సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని సమావేశ మందిరంలో మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీలో 49 అంశాలపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల ఆర్థికసాయం అందించనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లులపై చర్చించనున్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుపై, జగనన్న ఆరోగ్య సురక్షపై మంత్రిమండలి సమావేశంలో చర్చ జరగనుంది. కురుపాం ఇంజినీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించి ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఏపీ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు, పీవోటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై, దేవాదాయ చట్ట సవరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు.