ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధాని నిర్మిస్తాం

చంద్రబాబులో ఎందుకీ అసహనం, అక్రోశం?

చంద్రబాబు ప్రతీమాటలో కడుపు మంట కనిపిస్తోంది

ఐదేళ్లలో అమరావతిలో శాశ్వత కట్టడం కట్టారా?

మా ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం

రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులమయం చేశారు

చంద్రబాబు మాటల్లో నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదు

మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ: అవినీతికి, దోపిడీకి తావులేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే మంచి రాజధాని నిర్మిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు హర్షించే రీతిలో రాజధాని మా ప్రభుత్వ హయాంలోనే కట్టి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలోకి ఉండి అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలనలో నూతన విధానం తీసుకువచ్చారని తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 
చంద్రబాబులో ఎందుకు అసహనం, ఆక్రోశం ఉందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన ఆవేదన, అక్రోశం చూస్తే బాధేస్తుందన్నారు. మూడు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబులో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి లేవన్నారు. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు, సత్యదూరపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని తెలిపారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో పర్మినెంట్‌గా ఒక కట్టడమైనా కట్టారా అని ప్రశ్నించారు. అన్ని కూడా తాత్కాలికమే అన్నారు. అందులో కూడా భారీగా దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు శాశ్వతమైన నిర్మాణాలు కట్టలేకపోయారని నిలదీశారు. రూ.1.65 లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చారన్నారు. అది కాకుండా ప్రజలు మిమ్మల్ని అధికారంలో నుంచి తొలగించిన నాటికి రాష్ట్రంలో బకాయిలు పెట్టారని తెలిపారు. రాజధానిలో ఎందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని ప్రశ్నించారు.  చంద్రబాబు మాట్లాడేవి అన్ని కూడా అబద్ధాలే అని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే చంద్రబాబు పాలనలో నష్టం ఎక్కువగా జరిగిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని ఫైర్‌ అయ్యారు. రాజధాని కోసం కేవలం రూ.5 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు. గ్రాఫిక్స్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. చంద్రబాబు వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో 500 ఎకరాలు కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసింది నిజం కాదా అన్నారు. నీ మంత్రులు, చుట్టాలు, తాపేదారులకు లబ్ధి చేకూర్చింది వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ బాధంతా ఒక్కటే అని, తన వియ్యంకుడికి ఇచ్చిన భూములు పోయాయనే అన్నారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఫణంగా పెట్టిన చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పది అబద్ధాలు చెబితే జనం నమ్ముతారని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు, ఆయన కుమారుడు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని దుయ్యబట్టారు. మా ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉందని, చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే క్లారిటీ లేదన్నారు. ఆదాయానికి ఎవరికి సృష్టించారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. రింగ్‌రోడ్డుకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించారు. ఏయిర్‌పోర్టును కూడా వైయస్‌ఆరే కట్టించారని తెలిపారు. చిన్న రాయి వేస్తే అది చంద్రబాబు గొప్పా అన్నారు. ప్రజలకు అన్ని తెలుసు అని, ఎవరు ఏవేవి కట్టారో అందరికి గుర్తుందన్నారు.

చంద్రబాబు..దయచేసి రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలకు చిరకాలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, 13 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వం కాంక్షిస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని దేశంలోనే మేటిగా ఉండాలని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం రాజధాని అన్నారు. మా ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతుందన్నారు. మంచి రాజధాని నిర్మించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రమంతా పర్యటించి అందరి మనోభావాలు తెలుసుకుంటారని చెప్పారు. కమిటీ ఏదైతే నిర్ణయిస్తే అక్కడే రాజధాని నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.  మా ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గం కోసం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని ఏక వచనంతో మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా మాట్లాడే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. చంద్రబాబులో హుందాతనం కనిపించడం లేదన్నారు. చంద్రబాబు మాటల్లో కడుపు మంట తప్ప వాస్తవాలు కనిపించడం లేదన్నారు. రోజు ప్రజల కోసం ఆలోచిస్తూ..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేతల ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వైయస్ జగన్‌ వాటిని అధికమిస్తూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నారని చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు విధానాలను ప్రజలు తిరస్కరించారని, ఇప్పటికైనా ఆయన  ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

Read Also: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు

Back to Top