వైయస్ జగన్ సంక్షేమ శకం

ఎన్నికల హామీలు అమలు దిశగా వైయస్‌ జగన్‌ సర్కార్‌

ప్రతి నెల ఓ కొత్త సంక్షేమ పథకం అమలు

కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయం

ఇది కాదా రాజన్న రాజ్యం

అమరావతి:  సంక్షేమానికి చిరునామాగా నిలిచిన ఏ నాయకుడినీ చరిత్ర మర్చిపోలేదు ప్రజలు గుర్తు చేసుకోవడం మానలేదు. అలాంటి నాయకుల సరసన సగర్వంగా నిలబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తండ్రి ఆశయం, అతడి లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు ఒక్కటై నిలిచిన వేళ వైయస్ జగన్ శకం మొదలైంది. అది సంక్షేమానికి చిరునామా అయ్యింది. అధికారం చేపట్టిన అతి కొద్ది రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను ప్రకటించి, ప్రారంభిస్తున్న ఏకైక నాయకుడు బహుసా దేశం మొత్తంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనేమో!

మేనిఫెస్టోకి మించి
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాదు ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ లెక్కగా పూర్తి నెరవేర్చుకుంటూ వస్తున్నారు వైయస్ జగన్. సామాజిక మార్పు, సంక్షేమ పథకాలు, అవినీతి రహిత ప్రభుత్వం ఇలా ఒక్కో మెట్టూ నిర్మించుకుంటూ వెళుతున్నారు. ప్రచారాలు కాదు, ప్రభావంతమైన పాలన మాత్రమే ధ్యేయం అని తన తీరుతో తెలియజెబుతున్నారు వైయస్ జగన్. నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. 

పథకాలు ప్రారంభాలూ
ఇప్పటికే నవరత్నాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు వైయస్ జగన్. ఇప్పుడు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను వరుసక్రమంలో నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలనూ శరవేగంగా పరిష్కరిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంక్షేమ పథకాలు, అమలు చేయాల్సిన విధి విధానాలను అధికారులతో చర్చించి, వివరంగా ప్రకటించారు సీఎం. 
పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా ఎన్నో ప్రణాళికలు, కొత్త విధానాలను అమలు పరుస్తున్నారు యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. సెప్టెంబర్ లో నాణ్యమైన బియ్యం పంపిణీ శ్రీకాకుళం నుండి ప్రారంభిస్తున్నారు. 

సెప్టెంబర్ చివరి వారంలో సొంత ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి రూ.10,000 అందించనున్నారు.
అక్టోబర్ 15 నుండి రైతు భరోసా పథకం ప్రారంభం చేస్తున్నారు. నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారదినోత్సవం నుండి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు పడవ లేక బోటు ఉంటే రూ.10,000 ఇవ్వనున్నారు. మత్స్యకారులకు డీజిల్ పై ఉన్న రూ.6ల సబ్సిడీని రూ.9లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. 
డిసెంబర్ 21 నుండి మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ ఏడాదికి రూ.24,000 ఇస్తున్నారు.
ఇళ్లులేని ప్రతి పేదకుటుంబానికీ ఉగాదికల్లా ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఏతేదీలోగా ఇంటి స్థలం ఇవ్వబోతున్నారో వినతిపత్రం ఇచ్చేవారికి తెలియజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామాలు, మండలాల వారీగా లబ్దిదారుల ఎంపిక వేగంగా జరుగుతున్నది. 
జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తారు. 
ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులకు టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10,000 ఇవ్వబోతున్నారు.
పెంచిన మొత్తంతో ఫిబ్రవరి నెలలోనే వైయస్సార్ పెళ్లి కానుక ఇవ్వబోతున్నారు.
మార్చి చివరి వారంలో అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయనున్నారు.
మార్చి నెలలోనే 25 లక్షల ఇళ్లకు పట్టాలిచ్చే భారీ సంక్షేమ పథకాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. 

క్రీడలకు ప్రోత్సాహం
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ నెల 29న క్రీడోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.  2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాం. బంగారు పతకం సాధించిన వారికి రూ.5లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలు అందిద్దాం.

జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండిపతకం సాధిస్తే రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిద్దాం. తగిన ప్రోత్సాహం ఇస్తేనే వీళ్లంతా పీవీ సింధూలుగా మారుతారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేద్దాం. 29 నుంచి వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగాలి’అన్నారు. 

ప్రజా సమస్యలకు పరిష్కారాలు
సెంప్టెంబర్ 5వ తారీకు నుంచీ కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. మార్కెట్ కన్నా చౌక రేటులో ఇసుక అందుబాటులోకి రానుంది. ఇసుక సప్లై పెంచి, కొరత లేకుండా చూడనున్నారు. ఇసుక రీచ్ లను పెంచి, స్టాక్ యార్డుల్లో ఇసుక నింపడం మొదలుపెడుతున్నారు. రవణా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 
ఇక ప్రధానంగా కనిపించే మరో సమస్య భూ వివాదాలు. ఇందుకోసం ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్సీలు కలిసి భూవివాదాలకు చెందిన జాబితాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ జాబితాను తహశీల్దారుకు పంపుతారు. ప్రతి గురువారం తహశీల్దార్, ఎస్సై, ఆర్‌ఐ, సర్వేయర్, వీఆర్వోలు కలిసి భూవివాదాలను పరిష్కరిస్తారు. 
అగ్రిగోల్డ్ బాధితులకు సెప్టెంబర్ నుండి డబ్బులు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఇందుకోసం రూ.1150 కోట్లు కేటాయించారు. గ్రామవాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డు బాధితులకు రసీదులు అందచేస్తారు. అగ్రిగోల్డు ఆస్తులను స్వాధీనం చేసుకుని, తర్వాత వేలం ద్వారా రికవరీ చేస్తారు. 
వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు అందే సొమ్ము పాత అప్పుగా జమ కాకుండా ఉండేలా బ్యాంకర్లతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
గ్రామ సచివాలయాలతో కలెక్టర్ల అనుసంధానానికి యాప్ సిద్ధమౌతోంది. 
సచివాలయాల వద్దే రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచబోతున్నారు.
వ్యవసాయ రంగానికి సంవృద్ధిగా సాగునీరు అందించనున్నారు. 

అన్ని వర్గాలు, అన్ని జాతులు, మతాలకు చెందిన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రకటించి చిత్తశుద్ధితో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు వైయస్ జగన్. సంక్షేమ యుగ సృష్టికర్తగా మారిన ఈ నవతరం యువ నాయకుడిని చూసి ఆంధ్ర రాష్ట్రం గర్విస్తోంది. 
 

Back to Top