బాబు స్వార్థానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం

ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఖాజానా ఖాళీ చేశాడు

ఐదేళ్లలో చట్ట పరిధిని దాటి అప్పులు

రాష్ట్రంలో పెండింగ్‌లో మూడున్నర లక్షల బిల్లులు

తనకు అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ముడుపులు తీసుకున్నాడు

ధర్మపోరాట దీక్షలతో ఆర్టీసీని అడ్డగోలుగా వాడుకున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీని ఆదుకుంటాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తన స్వార్థం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే కుట్రతో ఖజానాను ఖాళీ చేశాడని మండిపడ్డారు. తనకు అనుకూల కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకునేందుకు సెంట్రల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌) సంస్థలో తన మనుషుల ద్వారా క్రమపద్ధతి లేకుండా చంద్రబాబు బిల్లులు చెల్లించుకున్నారన్నారు. చంద్రబాబు నిర్వాకంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం తిరగాల్సి వస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా తన కాంట్రాక్టర్లకు చంద్రబాబు బిల్లులు చెల్లించుకొని ఖాజానాను ఖాళీ చేశాడని మండిపడ్డారు. తరువాత వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదని చట్ట పరిధి దాటి చంద్రబాబు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించాడన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రానికి సంబం«ధించి పెండింగ్, పరిశీలనలో ఉన్నవి  3.46 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించండి. రాష్ట్రాన్ని బాధ్యతగా నడపాల్సిన మనిషి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడు. లక్షల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఉందా..? వీటిల్లో జీతాలు, రుణ అప్లికేషన్లు, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్, అద్దెలు చెల్లించాలి. ఇంధన చార్జీలు, పేద ప్రజలకు సంబంధించిన సబ్సిడీలు ఉన్నాయి. అవి కాకుండా వివిధ రంగాలకు చెల్లించాల్సిన సబ్సిడీలు రూ. 828 కోట్లు, హాస్టల్‌ బిల్స్‌ దాదాపు రూ. 78 కోట్లు, ఈపాస్‌ బిల్లులు 1248 కోట్లు, వివిధ కార్పొరేషన్స్‌కు గ్రాంట్స్‌గా ఇవ్వాల్సిన డబ్బు రూ. 4800 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ పథకాల కోసం చేపట్టిన భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణాలకు అత్యవసరంగా రూ. 880 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకే రూ. 693 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు రాక, ఎంత మంది ఎదురు చూస్తున్నారు. వారి గురించి ఆలోచించే ప్రయత్నం చేపట్టడం లేదు.

నిర్మాణ రంగంలో దాదాపు 29 వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 8200 కోట్లకుపైగా వివిధ నిర్మాణాలు చేసిన వారికి చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితి చూసి గత నెల ఏప్రిల్‌ 16న చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం రివ్యూ చేసి కొన్ని అత్యవసర బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి మార్పు రాకపోవడంతో ఏప్రిల్‌ 23న అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ రూపాల్లో ఉన్న బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత భారం ఉన్నా.. ఖజానాలో కేవలం రూ. 9000 కోట్లు ఉన్నట్లు చీఫ్‌ సెక్రటరీ తెలిపారు. వివిధ బ్యాంకుల నుంచి తాకట్టుపెట్టి తెచ్చిన లోన్‌లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లపై ఆరా తీసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను తన స్వప్రయోజనాల కోసం వాడుకోబట్టే ఈ పరిస్థితి వచ్చింది. గతంలో సెంట్రల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌) అనే సంస్థ చేసే పనిచేయకుండా అడ్డగోలుగా అడ్డుపడడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. 

ఫైనాన్స్‌ డిపార్టుమెంట్, ట్రెజరీ, పీఈఓలను చంద్రబాబు డమ్మీలను చేశాడు. కేవలం చంద్రబాబుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ బిల్లులు ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబుకు నిధులు ఇవ్వాలనుకున్నారో వారికి మాత్రమే వచ్చే విధంగా పర్సంటేజ్‌లు తీసుకొని చెల్లించారు. ఫైనాన్స్‌ సెక్రటరీకి మాత్రమే లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డు ఉండాలి. అలా కాకుండా సీఎఫ్‌ఎంఎస్‌ సంస్థకు సంబంధించి తనకు అనుకూలమైన వ్యక్తిని చంద్రబాబు నియమించుకొని అతనికి కూడా లాగిన్, పాస్‌వర్డ్‌ ఇచ్చి నిధులను వివిధ రూపంలో మళ్లించారు. లంచాలు తీసుకొని స్వార్థం కోసం  అనుకూలమైన వ్యక్తులకు బిల్లులు చెల్లించుకుంటూ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా క్రమపద్ధతిలో వస్తున్న వాటికి నిధులు చెల్లించాలని నిర్ధేశించేందుకు ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్‌ఐఐటీ అనే సంస్థకు సీఎఫ్‌ఎంఎస్‌ను అప్పగించారు. రాష్ట్ర విభజన తరువాత సాఫ్‌ ఇండియా అనే సంస్థకు ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత, చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చిన ఆర్థిక శాఖను గాడి తప్పించారు. చంద్రబాబు తనకు అనుకూలమైన వ్యక్తులకు బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారో.. అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. నిబంధనల ప్రకారం.. అత్యవసర పనులు, ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వని పరిస్థితి. సీఎఫ్‌ఎంఎస్‌ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొందరు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రెండు సార్లు రూ. 2 వందల కోట్లు కేటాయించారు.. దీనిపై ప్రశ్నిస్తే వెంటనే వెనక్కు తీసుకున్నారు. సీఎంఎఫ్‌ఎస్‌ సంస్థకు వివిధ శాఖల నుంచి 42 మంది తీసుకున్నారు. సెంట్రల్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ నుంచి 43 మందిని, ఒక కాంట్రాక్టు ఏజెన్సీ ద్వారా రిజర్వేషన్‌ సిస్టమ్‌ కూడా లేకుండా 145 మందిని తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ సమయంలో కూడా సంస్థకు సంబంధించిన ఉద్యోగులను పిలిపించుకొని తనకు అనుకూలమైన వ్యక్తులకు బిల్లులు చెల్లించాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు వైఖరి వల్లే ఆర్థిక శాఖకు గడ్డుకాలం ఏర్పడింది. 

చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు చేసి, ఇంట్లో వస్తువులు తాకట్టుపెట్టి బిల్లుల కోసం తీరగాల్సి వచ్చిందంటే చంద్రబాబు ప్రభుత్వం దౌర్భాగ్యం వల్లే. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదని తన చట్టపరిథి దాటి ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడు. సీఎంఎఫ్‌ఎస్‌ సంస్థ కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 168 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 10 కోట్ల బిల్లులు కూడా పెట్టారు. దేశంలో మూడున్నర లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్న పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా.. ? రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు కూడా నిలిపివేశారు. ఆశ్రమ పాఠశాలలో డైట్‌ చార్జీలు, హోంగార్డుల వేతనాలు, పోలీసుల డీఏ బిల్లులు కూడా చెల్లించడం లేదు. ఇంకా ఉద్యోగులు కొంతమంది భవిష్య నిధి అని దాచుకుంటారు. వివిధ అవసరాల కోసం ఆ డబ్బు తీసుకోకుండా నిలిపివేశారు. ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు ఆర్టీసీని ఇష్టానుసారంగా వాడుకున్నారు. కనీసం ఆ సంస్థకు డబ్బులు కూడా చెల్లించలేదు. మండిపడ్డారు. ఆర్టీసీ మూసివేయాలనేది చంద్రబాబు లక్ష్యం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆదుకుంటామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top