పేద‌ల జీవితాల్లో కొత్త వెలుగు

2020పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ సంతకం

సీ ఓటర్, ఐఏఎన్‌ఎస్‌ సర్వేలో.. దేశంలో టాప్‌–5 సీఎంల జాబితాలో వైయ‌స్‌ జగన్‌కు చోటు

‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో సీఎం వైయ‌స్‌ జగన్ మూడో స్థానం

ప్రజలు 2020ని కరోనా నామ సంవత్సరమని పిలుచుకున్నారు. ఈ ఏడాది ఆద్యంతం ‘కరోనా’ పేరు వినిపించని రోజంటూ లేదనడం అతిశయోక్తి కాదు. అందరి నోటా అదే మాట. అయితే ఇంతటి మహమ్మారి కోరలు చాచి, తన ప్రతాపాన్ని చూపినా.. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా కుంటుబడక పోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. కరోనా తొలి రోజుల్లో పలు దఫాలుగా ప్రజలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ మొదలు ప్రస్తుతం కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ వరకు సంక్షేమం కొత్తపుంతలు తొక్కింది. హైకోర్టు తీర్పులు, ఎల్‌జీ ప్రమాదం, వరదలు, నివర్‌ తుపాన్, ఏలూరు ఘటనలు ఆందోళన కలిగించాయి.

ఉద్యోగుల  కల సాకారం
► ప్రభుత్వంలో విలీనం కావడమనేది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఎన్నో ఏళ్ల కల. ఈ కలను సాకారం చేస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి రాగానే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. అన్ని విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ, ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు జనవరి 1వ తేదీన 51 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. 
► వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. 
► చిన్నారులను బడికి పంపించిన ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు జమ చేసే విప్లవాత్మక పథకం ‘అమ్మ ఒడి’కి శ్రీకారం చుట్టారు. పేద పిల్లల చదువుకు ఊతమిచ్చే పథకమిది. 
► అన్నదాతలకు అండగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. 
► అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు అసెంబ్లీ ఆమోదం. సీఆర్‌డీఏ రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌. హైపవర్‌ కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్‌. శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్‌ కమిటీకి మూడు రాజధానుల బిల్లు. శాసనమండలి రద్దుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. 
► గ్రామ, వార్డు సచివాలయాల్లో 536 సేవలు.
► కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేసే ‘కాపునేస్తం’ పథకం అమలు.

ప్రతి జిల్లాలో   కోవిడ్‌ ఆస్పత్రులు
► ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మన రాష్ట్రానికీ పాకింది. నెల్లూరులో తొలి కేసు నమోదైంది. అంతకు ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి జిల్లాలో ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్‌.. అంటూ భారీ స్థాయిలో పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఖర్చుకు వెరవక పెద్ద ఎత్తున టెస్ట్‌ కిట్లకు ఆర్డర్‌ చేసింది. కరోనా సోకిన వారిని గుర్తించి ఐసోలేట్‌ చేయడం, లేదా ఆస్పత్రికి తరలించడాన్ని వేగవంతం చేసింది. కోవిడ్‌ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంది. కరోనా మరణాల శాతం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి బలవర్థక ఆహారం అందించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాను ఎదుర్కొనే విషయంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోదీ ప్రశంసలు పొందింది. 
► స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించరాదని హైకోర్టు తీర్పు. కరోనా వైరస్‌ వల్ల ఎన్నికలను వాయిదా వేసిన స్టేట్‌ ఎన్నికల కమిషన్‌. 
► రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు.. ఓటాన్‌ అకౌంట్‌ పద్దు ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం.

రూ. కోటి  పరిహారం
► విశాఖపట్నం సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగితే.. నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు ఘటన స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటనలో 12 మంది మృతుల కుటుంబాలకు, బాధితులకు ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరి ప్రాథమిక వైద్యం పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.25 వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ రూ.10 వేల చొప్పున సాయం అందజేశారు.  
► మద్యపాన నియంత్రణ చర్యలలో భాగంగా మద్యం ధరలు 75 శాతం పెంపు. మద్యం, ఇసుక అక్రమాల కట్టడికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటుకు సీఎం ఆదేశం.
► వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకం ప్రారంభం.  
► ఆర్టీసీ సర్వీసులు పాక్షికంగా పునః ప్రారంభం. చిన్న తరహా పరిశ్రమలకు రూ.1,100 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీ అమలు.  
► ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్‌ నియామకానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ రద్దు.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొనసాగింపు. 
► రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌.

