అమలాపురం: ‘మాట ఇస్తే.. చేస్తానంతే..’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. బాధితులు కోరిన ఆర్థిక సహాయాన్ని 24 గంటల్లో రోగులకు, పేదలకు అందేలా చేసి వారిపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సీఎం వైయస్ జగన్ బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి వివాహానికి వచ్చిన సీఎం వైయస్ జగన్‌ను కలిసి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 24 గంటలు తిరగకుండానే 25 మంది బాధితులకు రూ.26 లక్షలను కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. లబ్ధిపొందినవారిలో పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధుల బాధితులు ఉన్నారు. సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందించడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యసేవలు అందించాలని సీఎం ఆదేశించినట్టు కలెక్టర్ శుక్లా తెలిపారు. వీరిలో టి.సుజాతకు రూ.రెండులక్షలు అందించారు. డీఎం అండ్ హెచ్‌వో ఎం. బాబూరావు దొర, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాధాకృష్ణ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఏవో కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు.