శ్రీకాకుళం, ఒడిశాలో నేడు సీఎం వైయ‌స్ జగన్‌ పర్యటన 

 అమరావతి: శ్రీకాకుళం, ఒడిశాలో నేడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. 

శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు.

ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలు
  ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం జగన్‌ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు.
 
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం
► నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్‌ వివరించనున్నారు.
► బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనని అధికారులు తెలిపారు.
►  బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.
 
జంఝావతి ప్రాజెక్టు అంశం
► ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు.               
► 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు
► ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు.
► ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు.ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. ఈ మేరకు   ఆర్‌అండ్‌ఆర్‌కు సహకరించాలని ఏపీ ఒడిశాను కోరనుంది.

► కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు.
► కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించారు.
► 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి సీఎంకు వివరించారు.
► ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు.
►కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top