ప్రాణానికి విలువిచ్చే ప్రభుత్వం మనది

వైద్య, ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం

రాష్ట్రంలోని దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ

రూ.వెయ్యి దాటితే చాలు ఆ పేదవాడికి వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తోడు

29 నెలల్లో ఆరోగ్యశ్రీ ద్వారా రూ.4 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేశాం

కొత్తగా 16 టీచింగ్‌ హాస్పిటల్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం

ఐటీడీఏ పరిధిలో మరో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు 

వైద్య, ఆరోగ్య శాఖలో నాడు–నేడు కోసం రూ.16,255  కోట్లు ఖర్చు

10,032 వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తీసుకువస్తున్నాం

మూడు ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్‌ కేర్‌ ఆస్పత్రుల నిర్మాణం

కోవిడ్‌ వైద్యం కోసమే అక్షరాల రూ.3,648 కోట్లు ఖర్చు చేశాం

వైయస్‌ఆర్‌ కంటివెలుగుద్వారా 66లక్షల మంది పిల్లలు, 14.28లక్షల మంది  అవ్వాతాతలకు పరీక్షలు

కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచాం

మానవత్వంలో ఆదుకోవాలనే దేశానికే దారి చూపించాం

కోవిడ్‌ వచ్చినా కూడా 99.3 శాతం మంది ప్రజలను మనం కాపాడుకోగలిగాం

పేదల మీద మమకారంతో మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులివి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ: ప్రతి ఒక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు, వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెండున్నరేళ్లుగా ప్రతి అడుగు చిత్తుశుద్ధితో మనసా, వాచా, కర్మణ పూర్తి కమిట్‌మెంట్‌తో వేశాం. మనది మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడుకోసం రూ.16,255  కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2446ప్రొసీజర్లను తీసుకువచ్చామని, కోవిడ్‌ వైద్యాన్ని సైతం ఆరోగ్యశ్రీలోకి తెచ్చామని చెప్పారు. కొత్తగా 16 టీచింగ్‌ హాస్పిటల్స్‌ నిర్మాణం చేపట్టామన్నారు. 29 నెలలుగా ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు, మార్పులను వివరించారు.  

రెండున్నర సంవత్సరాల క్రితం మన ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉన్నాయని.. ఇప్పుడు ఎలా ఉన్నాయని బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. రెండున్నర సంవత్సరాల్లో వైద్య, ఆరోగ్యం మీద ఎంతగా దృష్టిపెట్టామని వివరాల్లోకి వెళితే.. 

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ
గతంలో ఆరోగ్యశ్రీకి వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా రూ.5 లక్షలకు పెంచడం జరిగింది. నెలకు రూ.40 వేలు సంపాదించే వ్యక్తి కుటుంబాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది. 
దీని వల్ల రాష్ట్రంలోని దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. 
ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడమే కాదు. పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వైద్యం చేయించుకునేందుకు.. అక్కడ కూడా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశాం. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 130 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎంప్యానల్‌ చేశాం. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకేశాం. 

ఇంతకుముందు ఎలా కత్తిరించాలి.. రెండున్నర, మూడు లక్షల లోపే వైద్యం ముగించేయాలి. క్యాన్సర్‌ లాంటి వైద్యానికి కీమోథెరపి ఏడు, ఎనిమిదిసార్లు చేస్తేకానీ నయం కాదని వాస్తవాలుతెలిసినా కేవలం రెండుసార్లకే అవకాశం ఇచ్చారు. రెండున్నర లక్ష దాటకముందే ఆరోగ్యశ్రీ అయిపోయిందని చేతులెత్తేసే పరిస్థితిని ఇంతకుముందు చూశాం. 

మన ప్రభుత్వంలో రూ.5లక్షల స్థాయి దాటిపోయి.. ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిలో బోన్‌మ్యారోట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ (రూ.10 లక్షలు) లాంటి వైద్యం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేయిస్తున్నాం. చిన్న పిల్లలకు మూగ, చెవుడు ఉంటే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషనే కాదు.. బైకాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ కూడా ఆరోగ్యశ్రీ పరిధి కింద తెచ్చాం. రూ.12లక్షలు చిన్న పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాం. రూ.11 లక్షలు విలువ చేసే హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంది. స్టెమ్‌సెల్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ రెండు మోడల్స్‌ రూ.6.3 లక్షలు, మరొకటి రూ.9.3 లక్షలు ఖర్చు చేసే మోడల్స్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం.
మనిషికి ఎంతకావాల్సి వస్తే అంత వైద్యం చేసే విధంగా ఆరోగ్యశ్రీ పథకం తనను  కాపాడుతుందనే భరోసా ఇచ్చే విధంగా పనిచేస్తున్నాం. 

