తాడేపల్లి: ‘‘గతంలో సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఈరోజు సంక్షేమ పథకాలే పేదలను వెతుక్కుంటూ ఇంటి దగ్గరకు వచ్చి తలుపుకొట్టి మరీ అందజేసే కార్యక్రమం మన ప్రభుత్వంలో జరుగుతుంది. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని మరో 9,30,809 మంది కుటుంబాలకు మంచి చేస్తూ రూ.703 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకోకపోవడం, అర్హత నిర్దారణలో పొరపాటు, నిర్ణిత గడువులోగా దరఖాస్తు చేసుకోకపోవడం, బ్యాంకు అకౌంట్‌లు సక్రమంగా లేకపోవడం ఇలా అనేక కారణాలతో పథకాలు అందనివారికి మరో అవకాశం కల్పిస్తూ.. అర్హులందరికీ సంక్షేమ సాయం అందాలని, వారికి కూడా న్యాయం చేసేందుకు ఈకార్యక్రమాన్ని చేపట్టామని, ఇదో గొప్ప విప్లవాత్మక మార్పు అని కూడా చెప్పవచ్చు అని సీఎం వైయస్ జగన్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు కులం, మతం, ప్రాంతం, చివరకు రాజకీయాలు, పార్టీలు ఇవేవీ పట్టించుకోలేదని, అర్హత ఉంటేచాలు సంక్షేమ పథకాలు అందరికీ దక్కుతాయనే సంకేతం ఇచ్చేలా ప్రతి అడుగు వేయడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా, కనీవినీ ఎరుగని విధంగా అర్హులై ఉండి కూడా సంక్షేమ ఫలాలు అందుకోలేని పేదలకు మరో అవకాశం ఇచ్చి వారిని దరఖాస్తు చేసుకోమని చెప్పి.. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు రావాల్సిన డబ్బును, ఇతర లబ్ధిని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లను సీఎం వైయస్ జగన్ చేశారు. 31 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాల రూపంలో అందించిన సాయాన్ని ప్రజలకు వివరించారు. సీఎం వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘తెలుగుదేశం హయాంలో అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల కోసం పెన్షన్‌లు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1,000 మాత్రమే. అది కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవారు. నెలకు గత ప్రభుత్వానికి వచ్చిన బిల్లు రూ.400 కోట్లు మాత్రమే. ఈరోజు మన ప్రభుత్వ హయాంలో 61 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.2,250 చేశాం. నెలకు రూ.1,450 కోట్లు పెన్షన్‌ల పథకం కోసం ఖర్చు చేస్తున్నాం. ఇబ్బందులు పడకూడదు. ఆత్మాభిమానం దెబ్బతినకూడదని ఏకంగా వలంటీర్ ఉదయమే ఇంటికి వచ్చి చిరునవ్వుతో డబ్బు చేతుల్లోపెట్టి వెళ్తున్నారు. గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టాం. 2022 జనవరి 1వ తేదీ నుంచి రూ.2,250 పెన్షన్.. రూ.2,500 అవుతుంది. గత ప్రభుత్వంలో గిట్టనివారికి పథకాలు ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. మనందరి ప్రభుత్వం మనకు ఓటు వేయనివారికి కూడా వారు పేదలైతే చాలు.. పథకాలకు అర్హులైతే చాలు అని గుర్తించి.. ఇంటింటికీ వెళ్లి వెరిఫై చేసి ఇవ్వడానికి వీలుగా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి.. సోషల్ ఆడిట్‌లో లిస్టు కూడా డిస్‌ప్లే చేసి అందరికీ న్యాయం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధికోసం ఆత్మాభిమానం చంపుకొని వృద్ధులు, వికలాంగులు.. కాళ్లు అరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆరోజుకు.. ఈ రోజుకు తేడా ఎంత ఉందో ఒక్కసారి గమనించండి. వివక్ష, లంచాలకు తావు లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినప్పటికీ.. ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు పెరిగినప్పటికీ పేదలకు అండదండలు అందించే విషయంలో మన ప్రభుత్వం మానవత్వం చూపింది. 31 నెలల పాలన తర్వాత కూడా మరో 9,30,809 మంది లబ్ధిదారులకు మేలు చేస్తూ రూ.703 కోట్లు సమయానికి దరఖాస్తు చేసుకోలేనివారికి, రకరకాల కారణాలతో అందనివారికి మేలు చేస్తున్నాం. పేదల మీద మమకారం, బాధ్యతతో ఈ డబ్బును వారికి జమ చేస్తున్నాం. స్కీమ్‌లు ఎలా ఎగ్గొట్టాలి, పేదలను ఎలా ఎండగట్టాలి, డబ్బులు ఎలా మిగిలించుకోవాలనేది గత ప్రభుత్వ విధానం అయితే.. వారిలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఎలా ఇవ్వాలన్నది మన ప్రభుత్వ విధానం. దానికి ఉదాహరణ ఈరోజు మనం చేస్తున్న సాయం, న్యాయం. రైతు భరోసా సాయం.. వైయస్‌ఆర్ రైతు భరోసా కింద 2021 రెండో విడతలో భాగంగా మరో 2,86,059 మందికి రూ.58.89 కోట్లు జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 52.38 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసాగా అందించిన సాయం రూ.17,030 కోట్లు. కొత్త లబ్ధిదారులకు ఇస్తున్న సాయం అదనంగా యాడ్ అవుతుంది. చేయూత పథకం.. వైయస్‌ఆర్ చేయూత పథకంలో మరో 2,50,929 లబ్ధిదారులకు రూ.470 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. 45–60 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 22.