అమరావతి: విద్వేషాలను రెచ్చగొట్టి ఉనికి చాటుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్న బూతు పురాణాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. దుర్భాషలాడటం వాక్ స్వాతంత్య్రం ఎలా అవుతుందని మండిపడు తున్నారు. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి దన్నుగా నిలుస్తామని మరోసారి చాటి చెప్పారు. సీఎం వైయస్ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో బుధవారం వైయస్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజలు వెల్లువెత్తారు.ఇదే సమయంలో టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ఏమాత్రం స్పందన కనిపించకపోవడం గమనార్హం.
రాష్ట్రమంతా నిరసనల హోరు
టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. దుర్భాషలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీడీపీ నేతల నోటి దురుసుపై కృష్ణా జిల్లాలో నిరసనాగ్రహం పెల్లుబికింది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పలుచోట్ల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నల్ల జెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. టీడీపీ నేతల తీరు పట్ల సిక్కోలులో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
ముఖ్యమంత్రిని దూషించిన పట్టాభితోపాటు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కడప జిల్లాలో ఆందోళన చేపట్టి దిష్టి బొమ్మలను దహనం చేశారు. గుంటూరు జిల్లాలోనూ నిరసనలు హోరెత్తాయి. పలుచోట్ల రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విజయనగరం జిల్లాలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నేతల బూతు పురాణంపై చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ దేవుళ్లను ప్రార్థించారు. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రజాక్షేత్రంలో చెల్లని చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని విశాఖలో శాంతియుతంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ధ్వజమెత్తారు. పాడేరులో వైయస్ఆర్‌సీపీ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కర్నూలు జిల్లా ఆత్మకూరులో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
► ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత చంద్రబాబుదే. పోలీసులు జారీ చేసిన సమన్ల అంశంపై పట్టాభి ప్రెస్‌మీట్ పెడితే.. ఈ స్థాయిలో విమర్శలు అవసరం లేదు కదా. ఆ మాటకు తప్పనిసరిగా రియాక్షన్ వస్తుందని తెలుసు. అంతా పక్కా ప్రణాళికతో చేశారు.
– సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
► పట్టాభి వంటి జీతానికి పనిచేసే వాళ్లతో సీఎం వైఎస్ జగన్‌ను, మమ్మల్ని తిట్టించడం చంద్రబాబు ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ‘చంద్రబాబు మోసగాడు. 420. అవినీతి చక్రవర్తి. ఔరంగజేబు’ అని నాడు ఎన్టీఆర్ అన్నారు. అవే మాటలను నేను గుర్తు చేస్తున్నా అంతే. అసలు గంజాయి వ్యాపారం మొదలు పెట్టిందే చంద్రబాబు.
– కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి
► పట్టాభితో చంద్రబాబు చేయించినది చర్య అయితే, జగనన్న అభిమానులు తిరగబడటం కేవలం ప్రతిచర్య మాత్రమే. మొదటిది లేకపోతే అంటే బూతులు తిట్టించకపోతే, ప్రతి చర్యకు అవకాశమే లేదు. 36 గంటలు కాదు.. 360 రోజులు దీక్షలు చేసినా బాబును ప్రజలు నమ్మరు.
– మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు
► చంద్రబాబును ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? ఇలాగే వదిలేస్తే రేపు అన్ని పార్టీల వారినీ ఇలాగే మాట్లాడతారు. అలజడి సృష్టిస్తున్నదే చంద్రబాబు. ఆ దిశగా పోలీసులు విచారణ చేయాలి.
– బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ మంత్రి
► ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబు ఉన్నపళంగా వచ్చి కరకట్ట పక్కన ఎందుకు నక్కి ఉన్నారు? ఈ కుట్ర కోసం కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడలేక ఇంతకు దిగజారతారా? ఆర్టికల్ 356 ప్రయోగించాలా? వ్యవస్థల్ని మేనేజ్ చేసే మీ మాఫియా వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు జరిగిన మంచి ఏమిటి?
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు,గృహ నిర్మాణ శాఖ మంత్రి
► చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పాలి. పట్టాభి ద్వారా చంద్రబాబు మాట్లాడించిన ఆ మాటలు తల్లులను క్షోభకు గురి చేస్తాయి. గొడవలు, ఘర్షణల ద్వారా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు లక్ష్యం.
– గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్