వరదలతోనే ఇసుక సేకరణకు ఇబ్బందులు

వారం రోజుల్లో సమస్యను అధిగమిస్తాం.. అందరికీ ఇసుక అందిస్తాం

డీకాస్టింగ్‌ భూముల్లో ఇసుక సేకరణ ప్రారంభించాం

ఇసుకపై చంద్రబాబు నీచ రాజకీయం

వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రతిపక్షం విషప్రచారం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సచివాలయం: నదుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇసుక సేకరణకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, దీనిపై కూడా చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఎప్పుడూ లేని విధంగా పొంగిపొర్లుతున్నాయన్నారు. దీంతో రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారని, మరో పక్క ఇసుక కావాల్సిన వారికి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఇబ్బందులను అధిగమించి వినియోగదారులకు ఇసుక అందజేస్తామని చెప్పారు. ఇసుక అంతా కొట్టుకుపోయిందని, ప్రభుత్వ నూతన ఇసుక విధానంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు, ఆయన తాబేదారులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
 
సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇసుకతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. గత ఐదేళ్లు ఇసుకను ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఆ ఇసుక వల్లే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయింది. ఇసుక ఎక్కడా నిల్వ లేదని విషప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల చొప్పున ప్రతి నదిలో పేరుకున్నాయి. ఒక సంవత్సరానికి రెండు కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం ఉంటుంది. ఐదేళ్లు ఇసుకకు డోకా లేదు. దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.

సెప్టెంబర్‌ 5వ తేదీన నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ర్యాంపులు వేసిన తరువాత మళ్లీ వరద రావడం ర్యాంపులు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. వాటిని అధిగమించి ఇప్పటి వరకు 6.7 లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇవ్వడం జరిగింది. 36 వేల మంది వినియోగించుకున్నారు. సీసీ కెమెరాలు, స్టాక్‌ యార్డుల వద్ద 40 పైగా వేబ్రిడ్జిలు అమర్చడం జరిగింది. ఇంకా 40 అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వరద తగ్గేలోపు పకడ్బందీగా చేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇసుకను ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కావాలని ప్రభుత్వం ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి.
 
డీకాస్టింగ్‌ పట్టాలు పది చోట్ల సేకరించాం. 82 పట్టా భూములు రైతులను ఒప్పించి తీసుకున్నాం. డీకాస్టింగ్‌ భూముల్లోని ఇసుక తీసుకొని టన్నుకు రూ. 60 ఇస్తామని గతంలో చెప్పాం. దానికి ఎవరూ ముందుకు రాలేదు. దాన్ని రూ.వందకు పెంచి ఒప్పించి దాదాపు 82 పట్టా భూములు తీసుకున్నాం. వాటిల్లో 10 చోట్ల పనులు ప్రారంభించాం. లక్ష క్యూబిక్‌ మీటర్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. వరదల కారణంగానే ఇసుక లభ్యత కొరవడిందని ప్రజలంతా ఆలోచించాలి. బాబు ఉన్నప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇసుకను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ఇసుక దోపిడీ వల్ల బోటు మునిగిన సంగతి తెలిసింది. చంద్రబాబు ఇసుక దోపిడీపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ రూ.వంద కోట్ల జరిమానా గతంలో విధించింది. ఆ విధంగా కాకుండా ఎవరికీ ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఇసుక ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

Read Also: తిరుమలలో దళారీ వ్యవస్థకు చెల్లు

తాజా ఫోటోలు

Back to Top