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటి వరకు రెండేళ్లు కలిపిచూస్తే.. రూ.8,944 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 2,50,929 మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చే సాయం అదనం యాడ్ అవుతుంది. సున్నావడ్డీ పంటరుణాలు.. రైతులకు వైయస్‌ఆర్ సున్నావడ్డీ పంట రుణాల వర్తింపులో భాగంగా 2019–20 రబీకి సంబంధించి మరో 62,622 మంది లబ్ధిదారులకు రూ.9.01 కోట్లు ఈరోజు జమ చేస్తున్నాం. అంతేకాకుండా 2020 ఖరీఫ్‌కు సంబంధించి మరో 58,821 మందికి రూ.10.06 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో వైయస్‌ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు గత ప్రభుత్వ బకాయిలతో కలిపి కూడా అందుకున్న రైతులు 58.97 లక్షల మంది అయితే.. వీరికి అందిన లబ్ధి రూ.1106 కోట్లు. ఇప్పుడు మనం అందించే సాయం అదనంగా యాడ్ అవుతుంది. వైయస్‌ఆర్ సున్నావడ్డీ.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం వర్తింపజేస్తూ మరో 59,661 లబ్ధిదారులకు రూ.53.51 కోట్లు ఈరోజు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 98 లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు వైయస్‌ఆర్ సున్నావడ్డీ ద్వారా అందించాం. ఇప్పుడిస్తున్న రూ.53.51 కోట్లు అదనం. వసతి దీవెన.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా మరో 43,010 మంది విద్యార్థులకు రూ.39.82 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 18.78 లక్షల మంది విద్యార్థులకు గానూ 16.80 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.2267 కోట్లు మనం అందించాం. ఇప్పుడు అందిస్తున్న రూ.39.82 కోట్లు అదనం. విద్యా దీవెన.. జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులై ఉండి కూడా మిగిలిపోయిన 31,940 విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.19.92 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 21.55 లక్షల విద్యార్థులకు గానూ 19.02 లక్షల తల్లుల ఖాతాల్లోకి రూ.6,258 కోట్లు అందించాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం మన ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడిస్తున్న సాయం అదనం. కాపు నేస్తం.. వైయస్‌ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా మరో 12,983 మంది అక్కలకు ఈరోజు రూ.19.47 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలలుగా 3.27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించింది రూ.982 కోట్లు కాగా, ఈరోజు మరో 13 వేల మందికి మరో రూ.20 కోట్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. వాహన మిత్ర.. వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకంలో మిగిలిపోయిన 8,080 మంది లబ్ధిదారులకు రూ.8.08 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 2.74 లక్షల మందికి రూ.762 కోట్లు వైయస్‌ఆర్ వాహన మిత్ర ద్వారా మంచి చేశాం. ఈరోజు ఇస్తున్నది అదనం. మత్స్యకార భరోసా.. వైయస్‌ఆర్ మత్స్యకార పథకం కింద మరో 3,788 మందికి రూ.3.79 కోట్లు ఇప్పుడు అదనంగా జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో 1.20 లక్షల మందికి రూ.332 కోట్లు అందిస్తే.. ఇప్పుడు ఇచ్చేది అదనం. ఆసరా పథకం.. వైయస్‌ఆర్ ఆసరా పథకం ద్వారా మరో 1136 మందికి రూ.7.67 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.12,750 కోట్లు అందిస్తే.. ఇప్పుడు ఇచ్చే సాయం అదనం. నేతన్న నేస్తం.. వైయస్‌ఆర్ నేతన్న నేస్తం పథకం కింద మిగిలిపోయిన మరో 794 మంది లబ్ధిదారులకు రూ.1.90 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో ఈరోజు జమ చేస్తున్నాం. గత 30 నెలల్లో 82 వేల మంది లబ్ధిదారులకు రూ.576 కోట్లు అందించాం. ఈరోజు అందించే సాయం అదనం. ఇళ్ల పట్టాలు.. 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరో 1,10,986 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరుగుతుంది. 31 లక్షల ఇళ్ల పట్టాలకు అదనంగా ఇవి యాడ్ అవుతాయి. పెన్షన్‌కానుక వీటి అన్నింటితో పాటు అర్హులైన మరో 1,51,562 మందికి పెన్షన్ కార్డులు ఈరోజు అందిస్తున్నాం. రాష్ట్రంలో పెన్షన్‌కార్డులు ఉన్నవారి సంఖ్య ఈరోజుతో 61,74,593కు చేరింది. ఆరోగ్యశ్రీ 3,249 మందికి ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తవి ఇస్తున్నాం. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారి సంఖ్య 1,40,45,491 మందికి చేరుతుంది. ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లో సంక్షేమ పథకాలు అందుకోలేని లబ్ధిదారులకు మంచి జరుగుతుంది. డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి కూడా లబ్ధిపొందని వారికి జూన్‌లో మేలు జరుగుతుంది. జూన్ నుంచి నవంబర్ వరకు అర్హత ఉండి కూడా లబ్ధిపొందని వారికి డిసెంబర్‌లో సంక్షేమ పథకాల లబ్ధిని పూర్తిగా అందిస్తాం. ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్‌ప్లే చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఎటువంటి లంచాలు, వివక్ష తావులేకుండా పథకాలు అమలవుతున్నాయి. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, లబ్ధిదారులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ శ్రీకారం చుడుతున్నాం.