మాజీ హైటెక్ సీఎంకు అర్థం కావ‌డం లేదా?

 అంతా టెక్నాలజీలో ఉందనుకునే చంద్రబాబుకు జనంపై నమ్మకం లేదు! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: టెలిఫోన్‌ అత్యధిక ప్రజలకు కూడు పెడుతుందని, సంపద సృష్టిస్తుందనే ఐడియాకు తనకే పేటెంట్‌ హక్కు ఉన్నట్టు మాట్లాడతారు మాజీ హైటెక్‌ సీఎం చంద్రబాబు నాయుడు. నారా వారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికే అంటే 1995 కల్లా ప్రపంచంలో సమాచార సాంకేతికత (ఐటీ విప్లవం) వేగం పుంజుకుంటోంది. సేవారంగంగా పరిగణించే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సెక్టర్‌ వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న క్రమంలో అన్ని ప్రపంచ నగరాలతోపాటే ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్‌ కు కూడా ఈ విప్లవం విస్తరించింది. ఇందులో ఆయన పాత్ర నామమాత్రమే. సమాచార వినిమయానికి ఫోన్‌ అవసరమనే విషయం కొన్ని దశాబ్దాల క్రితమే ప్రపంచం గుర్తించింది. అయితే, తన వల్లే ఆంధ్రప్రదేశ్‌ లో టెలిఫోన్‌ సౌకర్యాలు సర్వత్రా విస్తరించాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఐటీ రంగం వ్యాప్తికి, విస్తరణకు టెలిఫోన్‌ అవసరమనే విషయం తానే కనుగొన్నట్టు కూడా ఇటీవల ఒక ఓటీటీ టాక్‌ షోలో తెలుగుదేశం అధినేత ‘వెల్లడించారు’. ఐటీ ఆధారిత టెక్నాలజీతో ప్రజందరికీ కూడూ, గుడ్డా, నీడా సాధ్యమనే నమ్మకం చంద్రబాబును పాతికేళ్ల క్రితమే కమ్ముకుంది. అన్ని అవసరాలనూ ఐటీ రంగం తీర్చలేదని, టెక్నాలజీకి పరిమితులున్నాయని ఎందరు నిపుణులు చెప్పినా ఆయన బుర్రకు ఎక్కలేదు. చెప్పుకోదగ్గ సంఖ్యలో జనం వ్యవసాయంపైన, చేతి వృత్తులపైనా ఆధారపడి ఉన్న తెలుగునాట వానలు తగినన్ని పడకపోతే టెక్నాలజీ తిండి పెట్టదని 2000–2004 మధ్య కాలంలో ఏపీ పరిస్థితులు నిరూపించాయి. కాని, వాస్తవాన్ని రెండు కళ్లతో చూడడానికి ముఖ్యమంత్రి పదవిలో అప్పటికే ఆరేడేళ్లుగా ఉన్న చంద్రబాబు గారు నిరాకరించారు.

మనిషిని కాకుండా టెక్నాలజీనే నమ్మితే ఏమవుతుంది? 
కమ్యూనికేషన్‌ (టెలిఫోన్‌) సౌకర్యాలతో పనిచేసే ఇంటర్నెట్‌ ఆధారిత టెక్నాలజీ మనిషికి అన్ని అవసరాలు తీర్చుతాయని, ఎనలేని సంపద సృష్టిస్తాయనే గుడ్డి నమ్మకంతో ఎంఏ (ఆర్థికశాస్త్రం) చదివిన ముఖ్యమంత్రి పాలన సాగించారు. ఒక్క టెక్నాలజీని నమ్ముకుంటే ప్రజల అవసరాలు తీరడమేగాక, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేరతాయని ఆయన విశ్వసించారు. ఐటీ రంగమే తనను 2020 దాకా అంటే పాతికేళ్లు (1995–2020) బ్రేక్‌ లేకుండా ముఖ్యమంత్రి పీఠంపై కదలకుండా కూర్చోబెడుతుందని చంద్రబాబు ఆశించారు. ఆయన ఆశలు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అడియాశలయ్యాయి. అయినా, తాను ఊహించుకున్న ‘టెక్నాలజీ’పై కుప్పం ఎమ్మెల్యేకు నమ్మకం సడలలేదు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉన్నాగాని బాబు గారిలో మార్పు రాలేదు. సీఎం గద్దె నుంచి దిగిపోయాక ‘తాను మరానని’ పార్టీ నేతలు, కార్యకర్తల ముందు ప్రకటనలు గుప్పించిన చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో అనూహ్యంగా వచ్చిన అధికారంతో మరోసారి ‘టెక్నాలజీ మత్తు’ ఎక్కింది. 2014–19 మధ్య కాలంలో విభజిత రాష్ట్రంలో ఇంటింటికీ ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చి మరో ఐదేళ్లు రాజ్యమేలాలని ఆయన భావించారు. కాని, ఎందుకనో ఆయన పథకం ఆచరణలో సాధ్యం కాలేదు. 27 ఏళ్ల అనుభవం తర్వాత కూడా తాను అనుకునే ‘టెక్నాలజీ’యే మనిషికి అన్నీ సమకూర్చుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. టెక్నాలజీకి ఉన్న పరిమితుల గురించి నిపుణులు, ఓటర్లు మూడుసార్లు (2004, 2009, 2019) చెప్పినా మాజీ సీఎం గారికి అర్ధంకాలేదు.

Back to Top