29 నెలల కాలంలో వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ మీద మనం రూ.4 వేల కోట్ల పైచిలుకు మనం ఖర్చు చేశాం. గత ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంవత్సరం పాటు పెట్టిన బకాయిలు రూ.680 కోట్లు మనం అధికారంలోకి వచ్చాక చెల్లించాం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఎక్కడా పెండింగ్‌ బిల్లులు లేవు. 21 రోజులు దాటితే చాలు కచ్చితంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు డబ్బులు చెల్లించే విధంగా సీఎంఓ డ్రైవ్‌ చేసే పరిస్థితిలో ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది. 

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో సేవలన్నీ కనివినీ ఎరుగని రీతిలో విస్తరించాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆ పేదవాడికి వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది. ఆ పేదవాడు ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని.. ఈ రోజు ఏకంగా 2446ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం. అంతేకాకుండా.. ఇప్పటికీ హెల్త్‌ డిపార్టుమెంట్‌కు నా తరఫు నుంచి గైడెన్స్‌ ఇస్తూనే ఉన్నాను. ఇంకా అవసరమైన ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురమ్మని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్‌డిపార్టుమెంట్‌కు ఈరోజుకీ తెలియజేస్తూనే ఉన్నాను. 

గతంలో ఆరోగ్యశ్రీని ఎలా నిర్వీర్యం చేశారో చూశాం. స్వతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 గవర్నమెంట్‌ టీచింగ్‌ హాస్పిటల్‌ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్‌ పూరిగా అవే నిర్వీర్యం అయ్యే పరిస్థితులు గతంలో చూశాం. మనందరి ప్రభుత్వం కొత్తగా 16 టీచింగ్‌ హాస్పిటల్స్‌ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి వైద్య కళాశాల, దానికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల, 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇవన్నీ కూడా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకి తీసుకువచ్చే గొప్ప విప్లవానికి నాంది పలికాం. 

ప్రతి పార్లమెంట్‌ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. డాక్టర్లు, పీజీ స్టూడెంట్స్, మెడికల్‌ స్టూడెంట్స్, ట్రైన్డ్‌ నర్స్‌ అందుబాటులోకి గొప్ప దృక్పథంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ప్రత్యేకించి గిరిజనుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో కొత్తగా ఒక టీచింగ్‌ హాస్పిటల్‌ నిర్మాణం జరుగుతుందని సగర్వంగా సభ ద్వారా తెలియజేస్తున్నాను. 

పాడేరులోనే టీచింగ్‌ హాస్పిటల్‌తో పాటు మరో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఐటీడీఏ ప్రాంతాల్లో నిర్మించడం జరుగుతుంది. గ్రామం నుంచి జిల్లా వరకు ఆస్పత్రుల రూపాన్ని, సేవలు, సదుపాయలను సమూలంగా మార్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గ్రామస్థాయిలోనే వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10,032 వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ వస్తున్నాయి. 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తీసుకువస్తున్నాం. 1321 ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల రూపురేఖలు మారిపోతున్నాయి. 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. 191 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల రూపురేఖలు మారుతున్నాయి. వీటన్నింటినీ జాతీయ ప్రమాణాలతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. వీటిలో నాడు–నేడు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఫెసిలిటీస్, డాక్టర్ల రిక్రూట్‌మెంట్, నర్సుల రిక్రూట్‌మెంట్‌ అందరూ పూర్తిస్టాఫ్‌ ఉండేట్లుగా చేస్తున్నాం. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు–నేడు కోసం రూ.16,255  కోట్లు ఖర్చు చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నా. 

మనం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేశాం. విలేజ్, వార్డు సెక్రటేరియట్స్‌లో ఇప్పటికే మరో 15 వేల మంది ఏఎన్‌ఎంలు కూడా ఇప్పటికే భర్తీ అయిపోయింది. ఇవి కాకుండా మరో 14,788 పోస్టులు వచ్చే ఫిబ్రవరి మాసంలోపు భర్తీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. వైద్యరంగంలోనే దాదాపు 40 వేల పోస్టులు. ఇంతకుముందు మన గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో పరిస్థితి ఏమిటీ అని ఒక్కసారి ఊహించుకోమని అడుగుతున్నా. డాక్టర్లు, నర్సులు, పరికరాలు లేక ఎంత దారుణంగా ఉండేటివో ఆలోచించుకోవాలి. 