 

టాప్‌–5 సీఎంల జాబితాలో వైఎస్‌ జగన్‌
► సీ ఓటర్, ఐఏఎన్‌ఎస్‌ సర్వేలో.. దేశంలో టాప్‌–5 సీఎంల జాబితాలో వైఎస్‌ జగన్‌కు చోటు.
► వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న చేదోడు, కాపు నేస్తం పథకాలు ప్రారంభం. 
► నిర్ణీత వ్యవధిలో పథకాల మంజూరు.
► గత ప్రభుత్వ అవకతవకలను నిర్ధారించిన మంత్రివర్గ ఉప సంఘం. సీబీఐతో విచారణకు సిఫార్సు.
► ఈఎస్‌ఐ కుంభకోణంలో  అచ్చెన్నాయుడు అరెస్టు.
► పదవ తరగతి, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు. విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించిన ప్రభుత్వం.

ప్రజారోగ్య రథయాత్ర
2020 జూలై

► ప్రాణాపాయంలో ఉన్న వారి పాలిట సంజీవని అయిన 108, 104 అంబులెన్స్‌లు మళ్లీ కుయ్‌ కుయ్‌ అంటూ కొత్తగా రోడ్డెక్కాయి. ఏకంగా 1,088 అంబులెన్స్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక 108, ఒక 104 అంబులెన్స్‌లను కేటాయించారు. చిన్నారుల కోసం 26 నియోనేటల్‌ అంబులెన్స్‌లు కూడా ప్రారంభించారు. 
► ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌ ప్రారంభం. 50,449 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం. 
► హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు.   
► 57 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ సొమ్ము బకాయిలు రూ.1,150 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.  
► నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ.24 వేల వంతున ఆర్థిక సాయం చేసింది.   
► వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తించేలా పశ్చిమగోదావరి జిల్లాలో మోడల్‌గా అమలు చేసిన పథకాన్ని మరో ఆరు జిల్లాలకు ప్రభుత్వం విస్తరించింది. 
► అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం.  
► మంత్రివర్గంలో మార్పులు. కొత్తగా వేణుగోపాలకృష్ణ, అప్పలరాజుకు చోటు.  
► రాజమండ్రిలో దళితుడికి శిరోముండనం కేసులో పోలీసులపై వేటు. 
► మూడు రాజధానులకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదముద్ర వేశారు. 

ప్రజాదరణలో తొలి స్థానం

2020 ఆగస్టు
► విజయవాడలోని ప్రైవేటు కోవిడ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రమేష్‌ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహించిన కోవిడ్‌ సెంటర్‌లో ఈ ప్రమాదం కారణంగా 10 మంది మృతి చెందారు. 18 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అనంతరం ఈ కేసు దర్యాప్తునకు మార్గం సుగమమైంది. 
► విశాఖ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 
► ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) మృతి చెందారు. 
► ఇండియా టుడే ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సొంత రాష్ట్రంలో ప్రజాదరణలో తొలి స్థానం దక్కించుకున్నారు.  
► విజయనగరం జిల్లా వైయ‌స్సార్‌సీపీ నేత పెనుమత్స సాంబశివరాజు (88) మృతి చెందారు. 
► వైయ‌స్సార్‌ చేయూత కింద 23 లక్షల మంది మహిళలకు తొలి విడతగా రూ.18,750 చొప్పున జమ చేశారు.ఈ పథకం కింద నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు అందజేస్తారు. 
► రిలయన్స్‌ రిటైల్‌ – జియో, అల్లానలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

అర్హులందరికీ  పింఛన్లు
2020 ఫిబ్రవరి

► ఒకప్పుడు వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్‌ పొందాలంటే అదో పెద్ద ప్రహసనం. అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలదే పెత్తనం. లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఇంకా దారుణం ఏమిటంటే ఎవరైనా పింఛన్‌దారు మరణిస్తే వారి స్థానంలో కొత్త వారికి ఇచ్చేవారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ, కులం, మతం, ప్రాంతం.. చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 
► మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాజమహేంద్రవరంలో సీఎం వైఎస్‌ జగన్‌ ‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. 
► 1.42 కోట్ల కుటుంబాలకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన హెల్త్‌ కార్డుల జారీకి శ్రీకారం. మూడవ దశ కంటి వెలుగులో భాగంగా అవ్వా తాతలకు కంటి పరీక్షలు.
► రాజధాని భూ అక్రమాలపై సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేస్తూ నిర్ణయం.
► ఐటీఐ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన అమలు.

ఆపదలో  అండగా..
2020 ఏప్రిల్‌ 

► కోవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై మూడో విడత సర్వేకు సీఎం జగన్‌ ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ సహకారంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించింది. లాక్‌డౌన్‌ వల్ల పేదలు ఇబ్బంది పడకుండా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేసింది. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులను ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్‌ కిట్లు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో తయారీకి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫోన్‌ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందజేసే సరికొత్త ‘టెలీ మెడిసిన్‌’ వ్యవస్థ ప్రారంభమైంది. కరోనా శాంపిల్స్‌ సేకరణకు మొబైల్‌ కియోస్కులు ఏర్పాటయ్యాయి. 
 ► ధాన్యం కొనుగోళ్లకు కొత్తగా 810 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు  
► మెకానిక్‌ షాపు, పరిశ్రమలు, ఈ కామర్స్‌ కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు. కరోనా టెస్టులలో ఏపీకి ఫస్ట్‌ ప్లేస్‌.
► సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేసిన సీఎం.
► అదనంగా జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున జాయింట్‌ కలెక్టర్ల నియామకం. ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి.

