ఏపీ బంద్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల నిర‌స‌న‌

 రాష్ట్ర‌వ్యాప్తంగా  డిపోలకే పరిమితమైన బస్సులు

 
విశాఖపట్నం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. శుక్ర‌వారం చేప‌ట్టిన ఏపీ బంద్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు పాల్గొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. విశాఖ న‌గ‌రంలోని మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో వైయ‌స్ఆర్  సీపీ ఎంపీలు  విజయసాయిరెడ్డి,  ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌,  కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విజ‌య‌వాడ‌లోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నిరసనతో  బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. బంద్‌లో వైయ‌స్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, పార్టీ నేత‌లు తదితరులు పాల్గొన్నారు. బంద్ ప్ర‌క‌టించ‌డంతో  కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థ‌లు, దుకాణాలు, సినిమా హాల్స్ మూత ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి.  ట్రావెల్స్, ఆటో డ్రైవ‌ర్ లు కూడా బంద్ పాటిస్తుండ‌టంతో జ‌న‌ సంచారం నిలిచిపోయింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు‌ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కమ్యూనిస్టు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top