రైతులకు ఆశ చూపి..

మరోసారి రాజధానికి భూ సమీకరణ 

ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం 2025 నోటిఫికేషన్‌ జారీ

11 గ్రామాల్లో 44,676.64 ఎకరాల సమీకరణ 

గతంలోనే 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన టీడీపీ సర్కారు

రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందంటూ 2016 నుంచి చెబుతూ వచ్చిన సీఎం చంద్రబాబు

తాజాగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ కోసం పది వేల ఎకరాల భూమి అవసరమని కూటమి సర్కారు వెల్లడి 

అమరావతి: రాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే. 

మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు. 

ఇప్పుడు స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిపోర్టు, స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు.

రైతులకు ఆశ చూపుతున్న వివీ..
» భూములిచ్చిన రైతులకు తొలి ఏడాది మెట్ట భూమికి ఎకరానికి రూ.30 వేలు, మాగాణి భూమికి ఎకరానికి రూ.50 వేలు కౌలు ఇస్తారు. ఏటా కౌలు ఎకరానికి మెట్టకు రూ.3 వేలు, మాగాణికి రూ.5 వేల చొప్పున పెంచుతారు.
»   నిమ్మ, సపోటా, జామ తదితర ఉద్యానపంటల రైతులకు అదనంగా రూ.లక్ష ఇస్తారు.
»   పదేళ్లపాటు రైతు కూలీలకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్‌గా ఇస్తారు.

»  ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.1.50 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తారు.
»   పూలింగ్‌ కింద భూమి ఇచ్చే రైతులకు..పట్టా భూమి, మె­ట్ట భూమి ఎకరానికిగానూ అభివృద్ధి చేసిన వెయ్యి గ­జా­ల ఇంటి స్థలం, 250 గజాల వాణిజ్య స్థలాలను ప్లాట్లు­గా ఇస్తారు. మాగాణి భూమికైతే ఎకరానికిగానూ అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ఇంటి స్ధలం, 450 గజా­ల వాణిజ్య స్థలాలను ప్లాట్లుగా ఇస్తారు. అసైన్డ్‌ భూమికి కూడా ఇదే తరహాలో ప్రయోజనాలు కల్పిస్తారు. 

Back to Top