బాబు తరపున ఏబీవీ అరుపులేమిటి?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు  

ఐపీఎస్‌ వృత్తికే ఏబీ వెంకటేశ్వరరావు ఒక కళంకం

ఆయన తన వృత్తికి ఎంతో ద్రోహం చేశాడు

ఏబీ ఏనాడూ జాతి, ప్రజల కోసం విధి నిర్వర్తించలేదు

ఏ త్యాగమూ చేయలేదు. టీడీపీ కోసమే పని చేశాడు

అచ్చం టీడీపీ కార్యకర్తలా వ్యవహరించాడు

23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేలా చూశాడు

అందుకే అప్పుడూ, ఇప్పుడూ అదే మాట చెబుతున్నాం

 ఏబీవీ ఇంకా రిటైర్‌ కాలేదు. సస్పెన్షన్‌లో ఉన్నారు

అంటే ఆయన ఇంకా ప్రభుత్వ ఉద్యోగి అన్నమాట

అయినా సిగ్గు లేకుండా మీడియాతో మాట్లాడారు

చంద్రబాబును కాపాడడం కోసమే ఆయన ప్రెస్‌మీట్‌

స్పైవేర్‌ దుమారం నుంచి చంద్రబాబును కాపాడాలి

అదే ఏబీ వెంకటేశ్వరరావు ఉద్దేశం. ఇది వాస్తవం

తాడేపల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తరపున ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అరుపులేమిట‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. పెగాసస్‌ స్పైవేర్‌పై రాష్ట్రంలోనూ, దేశంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇవాళ సభలో కూడా చర్చ జరిగింద‌న్నారు. దీనిపై హౌజ్‌ కమిటీ వేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శాసనసభలో మాట్లాడుతూ, పెగాసస్‌ స్పైవేర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కొన్నారని చెప్పారు. అది విస్తృత చర్చకు దారి తీసింది. వాస్తవానికి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విపక్షనేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసి సమాచారం సేకరించారన్న ఆరోపణలు చాలా వచ్చాయ‌న్నారు. ఇప్పుడు మమతాబెనర్జీ ఏకంగా సభలో చెíప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు చంద్రబాబు బయటకు వచ్చి మాట్లాడలేదు. లోకేష్‌ మాత్రం భుజాలు తడుముకుంటూ మాకు సంబంధం లేదని చెప్పాడు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే..!:
    ఇవాళ మరో విచిత్రం ఏమిటంటే, ఆనాడు ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేశారని తేలడంతో, ఇప్పుడు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన సర్వీసులోనే ఉన్నారు. నిజానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీ వెంకటేశ్వరరావు, ఇవాళ మీడియా ముందు మాట్లాడుతూ, చంద్రబాబును సమర్థిస్తున్నారు. ఇది ఒక విచిత్రం.

ఆ మాట చెప్పాల్సింది బాబు:
    సర్వీసులో ఉండి, సస్పెన్షన్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ ప్రెస్‌మీట్‌లో చాలా మాట్లాడారు. 2019 మే వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా పెగాసస్‌ స్పైవేర్‌ కొనలేదని ప్రజలకు చెబుతున్నాను. హామీ ఇస్తున్నాను. భరోసా ఇస్తున్నాను అని ఆయన చెబుతున్నారు. కానీ నిజానికి ఆ మాట చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు కదా?.
    నీవు ఇంకా సర్వీసులో ఉన్నావు. ఆ విషయం మర్చిపోయావా. అయినా నీవు చంద్రబాబు కోసం పని చేశావు. ఇప్పుడు కూడా పని చేస్తున్నావు. మరి అలాంటప్పుడు ప్రెస్‌మీట్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎందుకు పెట్టావు. టీడీపీ ఆఫీసులో పెట్టొచ్చు కదా?.

వృత్తికి ద్రోహం చేశావు:
    నీవు నిజంగా దేశానికి, ప్రజలకు ఏం చేశావు? ఉన్నత పదవిలో ఉండి పంచాయతీలు చేశావు. 23 మంది వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్పించావు. నీవు వృత్తికి ద్రోహం చేశావు. చంద్రబాబు సేవలో తరించావు. ఇప్పుడు కూడా ఆయనను కాపాడడం కోసమే మీడియా ముందుకు వచ్చి, కబుర్లు చెబుతున్నావు.

నిజంగా ఆ రెండూ ఉంటే..:
    ఏపీ మట్టిలో పుట్టా. పెరిగా. ఇక్కడి బడుల్లోనే చదువుకున్నా.  నాగాలాండ్‌ నుంచి రాలేదు. తనకు సిగ్గు, శరం, భయం, లజ్జ ఉన్నాయని ఏబీ అన్నాడు, నిజంగా నీకు సిగ్గు, లజ్జ ఉంటే 23 మంది ఎమ్మెల్యేలను ఎలా పార్టీ మార్పించావు. వారిలో నలుగురిని మంత్రులు కూడా అయ్యేలా చూశావు. వారికి డబ్బు సంచులు మోసింది నీవు కాదా? నిజం చెప్పాలంటే నీవు ఒక ద్రోహివి. ఐపీఎస్‌ వృత్తికే కళంకం తెచ్చావు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించి, తెలుగుదేశం సేవలో తరించావు. 

