సిద్ధాంతాలు లేని టీడీపీకి ఎన్టీఆర్‌ ఆశయాలు కూడా గుర్తులేవా?

అమ‌రావ‌తి:  ఎన్టీఆర్‌ శతజయంతి పేరుతో తెలుగుదేశం తమ పార్టీ వ్యవస్థాపకుడి మాటలను రెండ్రోజుల నుంచి ప్రతి దినం తలచుకుంటోంది. పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడటం లేదు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ ఆశయాలేమిటో తలచుకోవడం లేదు. 40 ఏళ్ల క్రితం టీడీపీని స్థాపించినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం, ఏపీలో రాష్ట్రావతరణ నుంచి సాగుతున్న కాంగ్రెస్‌ పాలనకు ముగింపు పలకడం అనే లక్ష్యం తప్ప డీఎంకే మాదిరిగా ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి  సొంత సిద్ధాంతాలంటూ ఏవీ లేవు. 1980ల్లో నందమూరి తారకరామారావు గారినే ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు, ‘‘పేదవాడి చెమట నుంచి పుట్టింది తెలుగుదేశం’’ వంటి మాటలు చెప్పేవారు. పార్టీ సిద్ధాంతాల జాబితాలో సమాఖ్య విధానం, తెలుగు భాషకు ప్రాధాన్యం వంటి అంశాలు ఉన్న మాట నిజమేగాని తమిళనాట సీఎన్‌ అణ్ణాదురై స్థాపించిన డీఎంకే సిద్ధాంతాల మాదిరిగా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ చెప్పగలిగే ఐడియాలజీ టీడీపీకి లేదు. మొత్తానికి, పేదలు, బడుగువర్గాల సంక్షేమం అనే ఎన్టీఆర్‌ ఆశయాలకు తెలుగుదేశం తిలోదకాలు ఇచ్చింది. ఇది 1995 ఆగస్టు ఆఖరులో తెలుగుదేశం నాయకత్వాన్ని ఎన్టీఆర్‌ నుంచి ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుంజుకున్నాక జరిగింది. స్వేచ్ఛా విపణి, సరళీకృత ఆర్థిక విధానాలతో సంపద సృష్టే చంద్రబాబు టీడీపీ లక్ష్యంగా మారింది. సంపద పంపిణీ లేదా అవసరమైన పేదలను ఆర్థికంగా ఆదుకునే ఆధునిక అజెండా చంద్రబాబు హయాంలో మరుగున పడింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ‘జాతీయ ప్రధాన కార్యదర్శి’ నారా లోకేష్‌ నుంచి టీడీపీ నేతలెవరూ నేడు పార్టీ సిద్ధాంతాల జోలికి పోవడం లేదు. పేదవారికి మేలుచేసిన ఎన్టీఆర్‌ విధానాలు, ఆశయాల గురించి కూడా వారు మాట్లాడరు. ‘పార్టీ సిద్ధాంతాలు’, మెజారిటీ తెలుగు ప్రజల సంక్షేమానికి దోహదం చేసే ఆశయాలు, విధానాలు 2014–2019 మధ్యకాలంలో అమలు చేయలేదు. కాబట్టే తెలుగుదేశాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇంత జరిగినా ప్రత్యేక సిద్ధాంతాలు అంటూ లేని టీడీపీ ఇప్పుడూ పేద ప్రజల జీవితాల్లో వినూత్న మార్పు తీసుకొచ్చే సంక్షేమ విధానాల గురించి మాట్లాడడం లేదు.
2004–2009 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను తన వినూత్న సంక్షేమ విధానాల అమలుతో నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు దేవుడై నిలిచారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అలాంటి వైఎస్సార్‌ గారి పాలనను స్ఫూర్తిగా తీసుకుని శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. అలాంటి పార్టీపై అడ్డగోలు విమర్శలతో రోజూ తెగబడుతున్న తెలుగుదేశం ఇకనైనా తన సిద్ధాంతాలు ఏమిటో ఆత్మశోధన చేసుకుంటే మంచిది. ఎన్టీ  రామారావు గారు రెండుసార్లు వెన్నుపోట్లకు గురైన ఆగస్టు నెలలో తెలుదేశం పార్టీ రోజూ ఆయన మాటలు గుర్తు చేసుకోవడం విశేషం.
 

Back to Top