అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం వైయస్ జగన్... యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మరోసారి అధికారులతో మాట్లాడారు. సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.