10,032 వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ మన ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో అక్షరాల మన గ్రామాల్లోనే 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రాక్టీషనర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) అక్కడే ఉంటారు. 24 గంటలు అందుబాటులో ఉంటారు. వీరిని పీహెచ్‌సీలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి 104 వాహనం. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీ అందుబాటులో ఉంటే.. మరో డాక్టర్‌ 104 ఎక్కి తనకు కేటాయించిన 4–5 గ్రామాల్లో పర్యటిస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా.. ఒక డాక్టర్‌ గ్రామానికి కనీసం 5 సార్లు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఊరులో ఉన్న ప్రతి  మనిషిని పేరుపెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఆ గ్రామంలో ఎంతమంది, ఏ రోగాలు ఉన్నాయి.. ఏ మందులు తీసుకెళ్లాలో అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను విలేజ్‌ క్లినిక్‌కు అనుసంధానం చేస్తాం. ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు అక్కడే ఉంటారు.. గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా మార్చే కార్యక్రమం జరుగుతుంది. మరో 6 నెలల్లో ఇవన్నీ ఆపరేషన్‌లోకి వస్తాయి. 

ఆరోగ్య ఆసరా అనే గొప్ప పథకాన్ని తీసుకువచ్చాం. ఆపరేషన్‌ పూర్తయిన తరువాత పేషెంట్‌ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తే.. ఆ కుటుంబం ఇబ్బంది పడకూదనే ఉద్దేశంతో ఆపరేషన్‌ తరువాత విశ్రాంతి సమయంలో వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా తోడుగా ఉండేలా నెలకు రూ.5 వేల వరకు ఇస్తూ.. రోగులకు తోడుగా నిలబడుతున్నాం. 

పాదయాత్రలో ప్రజలు బాధలు చూశాను. పెరలసిస్‌ వచ్చి వీల్‌చైర్‌కు పరిమితమై.. బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నవారిని పట్టించుకున్న నాథుడే లేడు. డయాలసిస్‌ వచ్చి ఇబ్బందుల్లో ఉండి నెల నెల ఖర్చులు ఉంటాయని తెలిసినా ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి రోగికి, లెప్రసీ వచ్చిన వారికి కూడా నెలకు రూ.3 వేలు అందిస్తున్నాం. డయాలసిస్‌ వైద్యం చేసుకునే  వారికి రూ.10వేలు, పెరాలసిస్‌ వైద్యం చేసుకునే వారికి రూ.5వేలు పెన్షన్లు ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

దృష్టిలోపాలు ఉన్నవారి కోసం గొప్ప చారిత్రక కార్యక్రమాన్ని చేపట్టాం. దృష్టిలోపం ఉన్నవారికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు, వైద్యం, శస్త్ర చికిత్సలు చేయించి, కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించే వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే దాదాపు 66 లక్షల మంది పిల్లలకు పూర్తిగా స్క్రీనింగ్‌ చేసి 1.58 లక్షల మంది పిల్లలకు కంటి అద్దాలు అందించడమే కాకుండా 300 మంది పిల్లలకు శస్త్ర చికిత్స చేయించాం. ఇప్పటికే 14.28లక్షల మంది  అవ్వాతాతలకు స్క్రీనింగ్‌ పూర్తిచేసి 7.83 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించాం. 1.13 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేయించాం. ఇవి నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 56.88 లక్షల మంది అవ్వాతాతల కోసం ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది. 

పిల్లల మీద ప్రత్యేకంగా ధ్యాసపెట్టాం. పిల్లలకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఉండాలి అని గట్టిగా నమ్మిన ప్రభుత్వం కాబట్టి.. పిల్లలకు సంబంధించి బైకాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయడానికి రూ.12 లక్షలు ఖర్చు  అవుతుందన్నా వెనకాడకుండా చేస్తున్నాం. ఆపరేషన్‌ చేసి వదిలేయకుండా.. సంవత్సరం పాటు వాయిస్‌ థెరపీకి డబ్బులిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. బైకాక్లియర్‌ ఇంప్లాంట్‌ పెట్టిన తరువాత బ్యాటరీ కొన్ని సంవత్సరాలకు చెడిపోతుంది. ఆ బ్యాటరీ ఖర్చును  కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. 

పిల్లలకు సంబంధించి హార్ట్‌కేర్‌ ఆస్పత్రి మన దగ్గర లేదని, తిరుపతిలో పద్మావతి చైల్డ్‌ హార్ట్‌ సెంటర్‌ను ప్రారంభించాను. పిల్లల కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్,హార్ట్‌కు  సంబంధించిన మూడు ఆస్పత్రులను మూడు ప్రాంతాల్లో నిర్మించేందుకు శ్రీకారం చుడుతున్నాం. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. వైద్యం కోసం ప్రజలు ఇబ్బందులు పడకూడదని కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక రాష్ట్రం మనదని సగర్వంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వమే కోవిడ్‌కు ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు ఎక్కడా లేవు. కోవిడ్‌ తరువాత కూడా.. బ్లాక్‌ ఫంగస్‌ వంటి సమస్యలు వస్తే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన మనసున్న  ప్రభుత్వం మనది. కోవిడ్‌పై యుద్ధంలో వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పీహెచ్‌సీలతో అనుసంధానమై.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ ద్వారా ఏరకంగా చేశామో రాష్ట్రమంతా చూశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి సర్వే చేసింది.. 31 సార్లు వలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయంలోని ఏఎన్‌ఎంలు వెళ్లి సర్వేలు చేశారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ.. మరోవైపున పరీక్షలు, ట్రీట్‌మెంట్‌లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. 

2021 నవంబర్‌ 23 నాటికి రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 2 లక్షల మందికి కోవిడ్‌ పరీక్షలు చేశాం. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 5.66 లక్షలమందికి కోవిడ్‌ టెస్టులు చేశాం. దేశమే గర్వం పడే విధంగా పరీక్షలు చేసిన అతికొద్ది రాష్ట్రాల్లో మనది ఒకటి. జాతీయ స్థాయిలో కోవిడ్‌ మరణాల రేటు 1.35 అయితే.. మన రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల మరణాల రేటు 0.70 శాతం మాత్రమే. కోవిడ్‌ వచ్చినా కూడా 99.3 శాతం మంది ప్రజలను మనం కాపాడుకోగలిగాం అని అర్థం.  

కోవిడ్‌ వచ్చిన కొత్తలో పరీక్షలు చేయించాలంటే శాంపిల్స్‌ను పూణెకు పంపించాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి మన  రాష్ట్రంలో 19 ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నాం. వ్యాక్సినేషన్‌లో రాష్ట్రంలో మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 3,41,53,000, దాదాపు 87 శాతం మందికి ఒక డోస్‌ పూర్తయింది. రెండు డోసులు తీసుకున్నవారు 2.39 కోట్ల మంది. దాదాపు 61 శాతం మందికి రెండో డోస్‌ కూడా ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్‌ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేనిది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని డోసులు పంపిస్తారో.. వాటినే మనం ప్రజలకు ఇవ్వగలుగుతాం. అయినప్పటికీ 18 ఏళ్లు పైబడిన 87 శాతం మంది ఒక్క డోసు, 61 శాతం రెండు డోసులు తీసుకున్నారు. 

కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసి.. వారి ఆలనాపాలనా చూసుకునేఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనది. మనం అమలు చేశాకే..ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా ఇదే బాటలో నడిచాయి. మానవత్వంతో ఎలా ఉండాలో దేశానికి దారి చూపించింది మన రాష్ట్రమేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. కోవిడ్‌ వైద్యం కోసమే అక్షరాల రూ.3,648 కోట్లు ఖర్చు చేశాం. ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెబుతూ.. 1068 వాహనాలను మండలానికి ఒకటి చొప్పున పంపించాం. మొబైల్‌ వాహనాల ద్వారా ప్రాణాలను కాపాడగలుగుతామని బెంజ్‌ సర్కిల్‌ నుంచి జెండా ఊపి ప్రారంభించాం. 

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రతి పీహెచ్‌సీలో ఒక అంబులెన్స్‌ కచ్చితంగా ఉండాలని, ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని మరో 432 నూతన 104 వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. 

గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే జనం భయపడేవారు. లైట్లు లేక సెల్‌ఫోన్లతో ఆపరేషన్‌ చేయిస్తున్నారని, ఎలుకలు కొరికి బాలుడు చనిపోయాడనే కథనాలు చూశాం. అటువంటి పరిస్థితి నుంచి ఆస్పత్రులను గొప్పగా మార్చే విప్లవాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెడిసిన్‌ వేసుకోవాలన్నా.. ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. గవర్నమెంట్‌ మందుల వల్ల ఏ రోగం నయం కాదనే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి..ఈరోజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉంటే తప్ప.. వేరే మందులు ఉండకూడదని కచ్చితమైన ఆదేశాలిచ్చాం. 

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టడానికి, రూ. 100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకురమ్మని పిలుపునిచ్చాం. భూములు ఇస్తాం..  ఆస్పత్రులు కట్టండి, 50 శాతం బెడ్లు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలకు కేటాయించండి.. అన్ని రకాలుగా  సపోర్టు చేస్తామని చెప్పాం. ప్రైవేట్‌రంగంలోనూ సూపర్‌ స్పెషాలిటీ సేవలను ప్రోత్సహించేందుకు అడుగులు ముందుకుపడ్డాయి. ఇవన్నీ రానున్న కొన్ని నెలల్లోనే కనిపిస్తాయి. 

పేదల మీద మమకారంతో, ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా మనందరి ప్రభుత్వం వేస్తున్న  అడుగులివి. దేవుడు ఆశీర్వదిస్తాడు.. ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్పగా అభివృద్ధి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. 
 

Back to Top