విశాఖ: సాగర తీరంలో పోటెత్తే కెరటాల ఘోష శనివారం విశాఖ బీఆర్టీఎస్ రోడ్డులో వినిపించింది! చిరు మందహాసంతో జగనన్న కదిలి వస్తుంటే ఉప్పొంగిన మహా సైన్యం వెంట నడిచింది! అశేష జనవాహిని నడుమ ప్రశాంత వదనంతో అడుగులు వేస్తున్న సీఎం వైయస్ జగన్ చూసి ప్రచండ భానుడు చల్లబడ్డాడు! ఆకాశం మేఘావృతమై జననేతకు ఘన స్వాగతం పలికింది. మహా విశాఖ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం, ఎన్‌ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిపాలెం మీదుగా ఎండాడ వరకు సాగింది. దారిపొడవునా అక్కచెల్లెమ్మలు హారతులు, చిన్నారులు కోలాటాలు, యువకులు డ్యాన్సులు, తీన్‌మార్ స్టెప్పులతో సీఎం వైయస్ జగన్‌కు సాదర స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు ఆదివారం గ్రేటర్ విశాఖలో అపూర్వ రీతిలో సాగింది. దారులన్నీ యాత్ర వైపే.. చిన్నయ్యపాలెం నైట్ స్టే క్యాంపు వద్ద సీఎం వైయస్ జగన్‌ను చూసేందుకు స్థానికులు, అనకాపల్లి జిల్లా వాసులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి రావడంతో పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి. పలువురు పార్టీ నేతలు సీఎం జగన్‌ను శిబిరం వద్ద కలిశారు. చిన్నయపాలెం వద్ద ఉదయం 10.30 గంటల సమయంలో ప్రారంభమైన బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి, రాంపురం, చింతల అగ్రహారం, లక్ష్మీపురం, వరలక్ష్మీనగర్, వేపగుంట మీదుగా గోపాలపట్నం వరకు సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మలు హారతులు ఇచ్చారు. లక్ష్మీపురం సెంటర్‌లో విద్యార్థినులు, యువతులు పూలుచల్లి స్వాగతం పలికారు. నాయుడుతోట మీదుగా సాగిన యాత్ర మధ్యాహ్నం భోజన విరామానికి గోపాలపట్నం చేరుకునే సరికి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది. పినగాడి నుంచి వేపగుంట జంక్షన్ వరకు సుమారు 14 కి.మీ ఉండగా సీఎం జగన్ ప్రతి సెంటర్‌లో ఆగి చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు. గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు మండుటెండలో వెళ్లిన రోజులను, ఇప్పుడు పొద్దు పొడవకముందే వలంటీర్ ఇంటికే వచ్చి ఇవ్వటాన్ని పినగాడిలో వృద్ధులు గుర్తు చేసుకున్నారు. మేలు చేసిన తమ బిడ్డను చూస్తుంటే ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పలుచోట్ల ఫొటోలు తీసేందుకు వాహనదారులు పోటీ పడ్డారు. బాధితులకు భరోసా.. ► అరుదైన చర్మ వ్యాధితో బాధ పడుతున్న సబ్బవరానికి చెందిన చిన్నారి హరిత చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా నయం కాలేదని, తమకు ఆర్థిక స్థోమత లేదని బాలిక తండ్రి రామకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నయపాలెం వద్ద వారిని గమనించిన సీఎం జగన్ దగ్గరకు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. బాలికను ఆప్యాయంగా పలకరించి నీకేం కాదు.. నేనున్నానంటూ అభయమిచ్చారు. ► వెదుళ్ల నరవ ప్రాంతానికి చెందిన సర్వసిద్ధి దుర్గారావు చెట్టుపై నుంచి పడిపోవడంతో జీవచ్ఛవంలా మంచానికే పరిమితమయ్యాడు. పెదనాయుడుపాలేనికి చెందిన సబ్బవరపు శివ అరుదైన కేన్సర్‌తో బాధ పడుతున్నాడు. పినగాడి వద్ద అంబులెన్సులో ఉన్న వారిని గమనించిన సీఎం జగన్ వివరాలు తెలుసుకుని, ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ► పెందుర్తి మండలం రాంపురం వద్ద దివ్యాంగ కవల సోదరులైన జి.