లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల `ప్ర‌త్యేక‌` పోరాటం

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల‌ని ప‌ట్టు
 
శ్రీశైలం, సాగర్‌లకు ‘డ్రిప్‌’ అమలు చేయాలి
   
విశాఖ స్టీల్స్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి

 న్యూఢిల్లీ:  పార్ల‌మెంట్ వేదిక‌గా మ‌రోసారి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్ర‌త్యేక హోదాపై గ‌ళం ఎత్తారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప్ర‌త్యేక హోదాపై ఎంపీలు పోరాటం చేస్తున్నారు.  రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చింతా అనూరాధ కేంద్రాన్ని కోరారు. ఏడేళ్లుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. 

స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలన్న ప్రతిపాదన అందింది
ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని, అయితే 14వ ఆర్థికసంఘం రాష్ట్రాల మధ్య పంచుకోదగిన పన్నుల సమాంతర పంపిణీలో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం 2015–20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2015 ఆర్థిక చట్టం ప్రకారం ఆదాయపన్నుకు సంబంధించి పన్ను ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 

ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మెరుగుపరచాలి
డ్యామ్‌ల భద్రత, కార్యాచరణ, పనితీరును మెరుగుపరచటానికి ఉన్న కేంద్ర పథకం డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డ్రిప్‌) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని, ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మెరుగుపరచాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణాబోర్డు పరిధిలోని ఈ డ్యామ్‌ల భద్రత, నిర్వహణ సక్రమంగా చేయాలని, ఇందుకోసం జలశక్తి శాఖ ప్రత్యేక నిర్వహణ బృందాన్ని నియమించాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఆనకట్ట వైండింగ్‌ పూల్‌  ప్రమాదస్థితిలో ఉందని తెలిపారు. 2020లో నీటి ఉధృతికి నాగార్జునసాగర్‌ కుడికాల్వ గేటు విరిగిపోవడంతో చాలా నీరు వృథాగా పోయిందని చెప్పారు. వీటి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి: ఎంపీ సత్యనారాయణ
విశాఖ స్టీల్స్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇటీవలే ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించిందని గుర్తుచేశారు. ఒడిశాలోని ఓఎండీసీలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ భారీ పెట్టుబడులు పెట్టిందని, కానీ నేటివరకు ముడిసరుకు ప్లాంటుకు చేరలేదని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, ఇది శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వహణకు అవసరమైన విడిభాగాలు, బ్యాటరీలు అందుబాటులో లేవని తెలిపారు. వీటిని సమకూర్చాలని కోరారు.

 

 వరద నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయండి: నందిగం సురేశ్‌ 
ఇటీవలి అకాల వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, పంటలు భారీగా దెబ్బతిని ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేశ్‌ చెప్పారు. వారిని వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం అందించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. 

కులగణన చేపట్టాలి: ఎంపీ తలారి రంగయ్య
దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా వికేంద్రీకరణ జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని కోరారు. దేశంలో 75 శాతం సంపద 10 శాతం జనాభా చేతిలో ఉందని చెప్పారు. ఈ అసమానతలు పోవాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు.   

పూల ఉత్పత్తిలో ఏపీది మూడోస్థానం
 ముందస్తు అంచనాల ప్రకారం 2020–21లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని మూడో అతిపెద్ద పూల ఉత్పత్తిదారుగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 2020–21లో ఆంధ్రప్రదేశ్‌లో 19.84 వేల హెక్టార్లలో 406.85 వేల టన్నుల పూల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారని తెలిపారు. 2020–21లో దేశంలో మొత్తం పూల ఉత్పత్తిలో 15.62 శాతం ఆంధ్రప్రదేశ్‌ అందించిందన్నారు. దేశంలోని ప్రధాన పుష్పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక ఉత్పత్తిని కలిగి ఉందని చెప్పారు. 

