వైయ‌స్ఆర్ చేయూతకు కేబినెట్ ఆమోదం.. 

ఈనెల 22న సీఎం వైయ‌స్ జగన్ చేతుల మీదుగా వైయ‌స్ఆర్ చేయూత ప్రారంభం

రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌

దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు

భావనపాడు పోర్టు విస్తరణకు మంత్రి మండ‌లి ఆమోదం

కేబినెట్ నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

అమ‌రావ‌తి:   వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామ‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్ల‌డించారు.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో 57 అంశాలకు మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  గ్రీన్ ఎనర్జీ లో రూ. 81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్‌.. 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.  దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. విశాఖ జిల్లాలో 96,250 ఇళ్లు, అనకాపల్లిలో 3,750 ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21.3 లక్షల మంది గృహనిర్మాణదారులకు ఇళ్లు మంజూరు చేసే పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పలు చట్ట సవరణలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామక ప్రక్రియలో ఎన్‌ఈటీ కచ్చితంగా పాస్ అవ్వాలని సీఎం జగన్ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు


కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

  • వైయస్సార్‌ చేయూత.
  • మహిళాసాధికారత, సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న నవరత్నాలు.
  • ఇందులో భాగంగా 45 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల స్వయం ఉపాధి, సుస్ధిర ఆర్ధిక ప్రగతి కోసం వైయస్సార్‌ చేయూత అమలు.
  • ప్రతీఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్ధిక సాయం.
  • ఇప్పటివరకు రూ.9,179.67 కోట్లు సాయం.
  • అదే అక్కచెల్లెమ్మలకు వరుసగా నాలుగేళ్ల పాటు ప్రతీఏటా చేయూత ద్వారా తోడుగా నిలబడుతున్న ప్రభుత్వం.
  • ఈ మొత్తంతో కిరాణాషాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి జీవనోపాధి మార్గాల ద్వారా ఉపాధి.
  • అమూల్, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్, ఐటీసీ వంటి దిగ్గజ కార్పొరేట్‌ సంస్ధలు, బ్యాంకులతో టై అప్‌ కావడం ద్వారా అక్కచెల్లెమ్మలకు చేయూత
  • తద్వారా వారి ఆర్ధిక సామాజిక, పరిస్థితులను పూర్తిగా మార్చే దిశగా అడుగులు
  • ఇది వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ చేయూత అమలు
  • ఈ నెల 22న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ చేతుల మీదుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ 
  • వారం రోజులపాటుమండల స్ధాయిలో పండగలా పంపిణీ కార్యక్రమం.
  • ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి.
  • దాదాపు రూ.4700 కోట్ల నగదు బదిలీ.
  • జలజీవన్‌మిషన్‌ ద్వారా 6 జిల్లాలకు తాగునీటి సరఫరాకు సంబంధించి నాబార్డు ద్వారా రుణసదుపాయం కోసం ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం. రూ.4020 కోట్ల రుణం.
  • గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 
  • గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.20 లక్షల నిధులు మంజూరు. 
  • ఆమోదించిన కేబినెట్‌. జీవో ఎంఎస్‌నంబరు 6లో ఇచ్చిన నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం.
  • పీడీ అకౌంట్‌ ద్వారా ప్రతి కలెక్టర్‌ ద్వారా త్వరతిగతిన బిల్లులు చెల్లించడానికి కేబినెట్‌ ఆమోదం. 
  • నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో పీఎంఏవై– వైయస్సార్‌ అర్బన్‌ కింద పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం.
  • గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులకు కేబినెట్‌ ఆమోదం.
  • గ్రేటర్‌ విశాఖ మున్సిపాల్టీ పరిధిలో విశాఖ జిల్లాలో 96,250 ఇళ్లు, అనకాపల్లి జిల్లాలో 3,750 ఇళ్ల నిర్మాణం.
  • నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 21.30 లక్షల ఇళ్లు మంజూరు. 
  • విశాఖపట్నంలో ఇళ్ల కేటాయింపుల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.8 నుంచి రూ.15 లక్షలు లబ్ది.
  • విశ్వవిద్యాలయాలకు సంబంధించి పలు చట్టాల సవరణకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.
  • యూజీసీ నిబంధనల కనుగుణంగా పలు సవరణలకు ఆమోదం తెలిపిన కేబినెట్‌. 
  • ఆర్జీయూకేటీ–2008 చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం.
  • నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
  • ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ కళాశాల మంజూరు.
  • కొత్తగా ఏర్పాటు కానున్న డిగ్రీ కళాశాలలో 24 మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, ఆవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 6గురు బోధనేతర సిబ్బంది నియామకానికి మంత్రిమండలి ఆమోదం.
  • పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో  80 రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, 6 గురు రెగ్యులర్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, మరో 48 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించడానకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
  • ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్‌ బేసిస్‌లో  25 మంది బోధనా సిబ్బంది, 6గురు బోధనేతర సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియామకానికి కేబినెట్‌ ఆమోదం.
  • ప్రతి ప్రభుత్వ విభాగంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు నియామకాల్లోనూ, పదోన్నతుల్లోనూ కల్పించేలా... ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ – 1996కు చట్ట సవరణ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సాధారణ పరిపాలనవిభాగంలో వివిధ కేడర్లలో 85 అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
  • ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో స్టాఫింగ్‌ పేట్రన్‌ను మార్పు చేస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • రహదారులు మరియు భవనాలశాఖలోని స్టేట్‌ ఆర్కిటెక్ట్‌ విభాగాన్ని బలోపేతం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
  • ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 8 పోస్టుల మంజూరుకు నిర్ణయం.
  • పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో ఉన్న మున్సిపల్‌ స్కూళ్లను వాటి పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • ప్రభుత్వ స్కూళ్ల తరహాలో పటిష్టమైన నిర్వహణ, పర్యవేక్షణ కోసమే ఈ నిర్ణయం.
  • గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో హార్టికల్చర్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • అమరావతిలో ఫేజ్‌ –1 కింద మౌలిక సదుపాయాల కల్పనా పనులకు రూ.1600 కోట్లు రుణానికి సంబంధించి ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేపడుతున్న అభివృద్ధి పధకాల అమలు కోసం... ఏపీసీఆర్డీఏ యాక్టు –2104, ఏపీఎంఆర్‌ అండ్‌ యూడీఏ యాక్ట్‌ – 2016లో సవరణలకు కేబినెట్‌ ఆమోదం. 
  • గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ఎర్త్‌ వర్క్‌లకు పరిపాలనాపరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం. 
  • గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే.. పైడిపాలెం ప్రాజెక్టు పరిధిలో పైడిపాలం, కుమరంపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • శ్రీకాకుళం జిల్లా భావనపాడులో ఏర్పాటు కానున్న పోర్టుకు సంబంధించి ప్రస్తుత పరిధిని పెంచుతూ, దీనికి సంబంధించి గతంలో చేసుకున్న మొమొరాండమ్‌లోని అంశాలకు సంబంధించి ఇండియన్‌ పోర్ట్స్‌ యాక్ట్‌ –1908 చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం. 
  • దీనివల్ల 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించనున్న ఉపాధి. 
  • ఈ పోర్టు ద్వారా ఏడాదికి 23.5 మిలియన్‌ టన్నుల కార్గో హేండిల్‌ చేసే సామర్ధ్యం.
  • పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో సెకండరీ పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు కోసం అవసరమైన రూ.1000 కోట్ల రుణాన్ని ఎస్‌ఐడీబీఐ నుంచి పొందేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన బ్యాంక్‌ గ్యారంటీ పొడిగించేందుకు  కేబినెట్‌ ఆమోదం.
  • ఈ నెల 5వతేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ – స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
  •  10 ప్రాజెక్టులకు గానూ 4 పరిశ్రమలుశాఖ పరిధిలోనూ, 5 విద్యుత్‌ శాఖపరిధిలోనూ, 1 పర్యాటకశాఖ పరిధిలోనూ ఏర్పాటు.
  • వీటి ద్వారా రాష్ట్రంలో రూ.1.25 లక్షల కోట్ల పెట్టబడులు.
  • ప్రత్యక్షంగా 40 వేలమందికి, పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి అవకాశాలు.
  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన 175 మంది ఖైదీలతో పాటు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 20 మంది ఖైదీలకు ప్రత్యేకంగా మంజూరు చేసిన క్షమాభిక్ష నిర్ణయానికి  కేబినెట్‌ ఆమోదం. 
