మేనిఫెస్టో మనసా.. వాచా.. కర్మనా అమలు చేస్తా

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కొత్త ఏడాది తొలి రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది

మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను చేసి చూపించి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి రావాలి

 

అమరావతి:  వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను మనసా, వాచా, కర్మనా అమలు చేస్తానని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఉగాది పర్వదినం సందర్భంగా కొత్త ఏడాది తొలి రోజు వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోను అమలు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సభ్యులు మేరుగు నాగార్జున, జంగా కృష్ణమూర్తి, ఖాదర్‌వలి, న ందిగాం సురేష్,డీఎన్‌ కృష్ణ, బుట్టారేణులతో కలిసి 2019 ఎన్నికల మేనిఫెస్టోను వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఉగాది శుభాకాంక్షలతో ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేసే కార్యక్రమం కూడా ఈ శుభదినం జరగడం సంతోషకరం. రాష్ట్రంలో కొత్త యుగానికి, కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న రోజు. మేనిఫెస్టో అంటే ఏమిటి అంటే..ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఒక బుక్‌లెట్‌ విడుదల చేస్తుంది. అందులో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి అందులో పొందుపరచడం..ఆ తరువాత జరిగింది ఏమిటి అన్నది ఒక్కసారి గమనించాలి. చంద్రబాబు మేనిఫెస్టో గురించి మాట్లాడక తప్పని పరిస్థితి. ప్రతి పార్టీకి కూడా ఫలానిది చేస్తామని ప్రజల చేత ఓట్లు వేయించుకునే ముందు మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు ప్రజలతో వేయించుకున్న తరువాత అందులో చెప్పిన అంశాలను ఆ ప్రభుత్వం చేయకపోతే మోసం చేసినట్లు కాదా? ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో అన్న సుందరమైన పదం పెట్టి ప్రజలను మోసం చేసే కార్యక్రమం జరుగకూడదు. ఇదే మేనిఫెస్టో ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంచి..ఆ తరువాత ఎన్నికల్లో ఇదిగో నేను చేశానని ఓట్లు అడిగే పరిస్థితి వస్తేనే ప్రజలు నమ్ముతారు.
2014లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో. ఇందులో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. దాదాపుగా 650 హామీలు ఇచ్చారు. ఈ మేనిఫెస్టో కూడా టీడీపీ వెబ్‌సైట్‌లో కనిపించకుండా తీసేశారు. కారణం చంద్రబాబును చొక్కా పట్టుకుంటారని ఆయన భయం. మేనిఫెస్టో అన్నది ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నారా? లేదంటే ఇదిగో నా మేనిఫెస్టో ..చెప్పింది చేశాను అని మళ్లీ ఓట్లు అడిగే పరిస్థితి తీసుకురావాలి.
వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ, బెల్టుషాపులు రద్దు. మహిళలకు రక్షణ, సెల్‌ఫోన్‌ ధ్వారా రక్షణ, ఉద్యోగం, ఉపాధి, లేదంటే రూ.2 వేల నిరుద్యోగ, ఎన్‌టీఆర్‌ సుజల పథకం కింద ఇంటింటికి రూ.2లకే 20 లీటర్ల మంచినీరు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. చేనేతలకు ఉచిత రుణాలు అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు. వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. మేనిఫెస్టో అన్నది ఐదేళ్ల పాటు పూర్తిగా అందుబాటులో ఉండాలి. ఇందులో చెప్పింది ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడిగే పరిస్థితి రావాలి. చంద్రబాబు త్వరలోనే 2019వ మేనిఫెస్టో విడుదల చేసి ప్రజల చెవ్వుల్లో పూలు పెడతారు.

