అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలని కేబినెట్ భేటీలో ప్రతిపాదించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల షూస్, నోటుబుక్స్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం వైయస్ జగన్ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లి సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు.
ప్రతిపాదనలు..
- ఎర్ర చందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్ ప్రతిపాదన
- సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేయాలని హోమ్ శాఖ నుంచి ప్రతిపాదన
- ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లుపై మంత్రివర్గం ముందుకు వచ్చిన ప్రతిపాదనల మీద చర్చ
- మన్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై చర్చ
- ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్‌పై మంత్రివర్గంలో చర్చ.
- ఈ కార్పోరేషన్ ద్వారా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు.
- ప్రకాశం జిల్లా దోనకొండలో ఈ సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు.