తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సాయం చేయమని స్వామి వారిని వెంకన్న సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి వేడుకున్నాను. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సార్లు దర్శించుకున్న, ఎన్ని సార్లు చూసిన తనివి తీరని ఒక దివ్యమంగళ స్వరూపం స్వామి వారిది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామి వారిని కోరుకున్నాను. ఏపీలో కరోనాతో ఒక పక్క.. వరదలతో మరో పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా స్వామి వారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పోందడం ఆనందదాయకం. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తాం’ అన్నారు. విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని కోరాను: డిప్యూటీ స్పీకర్ కరోనా, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలందరిని కాపాడాలని స్వామి వారిని వేడుకున్నాను అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ‘వేంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉంది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టీటీడీ ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహించినప్పటికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది’ అని కోన రఘుపతి తెలిపారు.