అక్కచెల్లెమ్మలకు సంబంధించి చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు.  చేయకపోవగా మే 2016 నుంచి సున్నా వడ్డీ రుణాలు రద్దు చేశారు. ఒకవైపున నిజం ఇదైతే..ఈయన చేసిన మోసం ఇప్పుడు పసుపు–కుంకుమ సొమ్ముపై ఆలోచన చేయండి. ఆయన నిజంగా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? సున్నా వడ్డీ రుణాలు ఎగురగొట్టారు. 2016 మే నుంచి సున్నా వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డ్వాక్రా గ్రూపులు రూ.5 లక్షలు, 10 లక్షలు, 15లక్షల రుణాలు తీసుకుంటారు. రూ. 5 లక్షలు తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వారు కట్టే వడ్డీ 12 శాతం తీసుకున్నా కూడా రూ.60 వేలు కట్టాలి. రూ.10 లక్షలు తీసుకున్న గ్రూపు ఏడాదికి రూ.1.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లకు సంబంధించి వీరి వడ్డీ భారం ఎంత అని చూస్తే..రూ.5 లక్షలు తీసుకున్న వారు రూ.1.80 లక్షలు బ్యాంకుకు చెల్లించారు. రూ.10 లక్షలు తీసుకున్నవారు రూ.3.60 లక్షలు చెల్లించారు.వీరికి ఈ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? ఒక్కొ గ్రూపుకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. చంద్రబాబు పసుపు–కుంకుమ పేరు పెట్టి చేస్తున్న డ్రామాను గమనించండి. వడ్డీలు కూడా ఇవ్వలేదు. ఇది మోసం కాదా? ఇటువంటి మోసాలు ఎన్నికల వేళ చేస్తున్నారు. మళ్లీ 2019కి టీడీపీ మరో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ.87612 కోట్ల రుణాలు ఉన్నాయి. ఈ రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్నారు. ఐదేళ్ల తరువాత వడ్డీలతో కలిసి తడిసి మోపెడై రూ.1.50 వేల కోట్లకు ఎగబాకాయి. ఈ పెద్ద మనిషి రూ.87612 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి..ఆయన చేసింది రూ.24 వేల కోట్లు అంటూ మొదటి సంతకం పెట్టారు. ఏడాదికి రూ.300 కోట్లు ఇచ్చారు. మొన్నటి దాకా ఇచ్చింది 1200 వేల కోట్లు మాత్రమే. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ అదే డ్రామా..అదే మోసం చేస్తున్నారు. రైతులు కట్టుకున్న అసలు, వడ్డీలు కలిసి రూ.1.50 వేల కోట్లు రుణాలు ఉన్నాయి. రూ.14 వేల కోట్లు ఐదేళ్లకు కలిపి ఇచ్చారు. ఎన్నికలు ఉన్నాయని మళ్లీ రూ.8 వేల కోట్లు ఇస్తామని డ్రామా. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి తెస్తామన్నారు. ఇవాళ బంగారం వేలం వేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలు కూడా రద్దు చేశారు. రైతులకు వడ్డీ డబ్బులు ప్రభుత్వం కట్టలేదు కాబట్టి ఏడాదికి రూ.7 వేల కోట్లు ఉన్నాయి. కనీసం ఏ రకంగా చూసుకున్న కూడా వడ్డీలకు కూడా సరిపోలేదు. 

ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లు ఉన్నాయి. లేదంటే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారు. ఇచ్చింది ఏంతా అంటే రూ.1000 కేవలం మూడు లక్షల మందికి ఇచ్చారు. మళ్లీ ఈ పెద్ద మనిషి ఏమంటారు. నన్ను గుర్తు పెట్టుకోండి..బ్రహ్మండంగా చేశానని అబద్ధాలు చెబుతారు. మీ భవిష్యత్తు– నా బాధ్యత అంటారు. టీడీపీ మేనిఫెస్టో ఎక్కడ ఉండో మీకు కనిపిస్తే నాకు చూపండి.

 

 • మన మేనిఫెస్టో ప్రతి రోజు మీకు కనిపించేలా చేస్తాం. మన మేనిఫెస్టోను మనసా, వాచా, కర్మనా అమలు చేస్తానని మాటిస్తున్నాను. మళ్లీ 2024లో ఇవన్నీ కూడా చేశామని చెప్పి ఓట్లు అడుగుతాం. మా మేనిఫెస్టో కేవలం ఒక్క పేపరే..ఇంతలావు బుక్కు కాదు. ఇందులో నవరత్నాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్‌ అంశాలు ఉన్నాయి
 •  ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. ప్రతి ఏటా మే నెలలోనే రూ.12500 ఇస్తాం. పంట బీమా మొత్తం మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి ఉచితంగా 9 గంటలు పగటి పూటే ఇస్తాం. గిట్టుబాటు ధరలకు గ్యారంటీరూ.3 వేల కోట్లతో పంటల ధరల స్థిరీకరణనిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ని ధి ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. పాడి రైతుకు ప్రతి లీటర్‌కు రూ.4 ఇస్తాం. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి రూ.7 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అండగా ఉంటుంది. కౌలు రైతులకు సంబంధించి భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా..కౌలు రైతులకు పంటలపై హక్కు లేకుండా చట్ట సవరణ చేస్తాం. అన్ని హామీలు కూడా అమలు చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రూ.12500 అధనంగా ఇస్తాం.