35 వ్యవసాయ అటవీ నమూనాల అభివృద్ధి 
సబ్‌మిషన్‌ ఆన్‌ ఆగ్రోఫారెస్ట్రీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 567.65 హెక్టార్లను ఆగ్రోఫారెస్ట్రీ కిందకు తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రైతుల ప్రయోజనం కోసం వివిధ వ్యవసాయ పర్యావరణ ప్రాంతాలు, భూ వినియోగ పరిస్థితులకు అనువైన 35 వ్యవసాయ అటవీ నమూనాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

ఏపీలో 3 మెగా ఫుడ్‌ పార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో 3 మెగా ఫుడ్‌ పార్కులు, 28 కోల్డ్‌ చైన్‌ ప్రాజెక్ట్‌లు, 1 ఆగ్రో ప్రాసెసింగ్‌ క్లస్టర్, 4 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 1 ఆపరేషన్‌ గ్రీన్స్‌ ప్రాజెక్ట్, 4 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీలను ఇప్పటికే ఆమోదించినట్లు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ద్వారా నిర్వహించే మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రాయోజిత ఫార్మలైజేషన్‌ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఇంక్యుబేషన్‌ సెంటర్, ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ యోచిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

16.8 లక్షలమంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్‌ యాక్సెస్‌
పాల ఉత్పత్తిదారుల నికర రోజువారీ ఆదాయం రూ.25.52 పెరగడంతోపాటు కిలో పాలకు దాణా ఖర్చును తగ్గించడంలో జాతీయ డెయిరీ ప్రణాళిక దశ–1 దోహదపడిందని కేంద్ర పాడిపశుసంవృద్ధిశాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ ప్రాజెక్టులో అదనంగా నమోదు చేసుకున్న 16.8 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్‌ యాక్సెస్‌ అందించినట్లు పేర్కొన్నారు. అందులో 7.65 లక్షల మంది మహిళా సభ్యులున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ 97 వేల గ్రామాల్లో 59 లక్షలమంది లబ్ధిదారులను కవర్‌ చేసిందని చెప్పారు.

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద అభివృద్ధి
శ్యామాప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో 109 గిరిజన సమూహాలు, 191 గిరిజనేతర క్లస్టర్లలో అభివృద్ధి వివిధ దశల్లో ఉందని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి తెలిపారు. రూ.27,788.44 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 300 రూర్బన్‌ క్లస్టర్లలో 291 ఇంటిగ్రేటెడ్‌ క్లస్టర్‌ యాక్షన్‌ ప్లాన్లు అభివృద్ధి చేశామని చెప్పారు.

6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు
జాతీయ మిషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ కింద వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ కాంపోనెంట్‌ కింద దాదాపు 6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు సృష్టించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పారు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్‌ యోజన కింద ప్రారంభించిన సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ పథకాన్ని ప్రస్తుతం దేశంలో 250 జిల్లాల్లో అమలు చేస్తున్నామనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్న వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పథకంలాంటి దాన్ని అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉందా అని ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.  

ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెంచాలి: ఎంపీ వంగా గీత 

  ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వంగా గీత చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం 9 శాతం అంటే నలుగురు, హైకోర్టుల్లో 11 శాతం అంటే 81 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు న్యాయవ్యవస్థలోనూ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.

న్యాయవ్యవస్థలో 1950 నుంచి 1990 వరకు ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల సంఖ్య 10 శాతం దాటలేదన్నారు. సుప్రీంకోర్టు ఏర్పడిన నాటినుంచి కేవలం ఐదుగురు  ఎస్సీలు, ఒక్క ఎస్టీ న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని చెప్పారు. హైకోర్టుల్లోనూ 850 మందికిగాను కేవలం 24 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయన్నారు. సరైన రిజర్వేషన్‌ విధానం ద్వారా అందరికీ సమన్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘న్యాయవ్యవస్థ నియామకాలపై కొందరిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం, సుప్రీంకోర్టులో 33 శాతం న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థాయిల్లోని వారి కుటుంబ సభ్యులని సూచించే నివేదికలున్నాయి.

ఈ దృష్ట్యా కొలీజియం వ్యవస్థను నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ వంటి వ్యవస్థతో భర్తీచేయాల్సిన అవసరం ఉంది. దీనిద్వారా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. దీంతోపాటే దేశం నలుమూలలా నాలుగు సుప్రీంకోర్టు శాశ్వత ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఆమె పేర్కొన్నారు. 

Back to Top