చంద్ర‌బాబు రాజ‌కీయాల నుంచి వైదొలగడమే మంచిది

ప‌బ్లిసిటీ పిచ్చితో 40 మందిని బ‌లితీసుకున్నాడు

విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేయడం దారుణం

పోలీసుల‌ను విమ‌ర్శించే చంద్ర‌బాబు.. వారి రక్షణ లేకుండా గంట బ‌య‌ట‌ తిరగగలడా..?

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో అన్ని రాజ‌కీయ‌ పార్టీల‌కు వ‌ర్తిస్తుంది 

అహంకారంతో విర్రవీగిపోతున్న బాబుకు ప్రజలే సమాధానం చెబుతారు 

అన్న‌మ‌య్య జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి 

రాయ‌చోటి: పబ్లిసిటీ పిచ్చితో 40 మందిని బ‌లితీసుకున్న చంద్ర‌బాబు.. నైతిక బాధ్యతగా రాజకీయాల నుంచి వైదొలగడమే మంచిదని అన్న‌మ‌య్య జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఎమ్మెల్యే  గ‌డికోట‌ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చంద్రబాబు నాయుడు దాడులు చేయించడంపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చట్టాలను తీసుకొస్తాయని, ఆ చట్టాలను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కానీ, దేశంలోనే సీనియర్ రాజకీయ నేతగా చెప్పుకునే చంద్రబాబు.. చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్ర‌శ్నించారు. 14 సంవత్సరాలు సీఎంగా, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్ర‌బాబు అల్లర్లు, గొడవలను ప్రేరేపిస్తూ పోలీసులపై దాడులు చేయించడం ఎంతవరకు న్యాయమని నిల‌దీశారు. చంద్ర‌బాబు తీరుపై ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి మండిప‌డ్డారు. రాయ‌చోటిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడారు.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబ‌ర్ 1.. రాష్ట్రంలోని అన్నీ రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్ల పైన మీటింగ్ లు పెట్టవద్దని జీవో ఇస్తే, ఆ జీవోను అగౌరవపరిచేలా మాట్లాడటం బాబుకు తగదన్నారు. ఇలా ఏదో ఒక అంశంపై అలజడి సృష్టించే ప్రయత్నానికి చంద్రబాబు కుట్రలు చేస్తుంటారని ధ్వ‌జ‌మెత్తారు. బాబు చేస్తున్న దుశ్చర్యలకు ఎల్లో మీడియా కూడా తోడైందని, రాజకీయంగా పతనమైన విషయాన్ని గమనించిన చంద్రబాబు ఏదోరకంగా అధికారంలోకి రావాలన్న కుట్రలు కుతంత్రాలతో ప్రజాభిమానం లేకపోయినా నీచ సంస్కృతికి తెరతీస్తున్నారని మండిప‌డ్డారు. వారం రోజుల వ్యవధిలోనే పబ్లిసిటీ కోసం 11 మందిని పొట్టన పెట్టుకున్నాడ‌న్నారు. ఇంతటి ఘోర సంఘటన జరిగినా చంద్రబాబులో ఏ మాత్రం బాధ, సానుభూతి లేకపోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబాలు రోడ్డున పడ్డా వారిపై ఏమాత్రం కనికరం చూపకపోగా, డబ్బుతో ఎవరినైనా కొనేయవచ్చన్న అహంకారంతో విర్రవీగిపోతున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు, కాలం తప్పకుండా సమాధానం చెబుతుందన్నారు. 

రోడ్లపై ఎక్కడపడితే అక్కడ, సభలు పెట్టడం, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రజాజీవనానికి ఇబ్బందులు కలగజేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం జీవోను తీసుకువచ్చిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్రదేశాలలోనూ, పెద్ద మైదానాలలో సభలు, సమావేశాలు ఇతర రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. ఓపెన్ ప్రదేశాలలో టిడిపి కార్యక్రమాలు చేపడితే ప్రజలు రారన్న దురుద్దేశంతో, భయంతో ఇలా రోడ్లపైకి వచ్చి రెచ్చిపోవడం, చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన పబ్లిసిటీ కోసం 11 మంది హత్యకు కారకుడైన ఆ పాపాన్ని మాత్రం పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. 

పోలీసులను విమర్శించే బాబు వారి రక్షణ లేకుండా ఒక గంట బయట తిరగగలుగుతాడా అని  నిలదీశారు. తనకు బ్లాక్ కమాండర్స్ ఉన్నారన్న గర్వంతోనే రక్షణగా ఉన్న పోలీసులపై ఇలాంటి దాడులకు తెగబడడం సమంజసం కాదన్నారు. తన రక్షణ కోసం రోజుకు సుమారు రెండు కోట్ల  రూపాయలు ఖర్చు అవుతోందని, ఇది  ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబన్నారు.  దురదృష్టకర సంఘటనలకు ప్రేరేపించే ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలోనే ఉండటం ఈ రాష్ట్ర ప్రజల చేసుకున్న కర్మగా ఆయన అభివర్ణించారు. 

ప్రజలకు మంచి జరిగాలని మంచి నిర్ణయాలు తీసుకోవడాన్ని రాజకీయం చేయడం, అడ్డుగోలుగా వ్యవహరించడం బాబుకే చెల్లిందన్నారు. తన పబ్లిసిటీ పిచ్చి వలన గోదావరి పుష్కరాలలో 29 మంది, ఈ మధ్యకాలంలో 11 మంది మొత్తం 40 మందిని హత్య చేసిన ఘనత బాబుకు దక్కుతుందన్నారు. హత్య చేసిన ఈ పాపాలు బాబును జీవితాంతం వెంటాడుతాయన్నారు. బాబు ఇప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తూ రాజకీయాలనుంచి వైదొలగడమే మంచిదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరమన్నారు. తనకున్న మీడియా బలంతో ఇంతటి దుర్ఘటనలు జరిగినా గంటలోనే వాటిని ప్రజల దుస్థితిని మళ్లించేలా దుర్మార్గపు ఆలోచన చేయడం క్షమించరాని విషయం అన్నారు. వీటన్నిటిని ప్రజలు అనునిత్యం గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బాబుకు తగిన బుద్ధి చెబుతారని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.

Back to Top