 • అందరికి వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఎన్నిలక్షలు ఖర్చైనా ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. అన్ని రకాల ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధి కిందకు తెస్తాం. ఆపరేషన్‌ చేయించుకున్న సమయంలో డబ్బులు ఇచ్చి అండగా ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం. రెండేళ్లలోగా కార్పొరేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను రూపొందిస్తాం. అదే ఆసుపత్రుల్లో దశాదిశా మార్చుతాం. 
 •  అమ్మ ఒడి: పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడకూడదు. తమ పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15  వేలు ఇస్తాం.
 •  వైయస్‌ఆర్‌ చేయూత: 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు ఐదేళ్లలో రూ.75 వేలు  ఇస్తాం. కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. 
 • పింఛన్లు పెంపు: అవ్వతాతల పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతూ పోతాం. వికలాంగులకు రూ.3 వేలు ఇస్తాం. పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతాం. 
 •  ఫీజు రీయింబర్స్‌మెంట్‌: పేదవారి చదువులకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు ఇస్తాం.
 • పేదలందరికీ ఇళ్లు: ఇళ్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణం ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం.
 •  వైయస్‌ఆర్‌ జలయజ్ఞం: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూలసుబ్బయ వెలుగొండ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు ఇస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. జలకళ తీసుకువస్తాం.
 •  యువత– ఉపాధి: ప్రత్యేక హోదా సాధనకు అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ప్రత్యేక హోదా సాధిస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లో చదువుకున్న యువతకు పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ 50  ఇళ్లకు ఒక్కరు చొప్పున గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం. వారు గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. వీరికి రూ.5 వేల గౌరవవేతనం ఇస్తాం. ఏ సమస్య అయినా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1న ఉద్యోగాల కేలండర్‌ విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇçచ్చేలా చట్టం చేస్తాం. జిల్లా కేంద్రాల్లో స్కీల్‌ డెవలప్‌మెంట్‌ పెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఉచితంగా పిల్లలకు శిక్షణ ఇస్తాం. ప్రభుత్వం నుంచికార్లు, బస్సులు అద్దెకు తీసుకునే కాంట్రాక్టులు అన్నీ కూడా నిరుద్యోగులకే ఇస్తాం. కార్లు, బస్సులు కొనుగోలు చేసేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. 
 • వైయస్‌ఆర్‌ ఆసరా: ఎన్నికల నాటికి అక్కచెల్లమ్మల పేరుతో ఉన్న అప్పును నేరుగా నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. ఆ వడ్డి డబ్బులు ప్రభుత్వమే బ్యాంకులకు ఇస్తుంది.
 • మద్యపాన నిషేదం:  కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది. అందుకే మద్యాన్ని మూడు దశల్లో నిషేదిస్తాం. ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేస్తాం. 
 • అగ్రిగోల్డు బాధితులు: అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు కేటాయిస్తాం.తద్వారా ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షల బాధితులకు డబ్బులు చెల్లిస్తాం. 
 • గృహ నిర్మాణం: పట్టణ గృహ పథకం నిర్మాణం కింద నిర్మించే ప్రతి ఇంటిపై టీడీపీ ప్రభుత్వం రూ.3 లక్షలు పేదలపై అప్పుభారం మోపింది. ఆ అప్పు భారాన్ని రద్దు చేస్తాం. 
 • యాదవులు: తిరుమలలోని శ్రీవారి గర్భగుడి తలుపులు, సన్నిధి గొల్లల సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. గొ్రరెల కాపులకు సంబంధించి చనిపోయిన ప్రతి గొ్రరెకు రూ. 6 వేల భీమా అందిస్తాం. 
 • ఆటో, ట్యాక్సీ: సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ తదితర అవసరాల నిమిత్తం ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం.
 •  జీవన భీమా: 18 ఏళ్ల వయసు నుంచి 60 సంవత్సరాల పౌరుడు సహజంగా మరణించినా కూడా బాధిత కుటుంబానికి వైయస్‌ఆర్‌ జీవన భీమా పథకం కింద రూ.1 లక్ష అందిస్తాం. 
 • ఎస్సీ, ఎస్టీ సంక్షేమం: ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలు, మాలలు, రేళ్లి తదితర కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ పెళ్లి కానుకగా రూ.1 లక్షఇస్తాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం. లేదంటే రూ.6 వేలు ఏడాదికి నేరుగా ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో గిరిజన యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. 500 జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రత్యేక పంచాయతీగా గుర్తిస్తాం. ఐటీడీఏ పరి«ధిలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం.  పోగుభూములను సాగులోకి తెస్తాం. గిరిజన రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. గిరిజనులకు వైయస్‌ఆర్‌ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. ప్రమాదశాత్తు ఎస్సీలు, ఎస్టీలు చనిపోతే రూ.5 లక్షలు పరిహారం ఇస్తాం. అసైడ్‌మెంట్‌ భూములు తీసుకుంటే పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇచ్చేలా చట్ట సవరణ చేస్తాం.
