`కాపు`కాసే సంక్షేమం

నేడు మూడో ఏడాది వైయ‌స్ఆర్ కాపు నేస్తం ప‌థ‌కం అమ‌లు
 
3,38,792 మంది పేద అక్క చెల్లెమ్మలకు లబ్ధి

రూ.508.18 కోట్లు ఆర్థిక సాయం

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డబ్బులు జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

ఇప్పటి వరకు కాపునేస్తం కింద రూ.1,491.93 కోట్లు సాయం

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారి అభ్యున్నతికి బాటలు

అమరావతి: వరుసగా మూడో ఏడాది వైయ‌స్సార్‌ కాపు నేస్తం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైయ‌స్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైయ‌స్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు.. మంజూరు చేస్తున్నారు. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడము అని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి సమావేశంలో చెబుతూ.. అదే ఆచరిస్తున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. 

గత టీడీపీ ప్రభుత్వంలో అరకొర సాయం
► శుక్రవారం అందించే రూ.508.18 కోట్లతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.1,491.93 కోట్ల మేర లబ్ధి కలిగించారు. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్లలో రూ.45,000 లబ్ధి కలిగింది. 
► గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది ఏటా సగటున రూ.400 కోట్లు కూడా లేని దుస్థితి. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 27 రెట్లు ఎక్కువగా అంటే మొత్తం రూ.32,296.37 కోట్ల లబ్ధి చేకూర్చింది.
► ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం ఈ ప్రభుత్వం విశేష కృషి చేసింది. సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎం సహా, ఏకంగా నాలుగు మంత్రి పదవులు కేటాయించింది. అన్ని నామినేటెడ్‌ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత కల్పించింది.
► గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేయలేదు. అమలు చేసినవి కూడా అరకొరే. వివిధ పేర్లతో కొర్రీలు, కోతలతో వీలైనంతమందికి సాయం ఎగ్గొట్టారు. 

నేడు సీఎం పర్యటన ఇలా..
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరి, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద సాయం జమ చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.   

తాజా వీడియోలు

Back to Top