టిడిపి శిబిరంలో సరికొత్త తరగతులు 

తెలుగుదేశం పార్టీలో మళ్లీ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు, ఆ పార్టీని, నలభైయేళ్ల ఇండస్ట్రీ బాబును ప్రచారం చేసే కార్యకర్తలకు కూడా ఈ తరగతులు వర్తిస్తాయని చెప్పారట. తన పుత్రుడికి మాతృభాష నేర్పించేందుకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఆ శిక్షణ కారణంగా పప్పుగారి భాష ఎలా దినదినాభివృద్ధి చెందిందో కూడా పొట్ట చెక్కలయ్యేలా విని ఆనందించారు కూడా. అసలే ముక్కీ మూలుగుతూ ప్రతిపక్షంలో కొనసాగుతున్నటిడిపిలో ఇప్పుడు తరగతులు ఎందుకనేగా మీ సందేహం. అయ్యో... ఇవి అలాంటిలాంటి తరగతులు కాదండీ... తెలుగు సామెతలు నేర్పే తరగతులు. అవును, ఇక్కడ సామెతలు, వాటి అర్థాలు నేర్పబడును అని త్వరలో పార్టీ ఆఫీసులో బోర్డు తగిలించబోతున్నారట.
అసలు ఇదంతా ఎందుకొచ్చిందయ్యా అంటే... 
రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో వాదోపవాదనల్లో భాగంగా టిడిపి బొక్కబోర్లా పడింది. అక్కడ జరిగిన అవమానం సరిపోదన్నట్లు సొంత పార్టీలో వ్యక్తులు, కార్యకర్తలు చేస్తున్న ప్రచారానికి బాబుగారి తల మరింత బొప్పి కట్టిందట. దీనికి ప్రధాన కారణం ఏంటా అని ఆలోచిస్తే, పచ్చపార్టీ నేతలకు సామెతలు, వాటి అర్థాలు సరిగా తెలియకపోవడమే అని తేలిందట. 
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరుగుతున్న చర్చలో భాగంగా, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ... ''బాబు అధికారంలో ఉండగానే కాళేశ్వరం నిర్మాణం జరిగింది కదా! అప్పుడు ఏం చేశాడు, గాడిదలు కాస్తున్నాడా చంద్రబాబు'' అని అనడంతో టిడిపి సభ్యులు తెగ బాధపడిపోయారు. అక్కడితో ఆగితే బాగుండేది. మా బాబును గాడిద అంటారా అంటూ సభ లోపల, బయట నానా రాద్ధాంతం చేయడంతో బాబుకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఆ సామెత అర్థం తెలియకపోవడం వల్లే బాబునే గాడిద అన్నట్టుగా అర్థం చేసుకుని అనవసరంగా పరువు తీశారని ఆలస్యంగా అర్థమైంది పాపం. అంతేకాదు, సున్నావడ్డీ రుణాలు రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అని ముఖ్యమంత్రి సవాల్‌ విసరడంతో, దాన్ని కూడా అర్థం చేసుకోలేక, చూడండి మేము వేలకోట్లలో కనీసం ఇరవై ముప్పై కోట్లయినా ఖర్చు చేశాం కదా! మరి చిల్లిగవ్వ ఇవ్వలేదని ఎలా అంటారంటూ అర్థం లేని పాయింటు తీసుకుని విలువైన శాసనసభా సమయాన్ని ఒక పూటంతా వృథా చేశారు బాబు అండ్‌ బృందం. సో.. ఇవన్నీ పరిశీలించిన మీదట పార్టీ పొలిట్‌ బ్యూరో, మరియు ఆ పార్టీ సానుభూతిపరులు ఒక నిర్ణయానికి వచ్చారట. ముందు ముందు ఇలాంటి సెల్ఫ్ గోల్స్‌ కాకుండా ఉండటానికి పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు తెలుగు సామెతలు వాటి అర్థాలు నేర్పించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించారట. దీనికి బాబుగారు వెంటనే ఆమోదించినట్టు సమాచారం. అయితే ఇందులో పప్పు కూర్చోకూడదనే ఒక కండిషన్‌ మాత్రం విధించారట. చూడాలి... ఈ శిక్షణ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోమరి.

 

Back to Top