విశాఖ: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరింత మెరుగుపరిచి పేదలకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారని అపోలో గ్రూప్ ఎండీ ప్రీతారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించిందని కొనియాడారు. విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆమె మాట్లాడారు. ఆరోగ్య రంగంలో ఏపీ కృషి అభినందనీయమన్నారు. ఏపీలో అపోలో కార్యకలాపాలకు పూర్తి సహకారం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అపోలో భాగస్వామిగా ఉండటం గర్వగా భావిస్తున్నామని చెప్పారు.“సమృద్ధి అంటే మనం చూస్తున్నట్లుగా ఏపీ పరిపూర్ణంగా కనిపిస్తుందన్నారు. నేను ఈ నేలపై పుట్టానని చెప్పారు. రాష్ట్రం ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన ప్రజల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాలా చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ పటంలో ఏపీ మ్యాప్ స్పష్టంగా కనిపిస్తుందని, ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా అన్ని పరిశ్రమల గ్రూపులు ఏపీలోకి వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణను అందజేస్తామని , రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రీతారెడ్డి హామీ ఇచ్చారు.