ప్రపంచంతో పోటీపడి గెలవాలని మేనమామగా నా కోరిక

అహోబిలపురం స్కూల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

పులివెందుల: ‘‘పిల్లలంతా బాగా చదువుకొని, ప్రపంచంతో పోటీపడి గెలవాలని మీ తల్లులకు మంచి అన్నయ్యగా, మీ అందరి మేనమామగా కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పులివెందుల అహోబిలపురంలో నాడు–నేడుతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గోరుముద్ద మెనూ, బైలింగ్వల్‌ టెక్ట్స్‌బుక్స్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ గురించి ఆరా తీశారు. అనంతరం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..

‘‘నాడు–నేడుతో రూపుదిద్దుకున్న ఈ స్కూల్‌ను చూస్తుంటే.. గవర్నమెంట్‌ బడులలో మన పిల్లలందరికీ మంచి జరుగుతుందని చూపించేందుకు గొప్ప నిదర్శంగా అహోబిలపురం స్కూల్‌ ఎప్పటికీ నిలిచిపోతుంది. విద్యా రంగంలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతలు మారాలి. అందరూ గ్లోబల్‌ సిటిజన్స్‌ అయి ప్రపంచంతో పోటీపడే పరిస్థితిలోకి వెళ్లాలి. అందరికీ బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్‌తో పాటు స్కూల్స్‌ తెరిచే నాటికి విద్యా కానుక కింద కిట్లు అందిస్తున్నాం. స్కూల్స్‌లో పిల్లలు బాగుండాలని, బాగా చదవాలని, మానసికంగా కూడా బాగుండాలని ఎప్పుడూ జరగని విధంగా గోరుముద్ద అనే కార్యక్రమంతో రోజుకు ఒక మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నాం. గోరుముద్ద, విద్యా కానుక, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ వరకు తెచ్చాం. ఇంతకుముందు క్లాస్‌ టీచర్లకే కష్టం అనే పరిస్థితి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్టులోకి స్కూళ్లు వెళ్తున్నాయి. మూడో తరగతి నుంచి పై తరగతులకు సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్టును తీసుకొస్తున్నాం. అమ్మ ఒడి, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్టు, ఇంగ్లిష్‌ మీడియం, విద్యా కానుక, గోరుముద్ద, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. ఎందుకంటే ప్రపంచంతో పోటీపడి మన పిల్లలంతా గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అందరూ చాలా చక్కగా చదువుకోవాలని, మీ మేనమామగా, మీ తల్లులకు మంచి అన్నయ్యగా కోరుకుంటున్నాను. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలి, మీరంతా గొప్పగా చదువుకోవాలి’’ అని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.  

Back to Top