‘కొప్పర్తి, శ్రీసిటీ’తో రాయలసీమ రూపురేఖలు మార్పు

చదువుకున్న మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి

కొప్పర్తిలో ఇండస్ట్రీయల్‌ పార్కులు ప్రారంభించడం సంతోషంగా ఉంది

రూ.1580 కోట్లతో పార్కుల అభివృద్ధి.. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశాం

ఏప్రిల్‌ నాటికి 1800 మందికి ఉపాధి అవకాశాలు

ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ హబ్‌లో 6 కంపెనీల పెట్టుబడులు

మరో 6 నుంచి 9 నెలల్లో 7500పైగా ఉద్యోగాలు రానున్నాయి

పెట్టుబడులు పెట్టేందుకు మరో మూడు కంపెనీల ఆసక్తి

కొప్పర్తిలో సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కొప్పర్తి: వైయస్‌ఆర్‌ జిల్లా కొప్పర్తి వద్ద మెగా పారిశ్రామిక హబ్‌, ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో సదుపాయాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌  మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, 3167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ నిర్మిస్తున్నాం. ఈ రెండింటిలో మౌలిక వసతులు కల్పన (రోడ్లు, విద్యుత్‌ సరఫరా), ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం కోసం అక్షరాల రూ.1580 కోట్లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుచేశామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రీయల్‌ పార్కులను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ జగనన్న ఇండస్ట్రీయల్‌ హబ్, వైయస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లను సీఎం ప్రారంభించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

‘ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో నాలుగు షెడ్లతో ఏఐఎల్‌ డిక్షన్‌ సంస్థ రావడం జరిగింది. ఏప్రిల్‌ నాటికి కొప్పర్తిలో 1800 మందికి ఉపాధి కూడా ఇవ్వబడుతుంది. ఇందులో 50 మందికి ఇప్పటికే జాయినింగ్‌ ఆర్డర్స్‌ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్లందరూ ట్రైనింగ్‌లో ఉన్నారు. పూర్తయిన తరువాత ఇక్కడే పనిచేస్తారు. ఏఐఎల్‌ డిక్షన్‌ టెక్నాలజీ రావడమే కాకుండా ఎలక్ట్రానిక్‌ రంగంలో భూమిపూజకు మరో ఆరు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఏఐఎల్‌ డిక్షన్‌ టెక్నాలజీ, డీజీకాన్స్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ, సెల్‌కాన్‌ రిజల్యూట్, చంద్రహాస్‌ ఎంటర్‌ప్రైజ్, యూటీఎన్‌పీఎల్, డిక్షన్‌ రెండో ప్లాంట్‌ మొత్తం ఆరు సంస్థలు యూనిట్లు నెలకొల్పడానికి శంకుస్థాపన చేశాం. 

వీటిలో దాదాపు 7,500 ఉద్యోగాలు మరో 6 నుంచి 9 నెలల కాలంలో ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రూ.600 కోట్లతో పెట్టుబడి పెడుతున్నారు. అదే విధంగా వీవీడీఎన్‌ అనే సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒక్క సంస్థ రూ.365 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 5,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ 6 నుంచి 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి. బ్లాక్‌ పెప్పర్, హార్మోనిసిటీ అనే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నాయి. టెలివిజన్స్, ల్యాప్‌టాప్స్, ఐఓటీ డివైజస్, ట్యాబ్స్, రకరకాల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ జరగబోతుంది. 

ఇదే పార్కులోనే మరో 18 ఎంఎస్‌ఎంఈలకు కూడా శంకుస్థాపనలు చేశాం. రాయలసీమ ఇన్విరాన్‌కేర్, బీఎస్‌ ల్యాబరేటరీస్, సర్వముఖి కాంక్రీట్‌ ఇలా రకరకాల 18 ఎంఎస్‌ఎంఈ సంస్థలు కూడా దాదాపు రూ.84 కోట్ల పెట్టుబడితో మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శంకుస్థాపన చేశారు. 

కొప్పర్తి పార్కులు అభివృద్ధి చెందిన తరువాత దాదాపు 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఫెసిలిటీ తయారవుతుంది. ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం, ఆసక్తి చూపించడం, కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు సపోర్టు చేస్తూ పీఎల్‌ఐ స్కీమ్‌లో అనుసంధానం చేసింది. కేంద్రం సహకారం కూడా మెండుగా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం రెండూ కలిసికట్టుగా పెట్టుబడులు పెడుతున్నాయి. రెండు ప్రభుత్వాలు ఇన్వెస్ట్‌మెంట్‌ అట్రాక్ట్‌ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాయి. 

ప్రాజెక్టులు రావాలి.. ఇంకా అభివృద్ధి జరగాలి. చదువుకున్న మన పిల్లలందరికీ ఉద్యోగాలు మెరుగ్గా, మెండుగా మన జిల్లాలోనే వచ్చే అవకాశాలు, పరిస్థితులు రావాలి. దీని వల్ల రాయలసీమ ప్రాంతానికి అంతా మంచి జరుగుతుంది. ఒకవైపు కొప్పర్తి, నెల్లూరు–చిత్తూరు బార్డర్‌లో శ్రీసిటీ.. ఇవన్నీ కూడా రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటి అన్నింటి వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top