ఆ ధైర్యం ఉందా?:
    పరువు నష్టం దావా వేస్తావా? ఎవరిమీద వేస్తావు? నీవు ఇంకా రిటైర్‌ కాలేదు. సర్వీసులో ఉన్నావు. మరి ఎవరి అనుమతి తీసుకుని ప్రెస్‌మీట్‌ పెట్టావు. చంద్రబాబును సమర్థిస్తూ మాట్లాడావు. ఆయనను కాపాడేందుకే మీడియా ముందుకు వచ్చావు. అసలు ఐపీఎస్‌ అధికారులే సిగ్గు పడే విధంగా నీవు ఆనాడు పని చేశావు. ఇవాళ అదే పని చేస్తున్నావు. టీడీపీ కోసం పని చేసి ఎన్నో పంచాయతీలు చేశావు. అవన్నీ చెప్పమంటావా? అలాంటి నీవు మాపై పరువునష్టం దావా వేస్తావా? 

చిరు ఉద్యోగిపై ఎందుకు పడ్డావు?:
    చివరకు మా చిరు ఉద్యోగి పూడి శ్రీహరి మీద కూడా పడ్డావు. సీపీఆర్వో మీద ఎందుకు ఎక్కుతున్నావు. ఎందుకు దిగజారిపోయిన పనులు, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు.

నీ ప్రవర్తన గర్హనీయం:
    ఏబీ వెంకటేశ్వరరావు, నీవు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేయడం లేదు. చంద్రబాబు కోసమే పని చేస్తున్నావు. జాతి ప్రయోజనాల కోసం అస్సలు నీవు పని చేయడం లేదు. నిజానికి ఎందరో ఐపీఎస్‌ అధికారులు జాతి కోసం, ప్రజల కోసం పని చేశారు. చేస్తున్నారు. కాబట్టి నీకు ఏ మాత్రం విలువ లేదు. నీకు సిగ్గు, శరం, లజ్జ ఉంటే ఈ పనులన్నీ చేయవు. నీ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. నీవెన్ని పరువు నష్టం దావాలు వేసినా వెనుకంజ వేయం. అన్నీ ఎదుర్కొంటాం.

ఆ ఆరోపణలు మేము చేయలేదు:
    మళ్లీ చెబుతున్నాం. పెగాసస్‌ గురించి మేము ఆరోపించలేదు. పశ్చిమ బెంగాల్‌ సీఎం స్వయంగా అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలి.
    మమత ఆరోపణలు చేయడంతో, ఏం చేయాలో తోచక, చంద్రబాబును కాపాడేందుకే ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడాడు. ఆనాడు వారు చేసింది అక్రమ వ్యవహారం కాబట్టి, ఎక్కడా ఆధారాలు, రుజువులు ఉండవు. ఎందుకంటే అది చట్ట వ్యతిరేకం కాబట్టి. దొంగపని కాబట్టి. అందుకే దర్యాప్తు చేయాలని నిర్ణయించాం. హౌజ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం.

 వాటి గురించి మాట్లాడాల్సి వస్తే..:

    నా రాసలీలల గురించి లోకేష్‌ మాట్లాడితే, లోకేస్‌ రాసలీలలు, ఆయన కుటుంబ సభ్యుల రాసలీలల గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి. లోకేష్‌ వాళ్ల నాన్నను అసెంబ్లీకి రమ్మనండి. ఆయనేమో మీడియా ముందు ఏడ్చి, సభకు రానన్నాడు. మరి లోకేష్‌ మాత్రం ఎందుకు సభకు వస్తున్నాడు. కాబట్టి లోకేష్‌ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అలాగే లోకేష్‌కు ధైర్యం ఉంటే, తన తండ్రి ఆస్తుల మీద విచారణ కోరాలి.

ఆనాడూ ఇప్పుడూ మాది ఒకే మాట:
    ఆనాడు ఏబీ వెంకటేశ్వరరావు పక్కాగా టీడీపీ కార్యకర్తలా పని చేశాడు కాబట్టే, మేము ఆయనపై ఆరోపణలు చేశాం. మరే ఇతర అధికారులను కానీ, డీజీపీని కానీ మేము ఏమీ అనలేదు కదా? 23 మంది శాసనసభ్యులు పార్టీ మారడానికి ఏబీ వెంకటేశ్వరరావు అన్నీ తానై నడిపాడు. డబ్బు సంచులు మోశాడు అని ఆరోజే చెప్పాం. ఇవాళ కొత్తగా ఏం అనడం లేదు కదా? కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్లి చూడండి.. అని శ్రీ అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top