అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులు

అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయస్‌ జగన్‌

క్రిస్మస్‌ సందర్భంగా తేనీటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి

విజయవాడ: అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉండి ఇంకా ఒదిగి ఉండేలా నేర్చుకోవాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సీఎం ప్రార్థించారు.  క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమాన్ని విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్‌ సందేశాన్ని వినిపించారు. మన హృదయం అనే ఇంటికి క్రీస్తు యేసును ఆహ్వానించడమే ఈ క్రిస్మస్‌ సందేశమని దైవజనులు జోసఫ్‌ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన సందేశాన్ని వినిపించారు. ఆయన మాట్లాడుతూ..ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు మోస్ట్‌ రెవ. జోసప్, డాక్టర్‌ జార్జ్, పాస్టర్‌ జాన్‌వెస్లీ, బాలస్వామి, ఇక్కడ ఉన్న పాదర్లు, పాస్టర్లే కాకుండా ఇక్కడికి వచ్చినా, రాలేకపోయినా నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా ఈ క్రిస్మస్‌మాసంలో ఈ వేడుక జరుపుకుంటున్న శుభసందర్భంలో అందరికీ మేరీ క్రిస్మస్‌ తెలియజేస్తున్నాను.
కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని అడిగాను. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్‌ గురించి చెప్పాలంటే నా కంటే ఇక్కడ ఉన్న వారు చాలా చక్కగా చెబుతారు. మనం నేర్చుకోదగ్గ పాఠం ఒక్కటి ఉంది. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడన్నదే. దేవుడు మనకు నేర్పించింది. మన నుంచి దేవుడు కోరుకున్నది ఒక్కటే. అధికారం అన్నది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు ఇంకా ఒదగాలి. ఇంకా సేవలకులమని గుర్తు పెట్టుకోవాలి. దేవుడి దయతో ఈ రోజు మీ బిడ్డగా ఉన్నానంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని, ఇంకా ఒదిగి ఉండే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ సేవ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి ఇంట్లో ఉన్న వారికి మరొక్కసారి మేరీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్‌ జగన్‌ తన సందేశాన్ని అందించారు.
 

Back to Top