  • రాష్ట్ర సర్వోన్నత న్యాయస్ధానంలోని గౌరవ న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్లకు 71  కోర్టు మాష్టర్లు, పర్సనల్‌ సెక్రటరీల పోస్టుల నియామకానికి కేబినెట్‌ ఆమోదం.
  • శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్‌ అదాలత్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. ఆయా లోక్‌అదాలత్‌ల పరిధిలో 40 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • పారిశ్రామికాభివృద్ధి తోడ్పాటులో భాగంగా అనంతపురం జిల్లాలో కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాయితీలు. 
  • ఏపీఐఐసీ, కియా మధ్య జరిగిన ఒప్పందంలో భూమి కేటాయింపులకు సంబంధించిన స్టాంప్‌ డ్యూటీ , రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలను  మినహాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.
  • తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్‌ బ్రాండ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఫ్యామలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం ఓబెరాయ్‌ గ్రూపునకు 30.32 ఎకరాల భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 
  • ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం. 
  • వివిధ ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లు, ఇతర సంస్ధలకు అవసరమైన ప్రభుత్వ భూములను నంద్యాల, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, విశాఖపట్నం జిల్లాలలో కేటాయించాలన్న  నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.   
  • ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ మేనేజిమెంట్‌ అధారిటీ ప్రతిపాదనల మేరకు పారిశ్రామిక పార్కులు, వివిధ సంస్ధలకు భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 
  • శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో యానిమల్‌ హజ్బెండరీ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల ప్రభుత్వభూమిని ఉచితంగా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం. 
  • శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బంజారా సేవా సంఘానికి ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ ఏర్పాటుకు అవసరమైన 44 సెంట్ల భూమిని కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం.
  •  వైయస్సార్‌ జిల్లా అమీన్‌ పీర్‌ దర్గాకు వివిధ సర్వే నెంబర్లలో 16.86 ఎకరాల స్దలాన్ని ఈద్గా, అనాధ సదనం కోసం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • ఎకరా రూ.1లక్ష చొప్పున కేటాయించాలని నిర్ణయం. 
  • వైయస్సార్‌ జిల్లా కడప మండలం చిన్న చౌక్‌లో 134 ఎకరాలను డాక్టర్‌ వైయస్సార్‌ ఆర్కిటెక్ట్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ కోసం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • వైయస్సార్‌ జిల్లా వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కోసం భూమిలిచ్చిన 379 మంది ఆసైనీపట్టాదారులకు అసైన్‌మెంట్‌ కమిటీ  నిర్ణయం మేరకు పరిహారం చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • ప్రకాశం జిల్లా రుద్రసముద్రంలో సోలార్‌ పపర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన 1454.06 ఎకరాల భూమిని ఏపీజీఈసీఎల్‌కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ప్రధాన కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  • విశాఖపట్నం జిల్లా ఆనందపురంమండలం గంభీరంలో రహదారులు, భవనాల శాఖకు 23.73 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • రాష్ట్ర వ్యాప్తంగా 679 రెవెన్యూ మండలాల్లో ఏఆర్‌ఐ(అడిషనల్‌ రెవెన్యూ ఇన్స్ఫెక్టర్‌) లేదా సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను డిప్యూటీ తహసీల్ధార్‌ పోస్టు కేడర్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల రీ–సర్వే, గ్రామ కంఠం భూముల రికార్డింగ్‌ ప్రక్రియ కోసం ఈ నిర్ణయం.
  • సర్వే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు లేదా గరిష్టంగా రెండేళ్లు వర్తించేట్టుగా లేదా రెండింటింలో ఏది ముందు పూర్తయితే దాన్ని అమలు చేయాలని నిర్ణయం.
  • వైయస్సార్‌ జిల్లాలో చిన్నచౌక్‌లో 17 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన 95 ఎకరాల భూమిని మున్సిపల్‌ శాఖకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, తాటితోట గ్రామాల్లో 304.15 ఎకరాలభూమిని 500 మెగావాట్ల పంప్డ్, హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటు  కోసం ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి భూమి కేటాయింపు. 
