అబద్ధాల్లో అపూర్వ సోదరులు

చంద్రబాబు, యనమలపై మంత్రి చెల్లుబోయిన వేణు మండిపాటు

14 ఏళ్ల టీడీపీ పాలన కంటే 26 నెలల్లోనే బీసీలకు ఎక్కువ ప్రయోజనం

బహిరంగ చర్చకు సిద్ధమా?

తాడేప‌ల్లి: బీసీల సంక్షేమానికి 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వ్యయం చేసిన నిధుల కంటే 26 నెలల పాలనలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సవాల్‌ విసిరారు. అబద్ధానికి చంద్రబాబు అన్న అయితే యనమల తమ్ముడి లాంటివారన్నారు. ఈ ఇద్దరూ అపూర్వ సహోదరుల్లా తప్పుడు అంకెలు చెబుతూ అసత్యాలను వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చరిత్ర మరచిన యనమల:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ బీసీలను అణగదొక్కుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయనకు ఇప్పుడే బీసీలు గుర్తుకు వచ్చినట్లున్నారు. నిజానికి వారి పాలనలో బీసీలను దారుణంగా దిగజార్చారు. ఆ చరిత్రను రామకృష్ణుడు మర్చిపోయారు. వారి దృష్టిలో బీసీలు అంటే ఒక క్లాస్‌. బాబు గారి క్లాస్‌ అంటే బిజినెస్‌ క్లాస్‌. కానీ మా సీఎంగారి దృష్టిలో బీసీలు అంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌.

అందుకే బుద్ధి చెప్పారు:
    మేము మీ మాదిరిగా ఏదైనా ఒక పథకం ఉంటే, ఓట్లు వేసిన 10 వేల మందిలో ఒక్కరికే ప్రయోజనం కల్పించి,  మీ వర్గానికి చెందిన వారికే మేలు చేయాలని చూడలేదు. జగన్‌గారి పాలనలో ప్రతి పథకం శాచురేషన్‌ పద్ధతిలో అమలు చేస్తున్నారు. మీరు బీసీలకు చేసిన ద్రోహం గుర్తించడం వల్లనే గత ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పారు. మీరు చేసిన దగాకోరు రాజకీయాలకు బీసీలు బలైపోయారు.

మా పార్టీ బీసీల పార్టీ:
    మేము గర్వంగా చెప్పుకోగలం. మా పార్టీ బీసీల పార్టీ. బీసీలకు వెన్నెముకలా నిల్చిన పార్టీ. మీరు బీసీలను ఎప్పుడూ వెనకే పెట్టారు. మీ 26 ఏళ్ల పాలనలో బీసీల అభ్యున్నతి కోసం పక్కాగా ఏదైనా ప్రణాళిక రూపొందించారా. కేవలం ఎన్నికల సమయంలో ఏదో ఒక ప్రకటన చేశారు తప్ప. ఆదరణ పథకంలో కూడా వారికి ఏవో పనిముట్లు ఇచ్చి, వారిని బానిసలుగానే చూశారు. కానీ మేము అలా చూడడం లేదు.
    బీసీలు అంటే ప్రజ్ఞాశాలులు. అందుకే వారి ప్రతిభ వెలికి తీయడానికి తగిన నిధులు ఇచ్చాం. వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి పథకంలో బీసీలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాం. 25 పథకాల ద్వారా బీసీలకు సహాయం చేస్తున్నాం. సీఎం టు సామాన్యుడు అన్న పద్ధతిలో, ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిధులు పంపిణీ చేస్తున్నాం.

సామాజిక న్యాయం:
    మీరు మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. దాన్ని ఎవరూ సహించరు. ఇవాళ మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. కానీ దాన్ని ఏనాడూ మీరు ఆచరించలేదు. రాష్ట్రంలో 139 కులాలు ఉంటే, ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వాటి డైరెక్టర్ల నియామకంలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం. 481 మంది డైరెక్టర్లను నియమిస్తే, అందులో సింహభాగం, 48 శాతం బీసీలకు ఇచ్చాం. 56 కార్పొరేషన్ల ద్వారా 672 మంది బీసీ నాయకులకు రాజ్యాధికారం కల్పించాం.
    మీ 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభ సభ్యుడిగా చేయలేదు. కానీ మా సీఎంగారు 4 రాజ్యసభ సీట్లు వస్తే, వాటిలో రెండు పదవులు బీసీలకు ఇచ్చారు. శాసనమండలికి 15 మందిని ఎంపిక చేస్తే, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో ఆ వర్గాల వారికి 50 శాతం ఇస్తున్నాం. ఇంకా అన్నింటిలో యాభై శాతం మహిళలకు ఇస్తున్నాం.    ఇవాళ మన కళ్ల ముందు కనిపిస్తున్న గ్రామ సచివాలయాల్లో దాదాపు 6.03 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారున్నారు.