 • విద్యా–నైపుణ్య శిక్షణ: ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ల ముఖ చిత్రాలను మీముందు ఉంచుతాం. రెండేళ్లలో ఆ స్కూళ్ల దశాదిశా మార్చి మీ ముందు ఉంచుతాం. స్కూళ్ల ప్రమాణాలు మార్చుతాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషాకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రతివిద్యార్థి తెలుగు సబ్జెట్‌ చదివేలా నిబంధనలు పెడతాం. పుస్తకాలు, యూనిఫాం సరైన సమయానికి ఇస్తాం, మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేర్చుతాం. ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్పులను ఉద్యోగాలకు అనుగుణంగా నేర్పేలా తీర్చిదిద్దుతాం. సాంకేతిక కళాశాలలకు పూర్తి సహకారం అందిస్తాం. ఉన్న పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి నైపుణ్య ప్రమాణాలు పెంచుతాం. ప్రయివేట్‌ స్కూల్స్, కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపునకు, ప్రైవేట్‌ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్టు చేసే వీలు కల్పిస్తాం. 
 • జర్నలిస్టులు: జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం.
 •  బీసీ సంక్షేమం: టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఐదేళ్లలో రూ. 20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మన ప్రభుత్వం వచ్చాక బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లతో ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటేడ్‌ పోస్టుల్లో దేవాయాలు, ట్రాస్టు బోర్డులు, మార్కెట్‌యార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తాను. బీసీ ఆడబిడ్డలకు వైయస్‌ఆర్‌ పెళ్లి కానుకగా రూ. 50 వేలు ఇస్తాం. ప్రాతినిధ్యం లేని కులాలకు వీలైనంతగా చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తాం. చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపుతాం. కమిషన్‌ పారదర్శకంగా పని చేసే పరిస్థితి కల్పిస్తాం. కుల సర్టిఫికెట్లు, ఎంబీసీల వ్యవహారం, రాష్ట్రం పరిధిలో లేని అంశాలను పరిష్కరించేందుకు శాశ్వత పరిష్కారంగా కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్‌ నివేదికలను అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపుతాం. బీసీల్లో ఎవరైనా మరణిస్తే వైయస్‌ఆర్‌ భీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం. షాపులు ఉన్న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్స్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం. 
 •  మత్స్యకారులకు వేట నిషేద సమయంలో ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు ఆర్థికసాయం రూ. 10 వేలకు పెంచుతాం. పడవులకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం, డీజిల్‌ సబ్సిడీ డెడిటేడ్‌గా అందజేస్తాం. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలకు పెంచుతాం. 
 • చేనేత కార్మికులు: మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకంగా ఇస్తాం. 
 •  కుల వృత్తులు, చిరువ్యాపారులకు , ఫుట్‌ఫాత్‌లపై సమాన్లు అమ్ముకునే వారికి రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల పెట్టుబడికి వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. అలాంటి వారికి గుర్తుంపుకార్డులు ఇస్తాం. వారికి రూ.10 వేలు సున్నా వడ్డీకే ఇస్తాం.
 •  కాపు సంక్షేమం: దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాట్లు, పటేళ్లు, గుర్జర్లు మన రాష్ట్రంలో కూడాకాపు  సోదరులు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న చిక్కు ముడి అందరికి తెలిసిందే. అయినా కూడా టీడీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరితమైన హామీ  ఇచ్చారు. మన పరిధిలో లేని అంశాన్ని మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలము కానీ, అంతకు మించి రిజర్వేషన్లు చేస్తామనడం వారిని మభ్యపెట్టినట్లే అవుతుంది. కాపుల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. మొదటి నుంచి చెబుతున్నట్లుగా బీసీల హక్కులకు భంగం కలుగకుండా , వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో కాపులను మోసం చేయడమే కాకుండా ప్రతి ఏటా రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ ఐదేళ్లలో కేవలం రూ.1300 కోట్లు మాత్రమే కేటాయించింది. మా ప్రభుత్వంవచ్చాక కాపు కార్పొరేషన్‌కు ప్రతి ఏటా  రూ. 2 వేల కోట్లు కేటాయిస్తాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తాం.
 • ఆర్యవైశ్యులు: ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. సత్రాలు నడిపే హక్కు వారికే కల్పిస్తాం.