  • ఆంధ్రప్రదేశ్‌ టెనెన్సీ యాక్ట్‌ – 1956 కు సంబంధించిన డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం. 
  • వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వీరబల్లి మండలం, ఒంగిమల్లలో 1800మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్, హైడ్రో పవర్‌ ప్లాంటు ఏర్పాటుకు ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం. 
  • అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1600 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
  • ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మెగా ఇండ్రస్ట్రియల్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ కేబినెట్‌ ఆమోదం.
  • గ్రీన్‌కో కు సోలార్, విండ్‌ ఎనర్టీ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • కర్నూలు జిల్లా నంద్యాలలో 700 మెగావాట్ల సోలార్‌ పవర్, 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న (ఏ ఎం) ఆర్సిలర్‌ మిట్టల్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌. దీనికి అవసరమైన భూమి కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం.
  • రెన్యూవబుల్‌ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ 2020 సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.
  • ఖరీప్‌ 2022 పై కేబినెట్‌కు వివరాలందించిన అధికారులు.
  • రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 01–06–2022 నుంచి 05–09–2022 వరకు 438 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు.
  • ఇది నూటికి నూరు శాతం సగటు వర్షపాతం. 
  • ఇప్పటివరకు ఖరీప్‌ 2022లో 82 శాతం నాట్లు పూర్తి. 
  • మిగిలిన చోట్ల ఊపందుకున్న నాట్లు.
  • 2014–15 నుంచి 2018–19 వరకు సగటున 153 లక్షల మెట్రిక్‌ టన్నులగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి... 2019 నుంచి మూడేళ్లలో సగటున ఏడాదికి 13 లక్షల టన్నులకు పైగా పెరిగి 166.73 లక్షలకు చేరింది. 
  • ఖరీప్‌ 2022లో 5.05 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల సరఫరా
  • ఖరీప్‌ 2022కు అవసరమైన 19 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులుకు గానూ 18 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.
  • డీఏపీ ఎరువులకు రాష్ట్రంలో కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం ఇతర కాంప్లెక్స్‌ ఎరువులకు సబ్సిడీ తగ్గించడంతో డీఏపీకి డిమాండ్‌ పెరిగినా రాష్ట్రంలో సరిపడా నిల్వలు.
  • ఇ–క్రాప్‌లో 68 శాతం సాగు విస్తీర్ణం నమోదు. 
  • ఆర్బీకే విధానాలను ప్రశంచించిన ప్రపంచ బ్యాంకు.
  • రూ.2235 కోట్లతో 2022–23 సంవత్సరానికి వైయస్సార్‌ యంత్రసేవాపథకం. 
  •  
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వతరగతి చదువుతున్న 4,72,472 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబుల పంపిణీ పై కేబినెట్‌లో చర్చ.
  • వీరితో పాటు 8వతరగతి బోధిస్తున్న 50 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల పంపిణీకి నిర్ణయం.
  • సుమారు రూ.650 కోట్ల వ్యయంతో ట్యాబ్‌లు పంపిణీ.
  • ప్రతి ట్యాబ్‌లో 3 జీబీ రామ్, 32 జీబీ మొమెరీ, అదనంగా 64 జీబీ మెమొరీ కార్డ్‌ ఇవ్వనున్న ప్రభుత్వం.
  • ప్రతి ట్యాబ్‌కు వైఫై కనెక్షన్‌.
  • మూడేళ్ల వ్యారంటీతో ట్యాబ్‌ల పంపిణీ.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ట్యాబ్‌ల సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు.
  • ఏ విధమైన రిపేర్లు వచ్చిన వెంటనే సరిచేసి ఇచ్చేలా నిబంధనలు. 
  • ప్రతి ట్యాబ్‌లోనూ ప్రీలోడెడ్‌ సాఫ్ట్‌వేర్‌.
  • మార్కెట్‌లో రూ.16,446 విలువున్న ట్యాబ్‌ను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.12,843కే కొనుగోలు చేసి, విద్యార్ధులకు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం.
  • 2025లో పదోతరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ విధానంలో రాయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
  • బైజూస్‌తో కుదిరిన ఒప్పందం మేరకు 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు రూ.24వేలు ఖరీదు చేసే కంటెంట్‌ను ఉచితంగా విద్యార్ధులకు అందించనున్న ప్రభుత్వం. 
  • జీఎస్‌డీపీలో అత్యధిక వృద్దిరేటు సాధించిన ఆంధ్రప్రదేశ్‌.
  • దేశంలోఅన్నిరాష్ట్రాల కన్నా అత్యధికంగా 11.43 శాతం సాధించిన ఆంధ్రప్రదేశ్‌.
  • మరో 5 ఇతర రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రమే రెండంకెల వృద్ధి నమోదు.
Back to Top