలో రూ.1000 ఇస్తే గొప్ప అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో రూ.2750లకు పెంచి ఇంటింటికీ పంపిస్తున్న పరిస్థితి మీ బిడ్డ హయాంలో జరుగుతుంది. వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కోసం ఈ నాలుగేళ్లలో రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మాత్రమే తీసుకున్నా కూడా రూ.49,845 కోట్లు కేటాయించాం. 
  • నవరత్నాలతో అన్ని సామాజిక వర్గాల్లోని నా అక్కచెల్లెమ్మల చరిత్రను మారుస్తున్నాం. కాబట్టే మరోసారి చెబుతున్నా.. మనది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం. అందుకే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావులేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము రూ.2,31,123 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే.. ఇదీ మన చరిత్ర. 

నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా కూడా ఎదగాలి, వేగంగా అడుగులు ముందుకు వేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నా. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభాగం నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చేలా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తున్నాం. 

మనది మహిళా పక్షపాత ప్రభుత్వం కాబట్టే వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు చూడని విధంగా అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేయించాం. దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తీసుకువచ్చాం. దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకున్న అక్కచెల్లెమ్మలు 1.24 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నా అక్కచెల్లెమ్మలు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా వారి ఫోన్లలో దిశ యాప్‌ ఉంటే చాలు వారు ఆపదలో ఉంటే 5 సార్లు ఫోన్‌ షేక్‌ చేసినా సరే, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా సరే వెంటనే 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి రక్షణ కల్పించే పరిస్థితి. ఇలా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములుగా నిలబడి అక్షరాల 30,369 మందిని కాపాడారు. 

21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటా సాధికారతతో ఆవిర్భవించాలని బలంగా నమ్మిన ప్రభుత్వంగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. 

  • మనందరి ప్రభుత్వం రైతులు, పిల్లలు, వృద్ధులు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు, నా అక్కచెల్లెమ్మలకు గానీ గతంలో ఏ ఒక్క ప్రభుత్వం చేయని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మనసుతో, బాధ్యతతో తోడుగా నిలబడగలిగింది. కాబట్టే ప్రతిపక్షానికి ఈరోజు దిక్కుతోచడం లేదు, వారి మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. 
  • చంద్రబాబు అధికారంలో ఉన్న సంవత్సరాల్లో ఎలాంటి లంచాలు, వివక్షకు తావులేకుండా బటన్‌ నొక్కితే ఇంటింటికీ డబ్బులు పడటం ఎప్పుడైనా చూశారా..? ఇన్నిన్ని పథకాలు ఏనాడైనా చంద్రబాబు హయాంలో చూశారా..? అని అడుగుతున్నా. 
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అసలు సామాజిక న్యాయం ఉందా..? రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా నా దళితులు, నా బీసీలకు, నా ఎస్టీలకు, నా మైనార్టీలకు, నా అక్కచెల్లెమ్మలకు గానీ ఎప్పుడైనా ఇచ్చాడా..? ఒక్కసారి చెప్పండి. 
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడా..? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవాలంటే కూడా దాన్ని వద్దు అన్న చరిత్ర కేవలం చంద్రబాబుకు మాత్రమే సొంతం. మన పేద పిల్లలు ఇంగ్లిష్‌ బడులకు పోతే తెలుగు భాషా ఏమైపోతుందని గగ్గోలు పెడతారు.. కానీ, వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు మాత్రం వెళ్లేది ఇంగ్లిష్‌ మీడియం బడులకే. 
  • చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎప్పుడైనా పేదల చేతుల్లో పెట్టాడా..? ప్రతి స్థలంలోనూ ఇళ్లు కట్టించే ప్రయత్నం ఈ 75 సంవత్సరాల ముసలాయన ఎప్పుడైనా చేశాడా..? అని అడుగుతున్నా. చేయకపోగా.. పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకున్న చరిత్ర కేవలం చంద్రబాబుకు మాత్రమే సొంతం. 
  • మరి ఇలాంటి అన్యాయమైన ముసలాయన.. 28 సంవత్సరాల క్రితమే సీఎం అయిన ఈయన, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా మీకు గుర్తుకొస్తుందా..? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.. ఇలాంటి వ్యక్తిని ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇలాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి దత్తపుత్రుడు ఎందుకు పరిగెడుతున్నాడో ఆలోచన చేయండి. 
  • దత్తపుత్రుడు సీఎం కావడానికి కాదట.. ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికట.. ఆయన పరుగులు. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా అని ఆలోచన చేయండి. 
  • ఈ ముగ్గురూ మూడు చోట్ల సభలు నిర్వహించారు. వారికి అధికారం ఇస్తే ఎవ్వరినీ వదలరట. గిట్టనివారి అంతు చూస్తాడట, మట్టుబెడతాడట, ఉగ్రరూపం చూపిస్తాడట, ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట. ఇదీ ఆయన, ఆయన దత్తపుత్రుడు, ఆయన సొంత పుత్రుడు మాట్లాడే మాటలు. 

చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని వారిని కించపరిచేలా మాట్లాడాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు, తోలు తీస్తా, తాట తీస్తానని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వారికి నరకం చూపించాడు. మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీలను, ఓటు బ్యాంక్‌తో చెలగాటం ఆడటమే పనిగా పెట్టుకొని నరకం చూపించాడు. ఎస్టీలకు ఏ నాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా కూడా ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి నరకం చూపించాడు. అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు, అన్యాయం చేశాడు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్తవద్దంటుందా అని ఆడవాళ్లను సైతం అగౌరవపరిచాడు. 

ఇటువంటి మనిషి ఈరోజు మైక్‌ పట్టుకొని ఊదరగొడుతున్నాడు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలను గుర్తుతెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలంట.. రైతుల రుణాల మాఫీ కావాలంటే బాబు రావాలంట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే.. బాబు రావాలంట. నిరుద్యోగులకు ఉపాధి రావాలంటే బాబు రావాలంట. రైతులకు రుణాలు  రూ.85,712 కోట్లు మాఫీ అని చెప్పి నోటితో చెప్పి మోసం చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14,207 కోట్ల రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు. చదువుకుంటున్న పిల్లలను సైతం వదల్లేదు. ఇంటింటికీ రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు. ప్రతి ఇంటికి రూ.2 వేలు చొప్పున అంటే ఐదు సంవత్సరాల్లో రూ.1.25 లక్షలు ఎంతమంది పిల్లలకు ఇచ్చాడని ప్రశ్నిస్తున్నాను. 

చంద్రబాబుకు మాట అంటే విలువ లేదు. మాటకు విశ్వసనీయత లేదు. కేవలం ప్రజలను ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. వీళ్లకు అధికారం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ప్రజల ముఖంలోచిరునవ్వులు చూసేందుకు కాదు.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి కావాలి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడతారు.  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్‌ అవుతుంది. 

అప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. కేవలం ముఖ్యమంత్రి మారాడు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి.  మీ బిడ్డ మీకోసం రూ. 2.31 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు.  ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేదు. వివక్ష చూపించలేదు. 

చివరకి.. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావాలని ప్రయత్నం చేశాడు. ఇచ్చాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటికన్నా గ్రోత్‌ రేటు ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు.  అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని అడుగుతన్నాను. ఆలోచన చేయండి. 

ఈరోజు నిజంగా పూర్తిగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజలకు మంచి చేస్తామని కాదు.  అలా చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబద్ధాలు చెబుతారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెడితే ఇష్టమొచ్చినట్లుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేసారు. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. 

అంగళ్లు అనే చోట తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలుచేయించి, మళ్లీ పుంగనూరులో ఒక రూటుకు పర్మిషన్‌ తీసుకొని.. ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు మీకు పర్మిషన్‌ లేదని చెప్పారు. అధికార పార్టీ వాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ వస్తుందని పోలీసులు చెబితే ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. 

47 మంది పోలీసులకు గాయం చేశాడు. ఒక పోలీసు సోదరుడికి కన్ను పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. 

మంచి చేయడం కోసం వాలంటీర్లు మీ దగ్గరికే వస్తున్నారు. ఈ వలంటీర్లంతా మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్న మీ బిడ్డలే. ప్రతి 50 ఇళ్ల నుంచి ఒకరు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారే.. వలీంటర్లుగా మీకు తోడుగా నిలబడేందుకు, సాయం చేయడానికి సేవాభావంతో మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్లవదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. ఆలోచన చేయాలని అడుగుతున్నాను.

వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఎక్కువ అవుతాయి. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తామని చెబుతారు.  ఎలాంటి మనిషి మీకు నాయకుడిగా కావాలో ఆలోచన చేయండి. 

నేను మిమ్నల్ని కోరేది ఒక్కటే. నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా లేరు. కానీ వీళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్నే. మీ అందరిని నేను కోరేది ఒకటే మీ ఇంట్లోమీకు మంచి జరిగిందా ? లేదా ? అనేది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. 

మీ చల్లని దీవెనలు, దేవుడి చల్లని ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఇంకా మెరుగ్గా ఉండాలని, మీకు మంచి చేసే అవకాశం ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. 

మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ మూడు పాత బ్రిడ్జిలు అమలాపురంలో ఉన్నాయి. వాటిని రూ.10 కోట్లతో పునర్‌ నిర్మించాలని అడిగారు. దాని కోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. అంతేకాకుండా మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం అని చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్‌ను, లేదా అతని కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ను బాగా తిరగాలని చెప్పాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ది చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top