తాడేపల్లి: వైయస్ జగన్ పాలనలో పేదలు, మధ్యతరగతి వారికి అందిన భరోసా, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో పార్టీ గొంతుకను బలంగా వినిపించాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైకి తీసుకురావాలని సూచించారు. వైయస్ జగన్ గారి పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరిద్దామన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లకు సోమవారం ట్రైనింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, చల్లా మధుసుదన్ రెడ్డి, పుత్తా శివశంకర్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం: సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలి. మీరు ఫోకస్డ్‌గా పనిచేయడానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్‌తో పాటు సోషల్ మీడియాలో పార్టీ గొంతుకను బలంగా తీసుకెళ్లడం మీ ప్రధాన కర్తవ్యం. కోట్లాదిమంది అభిమానులు మన వెంట ఉన్నారు. జగన్ గారి పాలనలో పేదలు, మధ్యతరగతి వారికి అందిన భరోసా మనకంతా తెలుసు, కూటమి నేతల అబద్దాలు ఒకవైపు మనం చేసిన పనులు చెప్పుకోవడం మరోవైపు ఈ క్రమంలో మన వాణిని మనం బలంగా వినిపించాలి. మనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి, పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పైకి తీసుకురాగలగాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు సంబంధించి వివిధ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా డిజిటలైజ్ చేయాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలు నియమాల మేరకు పనిచేస్తూ మీ సత్తా చాటుకుంటే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాగానే తగిన గుర్తింపు లభిస్తుంది. వైయస్ఆర్‌సీపీలో నిబద్దత కలిగిన సైన్యం: లేళ్ళ అప్పిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిబద్దత కలిగిన సైన్యం పనిచేస్తుంది. డిజిటల్ మేనేజర్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సమాచారం క్షేత్రస్ధాయి వరకూ తీసుకెళ్ళగలగాలి. మన నాయకుడు వైయస్ జగన్ గారి అడుగుజాడల్లో కోట్లాది మంది అభిమానులు నడుస్తూ మరోసారి సీఎంగా చేసుకునేందుకు పనిచేస్తున్నారు. మన పార్టీ విధానాలు, సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్ళి కష్టపడి పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైయస్ జగన్ గారి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. మనమంతా చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం. నియోజకవర్గ ఇంఛార్జ్ గెలుపులో మీరు ప్రధాన భూమికగా ఉండాలి.