జనవరిలో అటవీశాఖ పోస్టుల భర్తీ 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

అటవీ శాఖ అమరవీరులకు శ్రద్ధాంజలి 

విశాఖపట్నం: అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు ఖాళీల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. విశాఖ కంబాలకొండలో జరిగిన ఏపీ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్‌తో పాటు పలువురు అమర వీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మొక్కలు నాటి సీడీ ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్ధూపానికి పుష్పగుచ్చం ఉంచి‌ మంత్రి బాలినేని నివాళులర్పించారు. వీరప్పన్ చేతిలో హత్యకు గురైన  అధికారి శ్రీనివాస్‌తో పాటు అమరులైన సిబ్బందికి నివాళులర్పించడానికే ఈ అమరు వీరుల దినోత్సవం ఏటా నిర్వహిస్తున్నట్లు బాలినేని తెలిపారు.

అటవీ అధికారులకు నూతన వాహనాలు..
అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని తెలిపారు. జనవరి నాటికి అటవీ అధికారులకి నూతన వాహనాలు సమకూరుస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని...అధునాతన ఆయుధాలు సమకూరుస్తామన్నారు. ఏపీ అటవీ శాఖ వద్ద ఉన్న 60 టన్నుల ఎర్ర చందనం అమ్మడానికి కేంద్ర అనుమతి‌ కోరామని తెలిపారు. అటవీ శాఖలో ఇబ్బందులు అధిగమించడానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు

Back to Top