గ్యాగ్‌ ఆర్డర్‌పై  దేశ వ్యాప్తంగా నిరసనలు
2020 సెప్టెంబర్‌

► అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తును ఆపాలని, భూ కుంభకోణంపై ఎలాంటి వార్తలు రాయొద్దని, ప్రసారం చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులివ్వడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ విషయమై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ప్రముఖ జర్నలిస్టులు, న్యాయ కోవిదులు హైకోర్టు తీర్పును తప్పు పట్టారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఈ విషయమై సీఎం వైయ‌స్ జగన్‌ ఏకంగా సీజేఐకి లేఖ రాశారు.  
► ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో ఏపీకి ప్రథమ స్థానం. వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలను సీఎం ప్రారంభించారు.  
►  తిరుపతి వైయ‌స్సార్‌ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు క‌న్నుమూత 
► అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయం.  
► ఏపీ పోలీస్‌ సేవా యాప్, వైయ‌స్సార్‌ జలకళ ప్రారంభం. 

జగనన్న విద్యాకానుక
2020 అక్టోబర్‌

► రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం కింద టెక్ట్స్‌ పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగ్, మూడు జతల యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్టు అందించారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రులకు సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లబ్ధి కలిగింది.  
► 24 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.  1.53 లక్షల మంది గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద 3.12 లక్షల ఎకరాల భూమిని సీఎం పంపిణీ చేశారు. 
► పోలీసుల దర్యాప్తులను అడ్డుకుంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రాథమిక దశలోనే దర్యాప్తులను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్టే. 
► 1.41 లక్షల కుటుంబాలకు వైయ‌స్సార్‌ ఉచిత బీమా పథకం ప్రారంభం. రైతు భరోసా పథకం కింద 50.47 లక్షల మంది రైతులకు రూ.6,797 కోట్లు సాయం.  వైయ‌స్సార్‌ బడుగు వికాసం ప్రారంభం. 

చిరు వ్యాపారులకు భరోసా
2020 నవంబర్‌

► రోడ్డు పక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తలపై బరువు మోస్తూ వీధుల్లో తిరిగి అమ్ముకునే వారు, చేతి వృత్తుల వారు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతుంటారు. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకుని వచ్చిన ఆదాయంలో అత్యధికంగా తిరిగి వారికే చెల్లిస్తుంటారు. తన పాదయాత్రలో ఈ కష్టాలను దగ్గరుండి చూసిన వైఎస్‌ జగన్‌.. వారికి అండగా ఉండేందుకు రూ.10 వేలు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. వలంటీర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుని వారికి బ్యాంకుల నుంచి రుణం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. రూ.1,000 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
► కరోనా కారణంగా ఆగిపోయిన స్కూళ్లు ప్రారంభం. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ సహా 2,434 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేసేందుకు శ్రీకారం.  
► వైయ‌స్సార్‌ చేయూత రెండో దశలో రూ.510.01 కోట్ల సాయం. వైయ‌స్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 14.58 లక్షల మంది రైతులకు రూ. 510 కోట్లు జమ.
► రూ.3 వేల కోట్ల ఖర్చుతో ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులకు శంకుస్థాపన చేసిన సీఎం. 
► అమరావతి భూ కుంభకోణాలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను నిలిపి వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే. 
► నివర్‌ తుపాన్‌ వల్ల పంటలకు నష్టం. వేగవంతంగా నష్టం అంచనా. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.

 2020 డిసెంబర్‌
► పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కారణం తెలియకుండా పలువురు ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వందలాది మంది ఉన్నట్టుండి మూర్ఛతో పడిపోతూ ఆస్పత్రుల పాలయ్యారు. బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. కేంద్ర వైద్య బృందం, రాష్ట్ర వైద్యులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. అందరికీ మంచి వైద్యం అందించడంతో వెనువెంటనే కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. 
► ఏపీ అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం.  ‘జగనన్న జీవ క్రాంతి’ పథకం కింద 4.69 లక్షల మంది మహిళలకు ఆవులు, గేదెల యూనిట్లు. 
► హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏకే గోస్వామి. 
► 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్‌లు, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారం. 
► సమగ్ర భూ రీ సర్వే, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం. వైయ‌స్సార్‌ రైతు భరోసా తుది విడతగా రూ.1,120 కోట్లు జమ.  నివర్‌ తుపాన్‌ నష్ట పరిహారం కింద రూ.646 కోట్లు చెల్లింపు.   

Back to Top