చీపురుపల్లి: సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తీరుపై వైయస్‌ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణ చీపురుపల్లిలో ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బొత్స స్పందిస్తూ.. ఖబడ్దార్ .. బాలకృష్ణా అంటూ హెచ్చరించారు. సోమవారం చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో బొత్స మాట్లాడారు. టీడీపీ కార్యకర్త అయినా..చీపురుపల్లికి చెందిన ఓ కుర్రాడిని కొట్టే అధికారం బాలకృష్ణకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బాధిత యువకుడు ఏ పార్టీకి చెందిన వాడో మాకు అనవసరం కానీ చీపురుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ‘మీరు సినిమా నటులైతే మీ యాక్షన్‌లు సినిమాల్లో చూపించుకోవాలి తప్ప వీధుల్లోకి వచ్చి మా కుర్రాళ్లను కొడతామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరన్న సంగతి గుర్తుంచుకోండి’ అని బాలకృష్ణను ఉద్దేశించి బొత్స అన్నారు. యువకుడికి బాలకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వీధుల్లోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యక్తిత్వ విలువలు కోల్పోయి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు, వ్యక్తిత్వం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు లేని ఇలాంటి వ్యక్తులను దగ్గరకు చేర్చితే వ్యవస్థకు నష్టమని వ్యాఖ్యానించారు. కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బాలకృష్ణ ...అభిమానులు, పార్టీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. గొంతు కోస్తా, అంతు చూస్తా... అంటూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా...చేయి చేసుకోవడంతో ఆయన తీరుపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.