మహిళా సాధికారతే ధ్యేయంగా..బ‌డ్జెట్‌

అమరావతి: మహిళా సాధికారత కోసం బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయించింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. మహిళా పాడిరైతులను ఏకీకృతం చేయడానికి అదే విధంగా వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను(ఎండీఎస్‌ఎస్‌) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. దళారులను తొలగించి పాడి రైతుల నుంచి నేరుగా 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి రూ.250 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించింది. ఈ విధానం ద్వారా పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు రూ.5-20 వరకు మెరగైన ధర లభిస్తోంది.

వైయ‌స్ఆర్‌ ఆసరా.. 
స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం వైయ‌స్ఆర్‌ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటించింది.  

► దీని కోసం బడ్జెట్‌లో రూ.6,700 కోట్లు కేటాయించింది.

వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ
సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి సీఎం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది.

► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది.

వైయ‌స్ఆర్‌ చేయూత
ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇచ్చింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది.

► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైయ‌స్ఆర్‌ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయించింది.

ఉజ్జావల, స్వధార్ గృహ పథకం
మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్జావల',  'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవాగృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్‌  నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయించింది.

Back to Top