 • న్యాయవాదులు: జూనియర్‌ న్యాయవాదులకు మూడేళ్లలో ప్రతి నెల రూ.5 వేలు సై్టఫండ్‌  ఇస్తాం. వారి సంక్షేమానికి వంద కోట్లు కేటాయిస్తాం. ప్రాక్టిస్‌ చేస్తున్న న్యాయవాదులకు తక్కువ ధరకే  ఇళ్ల స్థలాలు ఇస్తాం. 
 •  దేవాలయాలు: అర్చకులకు రిటైర్డుమెంట్‌ విధానాన్ని రద్దు చేస్తాం. మార్చి 2019లో చంద్రబాబు ఇచ్చిన జీవోలో సూచించిన వేతనం కంటే అదనంగా 20 శాతం ఇస్తాం. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు పంచాయతీ జనాభాను బట్టీ నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేలు ఇస్తాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు ఇస్తాం.
 •  ముస్లిం మైనారిటీలు: మైనారిటీల సబ్‌ప్లాన్‌ పారదర్శకంగా అమలు చేస్తాం. వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థలాలు, స్థిరచర ఆస్తులకు రీ సర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపాదికన వాటిని పరిరక్షిస్తూ , స్థిర ఆస్తులను డిజిటలైజ్‌ చేస్తాం. ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైయస్‌ఆర్‌ కానుకగా రూ.1 లక్ష  ఇస్తాం. హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థికసాయం చేస్తాం. ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం. ఇమామ్‌లు, మౌజమ్‌లు గౌరవవేతనం నెలకు రూ.15 వేలు ఇస్తాం. ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తాం. 
 •  క్రిస్టియన్‌ మైనారిటీలు: క్రిస్టియన్‌ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైయస్‌ఆర్‌ కానుకగా రూ.1 లక్ష ఇస్తాం. పాస్టర్ల వివాహ రిజిస్ట్రేషన్ల లైసన్స్‌ పద్ధతిని సులభతరం చేస్తాం. పాస్టర్లకు రూ.5 వేలు తగ్గకుండా గౌరవవేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్  యాత్ర వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థికసాయం చేస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి  ఇళ్లు కట్టిస్తాం. ప్రమాదవశాత్తు క్రిష్టియన్లు మరణిస్తే ఆ కుటుంబాలకు రూ. 5 లక్షలు వైయస్‌ఆర్‌ భీమా ద్వారా చెల్లిస్తాం.
 •  అగ్రకులాల సంక్షేమం: అన్ని అగ్రకులాలకు, క్షత్రియులు, వైశ్యులకు బ్రాహ్మణులకు, రెడ్లకు, కమ్మలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. తగిన నిధులు కేటాయించి ఆయా వర్గాలకు అండగా ఉంటాం.
 • సుపరిపాలన: కులం, వర్గం, మతతత్వాలు లేని సమసమాజాన్ని నిర్మిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటిని సమగ్ర రీ సర్వే చేయిస్తాం. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పిస్తాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతాం. రాజధానిని ఫ్రీ జోన్‌గాచేస్తూ అందరికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేస్తాం. పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సచివాలయాలను కేంద్రంగా చేస్తాం. లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలీవరీ చేయిస్తాం.
 •  ప్రభుత్వ ఉద్యోగులు: సీపీఎస్‌ రద్దు చేస్తాం. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇస్తాం. సకాలంలో పీఆర్‌సీ అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వశాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల అర్హతను పరిగణలోకి తీసుకొని వారిని రెగ్యులరైజ్‌ చేస్తాం. ఔట్‌సోర్సింగ్‌ వారికి సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక సెల్‌ ఏర్పాటు చేస్తాం. పోలీసులకు  వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికులకు చట్టం కల్పించిన హక్కులు పొందలేని స్థితిలో వారున్నారు. వీటిని మార్పు చేస్తూ..వీరికి గౌరవం ఇస్తూ ప్రతిజిల్లా కలెక్టరేట్లో ఒక సెల్‌ ఏర్పాటు చేస్తాం. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పని చేసుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోం గార్డుల జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వేతనాల కంటే వెయ్యి ఎక్కువగా  ఇస్తాం. వీవోఏలు, సంఘమిత్రలు, యానిమేటర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతాం. వీఆర్‌వో, వీఆర్‌ఏ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.
 •  పరిశ్రమలు: దేవుడి దయంతో ప్రత్యేక హోదా సాధించి పరిశ్రమలు సాధిస్తాం. తద్వారా ఉద్యోగాల విప్లవం తెస్తాం. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి, పన్నులు తదితరకు తోడుగా ఏపీఐజేసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. 
Back to Top