అదే దౌర్జ‌న్యం..అదే దాడులు

నామినేషన్లను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంపై కూటమి దాడి!

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధాలు, దాడులు, బెదిరింపులు 

నామినేషన్ కేంద్రాల వద్ద అడ్డంకులు.. అభ్యర్థులు, నాయకులపై పోలీసుల ఒత్తిడి 

తాడేప‌ల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పులివెందుల, పిడుగురాళ్ల, దాచేపల్లి, తిరుపతి, కడప సహా పలు ప్రాంతాల్లో అభ్యర్థులు, పార్టీ నాయకులపై దాడులు, బెదిరింపులు, గృహనిర్బంధాలు, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తూ భయానక వాతావరణం సృష్టించడం కూటమి పాలనలో ఎన్నికల ప్రక్రియ ఎదుర్కొంటున్న పరిస్థితికి నిదర్శనం. 

రాష్ట్రవ్యాప్తంగా జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఇలా..

- పులివెందుల: వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాల దహనం ఘటనలను ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. నామినేషన్లు వేయకుండా పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

- రాయచోటి: వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు 220 మందికి పైగా పోలీసుల నోటీసులు అందుకున్నట్లు సమాచారం. సంబేపల్లి, గాలివీడు పోలీస్‌ స్టేషన్లకు పలువురిని తరలించారు.

- వేంపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌ కేంద్రానికి వెళ్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో మహిళలు రోడ్డుపై నిరసనకు దిగారు.

- కర్నూలు జిల్లా ఆలూరు: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని చిప్పగిరిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందస్తు అరెస్టులతో అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

- బనగానపల్లె: వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు అబ్దుల్‌ ఫైజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై న్యాయపోరాటం చేస్తామని పార్టీ లీగల్‌ సెల్‌ నాయకులు తెలిపారు.

- పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డిలను గృహనిర్బంధం చేశారు. నామినేషన్లు వేస్తే కేసులు పెడతామని బెదిరింపులు, పోలీసుల నుంచి ఎన్‌ఓసీ జారీలో జాప్యం జరుగుతున్నాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

- రెంటచింతల, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి: నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో గుమిగూడి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- పిడుగురాళ్ల: జెడ్పీటీసీ అభ్యర్థి భారతి, ఆమె భర్త పెద్ద లక్ష్మారెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన లక్ష్మారెడ్డిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

- దాచేపల్లి: జెడ్పీటీసీ అభ్యర్థి వంగా పద్మావతిపై దాడి జరిగినట్లు సమాచారం. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద పోలీసులు హల్‌చల్‌ చేస్తూ, నామినేషన్లకు సిద్ధమవుతున్న అభ్యర్థులను బెదిరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

- సోములవారిపల్లె: ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వన్‌టౌన్‌ పోలీసులు గృహనిర్బంధం చేసినట్లు సమాచారం.

- పులివెందుల పట్టణం: పార్లపల్లి రోడ్డులో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి శ్రీరాములు ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు సమాచారం.

- సింహాద్రిపురం: ఎంపీటీసీ అభ్యర్థులను అడ్డుకున్న ఘటనపై పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు.

- వెదురుకుప్పం: ఎంపీటీసీ నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన రామయ్య, ఆయన కుమార్తెను పలుమార్లు బయటకు పంపిన తర్వాత టీడీపీ నాయకులు దాడి చేసి నామినేషన్‌ పత్రాలను చించివేసినట్లు సమాచారం.

- తిరుపతి: 63వ డివిజన్‌ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి జమున, ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తన సంతకం ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రాలు సమర్పిస్తే వాటిని స్వీకరించవద్దని జమున ఎన్నికల అధికారిని కోరారు.

- శ్రీకాళహస్తి, రేణిగుంట: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి గృహనిర్బంధ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రేణిగుంటలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌లను కూడా గృహనిర్బంధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో ఆయనను గృహనిర్బంధం చేసే అవకాశం ఉందని సమాచారం.

- పీలేరు: వాయల్పాడులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడు సాయికృష్ణరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మదనపల్లె వైపు తరలించినట్లు సమాచారం. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని నిరసిస్తూ చింతల రామచంద్రారెడ్డి ధర్నా చేపట్టారు.

- గుంతకల్లు: పామిడి మండలం కొత్తపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమేష్‌ను నామినేషన్‌ వేస్తే కాళ్లు విరగ్గొడతామంటూ టీడీపీ నేతలు బెదిరించినట్లు సమాచారం.

- కడప జిల్లా పరిషత్‌ కార్యాలయం: జెడ్పీటీసీ నామినేషన్లను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు మోహరించినట్లు సమాచారం. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించినట్లు సమాచారం. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు స్వీకరించాలని, అక్టోబర్ 25 వరకు తుది అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించినట్లు తాజా సమాచారం.

Back to Top