సంపదలో నంబ‌ర్ 1 నారా లోకేశ్.. మరి లోకజ్ఞానంలో?

శాసనమండలిలో అత్యంత సంపన్నడిగా వార్తల్లోకి ఎక్కిన లోకేష్‌

అమ‌రావ‌తి: తెలుగుదేశం ‘జాతీయ’ ప్రధానకార్యదర్శి, టీడీపీ అధినేత పుత్రరత్నం నారా లోకేష్‌ ఈమధ్య ఏపీ శాసనమండలిలో అత్యంత సంపన్నడు అనే విషయంతో వార్తల్లోకి ఎక్కారు. ‘ఉంటే హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సొంత నివాసంలో...లేకుంటే మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో’ అన్నట్టు నడుస్తోంది లోకేష్‌ బాబు జీవితం! మొదటిసారి 2019లో మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీచేసి, తొలి ఎన్నికల పోరులోనే లోకేష్‌ పరాజయం మూటగట్టుకున్నారు గాని, ‘తన’ నియోజకవర్గంలో ఈ మధ్య తెగ తిరుగుతున్నారు. మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ, ఉచిత ఆరోగ్య కేంద్రం ప్రారంభం వంటి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే పనులు చేస్తున్నారు ఈ విపక్ష ఎమ్మెల్సీ. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు  ఏరికోరి ఎంపిక చేసిన ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి నుంచి ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలనే కోర్కె లోకేష్‌ బాబులో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తప్పులేదు, ఓడినచోటే గెలుపు కోసం అన్వేషణ ప్రజాస్వామ్యాన్ని ‘బలోపేతం’ చేస్తుందంటారు పెద్దలు.
‘వద్దంటే వెళ్లాను మంగళగిరికి!’
మంగళగిరి అంటే కొందరు పాత్రికేయులు ఎప్పుడో 1985 ఏపీ తొలి మధ్యంతర ఎన్నికల నాటి ముచ్చట గుర్తుచేస్తున్నారు. అప్పుడు మంగళగిరి స్థానం నుంచి ఓ ప్రముఖ సినీనటి కాంగ్రెస్‌ టికెట్‌ పై పోటీచేసి మూడున్నర వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మళ్లీ మంగళగిరి ముఖం చూడలేదు. ఆమె ఓటమిపై అప్పట్లో–‘వద్దంటే వెళ్లాను మంగళగిరికి’ అని తెలుగు దినపత్రికలు శీర్షికలు కూడా పెట్టాయి. అలాగే లోకేష్‌ బాబు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 20 మాసాల దూరం మాత్రమే ఉండడంతో, 39 సంవత్సరాల వయసులో ఆయన మంగళగిరిలో చాలా గట్టిగా జనం మధ్య తిరుగుతున్నారు. అయితే, ‘తన నియోజకవర్గ’ పర్యటనల్లో భాగంగా ‘టెన్త్‌ పాస్, డిగ్రీ ఫెయిల్‌ అయిన తెలివితేటలు’ అంటూ చదువుకోలేకపోయిన యువకులను అవమానించే రీతిలో చంద్రబాబు ‘సుపుత్రుడు’ ఎడాపెడా మాట్లాడడం ఏమాత్రం సభ్యతగా లేదు. అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో డిగ్రీ చదవడానికి తనకు బిలియనీర్లు సాయపడినట్టుగా పేదలకు సంపన్నులు తోడ్పాటు అందించరనే విషయం చినబాబు గ్రహిస్తే మంచిది.

Back to Top