దమ్ముంటే చర్చకు రండి:
    మీరు 26 ఏళ్ల పాలనలో బీసీలకు ఏం చేయలేదు. అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు కేవలం 26 నెలల పాలనలోనే బీసీలకు ఎన్నెన్నో చేశాం. మీకు సవాల్‌ చేస్తున్నాను. దానిపై చర్చిద్దాం. మీకు దమ్ముంటే రండి. మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను.

ఏనాడైనా ఆలోచించారా:
    బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ విజయసాయిరెడ్డిగారు ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు.
మీరు ఏనాడైనా ఆ కోణంలో ఆలోచించారా. బీసీలకు మేలు చేయాలని చూశారా.
    పేదరికం నుంచి బీసీలు బయట పడాలని, ప్రజల డబ్బు నేరుగా ప్రజలకు చేరాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశలోనే చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. నిజమైన సామాజిక, ఆర్థిక న్యాయం కోసం సీఎంగారు కృషి చేస్తున్నారు.

    కానీ ఇవేవీ మీకు కనిపించవు. మీ పాలనలో జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను వేధించుకు తిన్నారు. అంతులేని అవినీతికి పాల్పడ్డారు. సామాజిక న్యాయం అంటే ఏమిటో మీకు తెలియదు. అందుకే అసలైన సామాజిక, ఆర్థిక న్యాయం అంటే ఏమిటన్నది జగన్‌గారిని చూసి నేర్చుకోండి.

బీసీలకు ఆర్థిక న్యాయం:
    నిజమైన సామాజిక న్యాయం అంటే ఏమిటో ఇప్పుడు చెబుతాను. మా 26 నెలల పాలనలో వివిధ పథకాలలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.1,04,241 కోట్లు పంపిణీ చేస్తే, అందులో బీసీలకు అగ్రభాగం రూ.50,315 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదే విధంగా పరోక్షంగా (నాన్‌ డీబీటీ విధానం)లో ఈ 26 నెలల పాలనలో దాదాపు రూ.1,40,438 కోట్లు ఖర్చు చేస్తే, అందులో కూడా బీసీలకు అత్యధికంగా రూ.69,668 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. 

తప్పుదోవ పట్టించకండి:
    ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తమను ఆదుకునేందుకు సీఎం గారు ఉన్నారనే భరోసాతో బీసీలు థీమాగా ఉన్నారు. కానీ ఓడిపోయిన మీరు, అందుకు కారణాలు విశ్లేషించుకోకుండా, ఇవాళ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ విధంగా మళ్లీ ఒకసారి బీసీలను తప్పుదోవ పట్టించాలన్న భ్రమతో మీరు పని చేస్తున్నారు. 

    బీసీలకు అన్నీ తెలుసు. తమను ఎవరు ఆదుకుంటున్నారు. ఎవరి వల్ల తమ ప్రజ్ఞా పాటవాలు బయట పడుతున్నాయి. ఎవరితో తమకు తగిన గుర్తింపు వస్తోంది.. వంటి అన్ని విషయాలు బీసీలకు స్పష్టంగా తెలుసు. 
    ఆరోజు మత్స్యకారులకు మీరు ఏ మాత్రం సబ్సిడీ ఇచ్చారు. అది కూడా ఏ ఖాతాలో వేశారో కూడా తెలియదు. ఇవాళ లీటరు డీజిల్‌పై రూ.9 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. డీజిల్‌ కొనుగోలు చేసిన వెంటనే ఆ సబ్సిడీ వచ్చేలా చర్యలు చేపట్టాం. అదే విధంగా మత్స్యకార భరోసా. నేతన్న నేస్తం. ఇంకా చెప్పాలంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు అత్యున్నత వైద్య సేవలందేలా ఆరోగ్యశ్రీ పథకంలోనూ వారికి ప్రాధాన్యం. 

కానీ మీరేం చేశారు?:
    మీకు ఆరోజు ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా. స్వర్గీయ వైయస్సార్‌ గారు బీసీ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తే, దాన్ని కూడా మీరు తగ్గించారు.
    కడుపులో శిశువుగా ఉన్నప్పుడు మొదలు, పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి అడుగులో వారికి అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడే ప్రభుత్వం మాది. మీ పాలనలో పెన్షన్‌ పొందాలన్నా లంచం ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇవాళ ఒకటవ తేదీనే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ ఇస్తున్నారు.

వాస్తవాలు గుర్తించండి:
    బీసీ అయిన రామకృష్ణుడు ఇకనైనా వాస్తవాలు గుర్తించాలి. అబద్ధాలకు అన్న చంద్రబాబు అయితే, తమ్ముడిగా యనమల వ్యవహరిస్తున్నారు. మిమ్మల్ని బీసీలు నమ్మడం లేదు. అందుకే ఇకనైనా మారండి. కొత్త నాటకానికి తెర తీస్తున్నారు. దాన్ని ఆపండి. ప్రజలను ఇంకా మోసగించకండి.. అని మంత్రి శ్రీ వేణుగోపాలకృష్ణ హితవు చెప్పారు.

Back to Top