జీవన్ కుమార్, జి.తరుణ్ కుమార్ ట్రైసైకిల్‌పై వచ్చి సీఎంను కలిశారు. తమ పై చదువులకు సాయం చేయాలని కోరారు. జీవన్ కుమార్ ఇటీవల ఇంటర్ ఫలితాల్లో 815 మార్కులు సాధించాడు. వారిద్దరినీ ఆత్మీయంగా పలకరించిన సీఎం జగన్ తగిన సహాయం అందిస్తామని భరోసానిచ్చారు. ► న్యూరో సమస్యతో బాధపడుతున్న చినబుచ్చిరాజుపాలేనికి చెందిన 11 ఏళ్ల పార్ధివ్ కుమార్ సాయం కోరుతూ తన మేనమామ శివప్రసాద్‌తో కలసి బైక్‌పై రాగా ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద వారిని గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి అధికారులను పంపి బాధితుడి వివరాలను సేకరించారు. ► జేసీగా పనిచేసి పదవీ విరమణ పొందిన కాకర్ల నాగేశ్వరరావుకు టీడీపీ హయాంలో ఆటంకాలు సృష్టించడంతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాలేదు. ఇసుకతోట వద్ద ఆయన వీల్‌చైర్‌లో వచ్చి సీఎం జగన్‌కు వినతిపత్రం అందించగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మురిసిన మహా విశాఖ.. ఉదయం పూట సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక ఎత్తు కాగా మధ్యాహ్నం గోపాలపట్నం నుంచి కొనసాగిన యాత్ర మరో ఎత్తు. సూరీడు చల్లబడటంతో అభిమానుల రెట్టించిన ఉత్సాహం నడుమ గోపాలపట్నం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో యాత్ర సాగింది. నదులన్నీ సాగరాన్ని చేరినట్లు దారులన్నీ జగన్ యాత్ర వైపే దారి తీశాయి. లక్షలాదిగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో రోడ్డు మొత్తం నిండిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఇసుకతోట జంక్షన్, తీన్‌మార్‌తో ఊగిపోయిన ఓల్డ్ కరసా ప్రాంతం, వందలాది కలశాలు నెత్తిన పెట్టుకుని స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న మహిళలతో అక్కయ్యపాలెం జంక్షన్ కిక్కిరిశాయి. మహా విశాఖ ప్రధాన రోడ్డు 20 కి.మీ మేర జన సంద్రాన్ని తలపించింది. మర్రిపాలెం చేరుకున్న జననేతకు అక్కచెల్లెమ్మలు ఘన నీరాజనం పలికారు. గుమ్మడి కాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. గోపాలపట్నంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం 3.30 గంటలకు తిరిగి ప్రారంభమైన బస్సు యాత్ర ఎండాడ వరకు సాగింది. సీఎం జగన్ రాత్రి 8.54 గంటలకు ఎండాడ నైట్ క్యాంప్‌కు చేరుకున్నారు. మంచి చేసిన మారాజు.. ‘జగనన్న పాలనలో ప్రతి ఇంటికీ మేలు జరిగింది. ఏదో ఒక లబ్ధి చేకూరింది. మాది మత్స్యకార కుటుంబం. చంద్రబాబు పాలనలో వేట నిషేధం సమయంలో పస్తులుండాల్సిన పరిస్థితి. ఇప్పుడు మత్స్యకార భరోసా ఇస్తున్నారు. మా మనవళ్లకు ఈ ఐదేళ్లూ పుస్తకాలు కొనాల్సిన పరిస్థితి రాలేదు. బడికి పంపిస్తున్నందుకు అమ్మ ఒడి ఇచ్చారు. ఇంత మేలు చేసిన మారాజును చూడ్డానికి వచ్చా’.. – మైలపల్లి అప్పల నర్సమ్మ, వాడ నరసాపురం పేదల కష్టాలు తీర్చారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు! జగన్ బాబు చరిత్రలో నిలిచిపోతాడు. పేదల కష్టాలు తెలుసుకుని తీర్చిన మనసున్న నాయకుడు జగన్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రభుత్వ బడిలోనే చదివించా. పెద్దమ్మాయి పాలిటెక్నిక్ చదువుతోంది. చిన్నమ్మాయి పది పూర్తి చేసింది. ఇద్దరికీ జగనన్న విద్యా కానుక ఇచ్చారు. ఒక్కరికి అమ్మఒడి ఇచ్చారు. రైతు భరోసా వచ్చింది. నా భర్త చనిపోవడంతో ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఇస్తున్నారు. నాలాంటి వారెందరికో పథకాలు వస్తున్నాయి. జగన్ సీఎం కాకుంటే ఇవేమీ వచ్చేవి కావు. – గండి వరలక్ష్మి, చినగాడి (పెందుర్తి నియోజకవర్గం) నిద్ర లేపి మరీ పింఛన్.. చంద్రబాబు పాలనలో నాలాంటి ముసలోళ్లు పెన్షన్ తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పనయ్యేది. పొద్దునే పంచాయతీ వద్దకు వెళ్లి పుస్తకం లైన్‌లో పెట్టాలి. అదృష్టం ఉంటే ఆ రోజు ఏ సాయంత్రానికో డబ్బులిచ్చేవారు. లేదంటే ‘రేపు రా’ అనేవారు. ఇలా ఐదారు రోజలు తిరిగితేగానీ పెన్షన్ తీసుకోలేకపోతిమి. ఇప్పుడు జగన్ పంపిన వలంటీర్లు పొద్దున్నే నిద్ర లేపి మరీ పెన్షన్ ఇస్తున్నారు. ఆయన పాలనతో ప్రతి ఇంటికీ మేలు జరిగింది. – సబ్బవరపు దేవుడమ్మ, చినగాడి వైజాగ్ బాగుండాలంటే జగన్ రావాలి టీడీపీ పాలనలో నాయకులు విశాఖను ఎంత దోచుకున్నారో ఇక్కడి ప్రజలెవరూ మరిచిపోరు. చంద్రబాబు బంధువులే ఎక్కువ అక్రమాలు చేశారు. విశాఖ బాగుపడుతోందంటే అది జగన్ పాలనలోనే. ఒకప్పుడు కేజీహెచ్‌కు వెళ్లాలంటే భయమేసేది. సరైన సదుపాయాలు, మందులు ఉండేవి కావు. ఇప్పుడు చాలామంది వైద్యం కోసం అక్కడికే వెళ్తున్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే విశాఖ రాజధాని అవుతుంది. మరింత ప్రగతి సాధిస్తుంది. – బి.సాంబశివరావు, వ్యాపారి (అక్కయ్యపాలెం) జగన్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న ఉద్దానం ప్రజలకు మేలు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వందల పరిశ్రమలు వచ్చాయి. అందరూ సంక్షేమం ఒక్కటే చూస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అంతకంటే పది రెట్లు అభివృద్ధి సాధించింది. జగన్ మళ్లీ సీఎం అయితేనే భవిష్యత్ బాగుంటుంది. – వై.సుబ్బారెడ్డి, వ్యాపారి (వైజాగ్ ఈస్ట్) టీడీపీ, జనసేన నేతలు చేరికలు చిన్నయపాలెంలోని నైట్ స్టే క్యాంపు వద్ద అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యకలాపాలపై దిశానిర్దేశం చేశారు. ఇదే క్యాంపులో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అండ్ టీఎస్ ఎప్‌సీఆర్‌ఏ ఎన్జీవోస్ చైర్మన్, విద్యావేత్త అలీవర్ రాజు రాయ్, 2019లో జనసేన తరఫున విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసిన గంపల గిరిధర్, జనసేన సీనియర్ నేత ఎన్.శ్రీనివాస్, జి.శ్రీజ, జి.ధనుష్, శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణ కుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ డి.భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్, కిరణ్మయి, దాసు సీఎం జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారికి సీఎం జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.