ఇళ్ల నిర్మాణంతో ఎకానమీకి బూస్ట్‌..

1 నుంచి వైయ‌స్సార్‌ – జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు

తొలిదశ ఇళ్లపై 25 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి 

కర్ఫ్యూ సమయంలోనూ పనులేవీ ఆగకూడదు.. మధ్యాహ్నం 12 వరకు నిర్మాణ పనులు కొనసాగాలి

నీటి సదుపాయం, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఉండాలి

ఇళ్ల పనుల్లో జాప్యం ఉండకూడదు

కోవిడ్‌ విపత్తులోనూ గృహ నిర్మాణాలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది

కార్మికులకు ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున పని దొరుకుతుంది

స్టీల్, సిమెంట్‌ తదితర సామగ్రి కొనుగోళ్లతో వ్యాపార లావాదేవీలూ సజావుగా జరుగుతాయి

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’, జగనన్న కాలనీలలో వసతులు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి

కోవిడ్‌ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. కార్పెంటర్లు, ప్లంబర్లు లాంటి రకరకాల వృత్తుల వారికి దీర్ఘకాలం ఉపాధి లభిస్తుంది. స్టీల్, సిమెంట్‌ తదితర గృహ నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయడం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా కొనసాగి ఎకానమీ బూస్ట్‌ అవుతుంది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్‌ చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది.
– ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

 అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్సార్‌ – జగనన్న కాలనీల్లో జూన్‌ 1వ తేదీన తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చేకూర్చడమే కాకుండా కార్మికులకు పెద్ద ఎత్తున పని దొరుకుతుందని.. స్టీల్, సిమెంట్‌ ఇతర మెటీరియల్‌ కొనుగోళ్లతో వ్యాపార లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదని, మధ్యాహ్నం 12 వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’, వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఇళ్ల పనులేవీ ఆగకూడదు..
జగనన్న కాలనీలలో జూన్‌ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగించాలి. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్‌ కీలకం కాబట్టి వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలి.

మోడల్‌హౌస్‌ తప్పనిసరి..
ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ హౌస్‌ నిర్మించి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయవచ్చు..? లాంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి.

సొంతంగా కట్టుకుంటే మెటీరియల్‌..
కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్‌ వినియోగం తగ్గి రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్‌ ఫ్యాక్టరీలు ఆక్సిజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ కావాలి. స్టీల్‌ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్‌ తప్పనిసరిగా అందించాలి. 

అన్ని వసతులు ఉండాలి..
కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. తగిన మౌలిక వసతులు కూడా కల్పించాలి. లేఅవుట్‌ పక్కాగా ఉండాలి. సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జేజేఎం), విద్యుదీకరణ, ఇంటర్నెట్‌ లాంటివి మౌలిక వసతుల్లో ముఖ్యమైన కాంపోనెంట్స్‌. కరెంటు, నీటి సరఫరాతో పాటు రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు.

భూగర్భ కేబుల్‌ వ్యవస్థ.. 
భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైపులైన్లు, విద్యుత్‌ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి.

కేంద్రాన్ని అదనపు నిధులు కోరదాం..
ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తోంది కాబట్టి అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్‌ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.

ఏడాదిలో ఇళ్లు పూర్తి
రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, వైఎస్సార్‌ అర్బన్‌–బీఎల్‌సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో మ్యాపింగ్‌ జరిగిందని వివరించారు. ఒక లే అవుట్‌లో పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగిస్తే సమన్వయ లోపం, డూప్లికేషన్‌కు తావు ఉండదని అధికారులు ప్రతిపాదించారు. 

81,040 టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి
జగనన్న లేఅవుట్లలో పనులు ఈ జూన్‌లో మొదలు పెట్టి సెప్టెంబరు నాటికి బేస్‌మెంట్, డిసెంబరు నాటికి గోడల నిర్మాణాలు, వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో 81,040 దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం పనులు)లో ఉండగా మరో 71,448 ఇళ్లు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top