గుంటూరు జిల్లా: పొన్నూరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులపై జరిగిన దాడి ఘటనపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, దాడికి పాల్పడిన వారిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో అరాచకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు. అధికార మదంతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరిపితే సహించబోమని స్పష్టం చేశారు. దాడులకు పాల్పడుతున్న టిడిపి గుంపులకు హెచ్చరిక జారీ చేస్తూ, “మీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని భావించి ఎలా పడితే అలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని అన్నారు. దళిత నాయకులపై జరిగిన దాడి ఘటనలో బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీకి చెందిన పలు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు.