సీఎం వైయస్ జగన్ చొరవ.. ప్రాబ్లమ్‌ సాల్వ్‌

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సాధారణ పరిస్థితి 

తెలంగాణ నుంచి వచ్చిన 44 మందిని క్వారంటీన్‌కు  తరలింపు

 

అమరావతి : కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరూ ఇబ్బందులు పడకుండా సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.  ఏపీ సరిహద్దు ప్రాంతంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద గురువారం సాధారణ పరిస్థితి నెల‌కొంది. తెలంగాణ నుంచి వచ్చిన 44 మందిని అధికారులు నూజివీడు క్వారంటైన్‌కు బ‌స్సులో త‌ర‌లించారు. మిగిలిన వాహ‌న‌దారులు హైదరాబార్‌కు తిరిగి వెళ్లిపోయారు. క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించని 200 మందిని సురక్షితంగా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసేయాలనే నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి తరలివచ్చి ఇబ్బందులు పడుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్‌లోనే ఉండేలా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పించింది.

ఈ అంశంపై తొలుత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బుధవారం ఫోన్లో మాట్లాడారు. అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరిపారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉన్న వారిని హెల్త్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి రాష్ట్రంలోకి అనుమతించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అనంతరం చెక్‌పోస్టుల వద్ద ఉన్న విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, వారిని రాష్ట్రంలోకి అనుమతించారు. 

ప్రస్తుతం తెలంగాణ వైపు నుండి వచ్చే కార్లను తెలంగాణ చెక్ పోస్టు నుంచే అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఒక‌వేళ అత్యవసర పనులు ఉంటే మెడికల్ సంబంధిత కారణాలతో తగిన సాక్ష్యాలతో క్లీన్ సర్టిఫికెట్‌లు క‌లిగి ఉన్న వాళ్లకు మాత్రమే అనుమ‌తి ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోప‌లికి అనుమతించడం లేదని, ఎక్కడి వారు అక్కడే తమ నివాసాలకు పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ప్రజలెవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రైతు బజార్‌ మార్కెట్లకు ప్రభుత్వం వికేంద్రీకరిస్తోంది. ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రజలను నియంత్రిస్తూనే వారికి కావాల్సిన వస్తువులు అందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
 

Back to Top