ప‌చ్చ నేత‌ల కుల దురహంకారం

వైయ‌స్ఆర్ సీపీలో చేరినందుకు గ్రామ బహిష్కరణ

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత‌ల‌ దౌర్జన్యం 

కుల కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం 

రేషన్‌ సరుకులు, కరెంటు సరఫరా నిలిపివేత.. రూ.4,000 జరిమానా 

నిందితులకే వత్తాసు పలుకుతున్న పోలీసులు 

ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆశ్రయించిన బాధితులు 

మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్దామని బాధితులకు దైర్యం చెప్పిన ఎమ్మెల్యే

తిరుపతి: దళితులను ఉద్దేశించి పిచ్చముం..కొడకల్లారా, మీకు ఎందుకురా రాజకీయాలు అంటూ ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు, వాడిన అసభ్యకర పదజాలం, కించపరిచిన విధానం చూశాం. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యాలను మనం విన్నాం. దళితులకు పరిశుభ్రతే తెలియదంటూ అగౌరవపరిచిన మంత్రి మాటాలనూ విన్నాం. అన్ని పోస్టుల్లోనూ తన సామాజికవర్గం మనుషులే ఉండాలనుకుంటున్న ముఖ్యమంత్రి పరిపాలనను చూస్తున్నాం. నేడు మన కులంవాళ్లు వేరే పార్టీలో ఉంటారా? అది మన కులం కట్టుబాట్లకు వ్యతిరేకం అంటూ కుల దురహంకారులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.  

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగళిపట్టు గ్రామానికి చెందిన జాగర్లమూడి దామోదర్‌ నాయుడు, ఆయన భార్య భారతి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దామోదర్‌ నాయుడు ఇటీవల వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో గ్రామంలో అదే సామాజికవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. ‘‘మన కులపోళ్లు వేరే పార్టీలోకి వెళ్తారా? మన కులానికి చెందిన పార్టీలో తప్ప ఇంకో పార్టీలోకి వెళ్తే గ్రామ బహిష్కరణ తప్పదు’’ అంటూ హెచ్చరించారు. ‘‘నేను, నాతోపాటు మీరు ఆనాడు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయంలో రుణమాఫీతో ప్రయోజనం పొందాం. తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మన ఊరంతా సిమెంట్‌ రోడ్లు వేయించినప్పుడు కులం గుర్తుకు రాలేదా? రుణమాఫీ చేసుకున్నప్పుడు కులం గుర్తుకు రాలేదా? మంచి పనులు చేయించుకున్నప్పుడు రాని కులం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇదేక్కడి న్యాయం? ఇవేం కట్టుబాట్లు’’ అని దామోదర్‌నాయుడు ప్రశ్నించారు. దాంతో మరింత కోపోద్రిక్తులైన కుల దురంహకారులు దాడికి తెగబడ్డారు. దామోదర్‌నాయుడు, ఆయన భార్య, పిల్లలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. తర్వాత వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ కులపెద్దలు హుకుం జారీ చేశారు. రేషన్‌ సరుకులు కట్‌ చేయాలని, తాగునీరు సైతం సరఫరా చేయకూడదని, మన కులపోళ్లు ఎవరూ వారితో మాట్లాడకూడదని, ఎవరైనా మాట్లాడితే ఇదే శిక్ష తప్పదని హెచ్చరించారు. మేలు చేసిన వారికి కృతజ్ఞతగా ఉంటే తప్పేంటి అన్నందుకు దామోదర్‌ నాయుడు కుటుంబానికి రూ.4,000 అపరాధం విధించారు.

బాధితులపై పోలీసుల తిట్ల పురాణం 
తమపై దాడి చేసి, గ్రామం నుంచి బహిష్కరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దామోదర్‌నాయుడు కుటుంబ సభ్యులు బుధవారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని ప్రాధేయపడ్డారు. పోలీసులను తీసుకుని గ్రామానికి వెళ్లారు. మార్గమధ్యంలో పోలీసులకు అధికార పార్టీ నేతల నుంచి ఫోన్‌కాల్స్‌ రావడంతో వారు యూటర్న్‌ తీసుకున్నారు. ‘‘రెండు నెలలపాటు గ్రామం వదిలిపోతే తప్పేంట్రా నా కొ....ల్లారా’’ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఒకవైపు కులదురంహకారుల దాడి, గ్రామ బహిష్కరణ, మరోవైపు పోలీసుల తిట్లతో భయకంపితులైన దామోదర్‌నాయుడు కుటుంబం తమను ఆదుకోవాలంటూ చంద్రబాబు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆశ్రయించింది. వెంటనే కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిద్దామని, మీకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పార్టీల పేరుతో కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, జరిమానా విధించడం వంటి ఘటనలపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించిన పోలీసులు వారినే బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

 

తాజా ఫోటోలు

Back to Top