ఆగిన రేషన్ బండి.. నడిరోడ్డుపైకి బతుకు బండి

నాడు ఇంటి తలుపు తట్టి పేదలకు రేషన్‌ అందించిన జగన్‌ సర్కార్‌ 

నేడు నడిరోడ్డుపైకి నెట్టి చంద్రబాబు సర్కార్‌ రాక్షసత్వం  

అనాలోచిత నిర్ణయాలతో లక్షలాది మంది పేదలను రోడ్డుకీడ్చిన చంద్రబాబు సర్కారు  

రేషన్‌ సరుకుల కోసం చమటలు కక్కుతూ గంటల తరబడి లబ్ధిదారుల పడిగాపులు 

బియ్యం మూటలతో వృద్ధులు.. పిల్లలను ఎత్తుకుని వచ్చిన మహిళల ఆక్రోశం 

గూడేలకు కిలోమీటర్ల తరబడి సరుకులు మోసుకుంటూ గిరిజనుల అగచాట్లు

పట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్డుపై నిరీక్షణ 

ప్రజలందరినీ ఇక్కట్లకు గురి చేస్తూ అమానవీయ చర్యలకు దిగిన బాబు 

కాలు కదపకుండా గత ప్రభుత్వం పేదల నోటికి అందించిన బువ్వపైనా రాజకీయాలే 

బాబు సర్కారు అమానుషత్వం.. తిరోగమన విధానాలపై పేదల మండిపాటు 

రేషన్‌ దుకాణాలు తెరవడటమే ఆలస్యం దందా మొదలు.. 

బియ్యం ఇవ్వకుండా పేదలకు రూ.10 చేతిలో పెడుతున్న డీలర్లు 

తూకం లేకుండా ఇష్టారాజ్యంగా పంపిణీ.. పని చేయని ఈపాస్‌ మిషన్లు 

ఆత్మ గౌరవంతో జీవించేలా ఇంటివద్దే అందించిన రేషన్‌ వాహనాలకు కూటమి సర్కారు మంగళం  

జగన్‌ హయాంలో ఇంటి వద్దకే రేషన్‌ వాహనాల్లో పంపిణీ బాగుందంటున్న లబ్ధిదారులు 

ఎవరినడిగి ఆ వ్యవస్థను రద్దు చేశారంటూ కూటమి సర్కారుపై ఆగ్రహం

 

ప్రాణం తీసిన రేషన్‌
రేషన్‌ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ మొదలైన తొలిరోజే గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక అనంతపురంలో ఆదివారం లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కొద్ది రోజులు మాత్రమే బియ్యం ఇస్తారనే ఆందోళనతో ఉదయమే దుకాణం వద్దకు చేరుకున్న బాధితురాలు ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలింది.  

టీడీపీ కూటమి సర్కారు కక్షపూరిత విధానాలు, అనాలోచిత∙నిర్ణ­యాలు లక్షలాది మంది పేదలను మళ్లీ రోడ్డుకీ­డ్చాయి! ప్రజలను తీవ్ర ఇక్క­ట్లకు గురి చేస్తూ తీసుకున్న రేషన్‌ వాహనాల రద్దు నిర్ణ­యం సర్కారు అమానవీయ చర్యలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలు­స్తోంది. గత ప్రభుత్వంలో పేదలు ఇంటివద్దే ఆత్మగౌరవంతో అందుకున్న రేషన్‌ సరుకులను డీలర్ల చేతికి అప్పగించి పంపిణీ వ్యవస్థను చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తంగా మార్చేసింది. 

పుట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్లపై నిరీక్షించాల్సిన దుస్థితి కల్పించింది. తమ నోటికాడ ముద్దను లాక్కోవడం మతిలేని నిర్ణయమని బియ్యం కార్డుదారులు మండిప­డుతున్నారు. తిరోగమన విధానాలతో కూటమి సర్కారు అమా­నుషంగా వ్యవహరిస్తోందని ఆక్రోశిస్తున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందిస్తూ పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను నీరుగార్చి చంద్రబాబు సర్కారు తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

చమటలు కక్కుతూ గంటల తరబడి క్యూలలో నిలబడ్డ రేషన్‌ కార్డుదారులు..! ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలుతున్న వృద్ధులు..! చిన్న పిల్లలను ఎత్తుకుని వచ్చి రేషన్‌ దుకాణాల ఎదుట బారులు తీరుతున్న మహిళలు..! కిలోమీటర్ల తరబడి రేషన్‌ సరుకులను మోసుకుంటూ గూడేలకు వెళుతున్న గిరిజనులు..! నెత్తిపై బియ్యం మూటలతో వృద్ధుల అవస్థలు...! పనులు మా­ను­కుని వచ్చినా సర్వర్లు పనిచే­యక, సరుకుల అందక ఉసూరు­మంటూ వెనుతిరుగు­తున్న లబ్ధిదా­రులు..! మొదటి రోజే మూతపడ్డ రేషన్‌ షాపులు..! నానా తిప్పలు పడి దుకాణాల వద్దకు చేరుకున్న వారితో వేలి ముద్ర వేయించుకుని ఇచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపో­వాలని గదమా­యిస్తున్న డీలర్లు..! ఇదీ తొలిరోజు ఆదివారం రాష్ట్ర­వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల వద్ద కనిపించిన దుస్థితి! తూకం యంత్రాలతో పనిలేదు. 

విజయనగరం జిల్లా రామభద్రపురంలో రేషన్‌ కోసం మండుటెండలో క్యూ కట్టిన వృద్ధులు 

ఈ–పోస్‌ మిషన్ల అను­సంధానం అసలే లేదు. ఏ రేషన్‌ షాపును పరిశీలించినా ఇదే దందా కనిపించింది. గత ఐదేళ్లూ పారదర్శకంగా ఇంటివద్దే అందిన సరుకుల పంపిణీని కూటమి సర్కారు రేషన్‌ మాఫియా చేతుల్లో పెట్టేసింది. రాజకీయ కక్షతో పేదల పొట్టగొట్టి నడిరోడ్డుకీడ్చేసింది. 

ఇంటివద్దే కచ్చితమైన తూకంతో రేషన్‌ సరుకులను అందిస్తూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌ డెలివరీ వాహనాల వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తే.. దీన్ని కాదని పచ్చ నేతల జేబులు నింపేందుకు మళ్లీ రేషన్‌ షాపుల ద్వారా సరఫరాను తెరపైకి తెచ్చింది. 

ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థ తిరోగమనంలోకి జారి­పోయింది. తొలిరోజే కూటమి సర్కారు అసమర్థత, దోపిడీ విధానం బహిర్గతమయ్యాయి. పేదలకు బియ్యం అందించటానికి బదులు ‘డీబీటీ ’(డీలర్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్ని అమలు చేస్తూ ప్రజాధనాన్ని కాజేసే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది. 

రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరులో బియ్యం బస్తాలు మోసుకుని వెళ్తున్న మహిళలు 

పొద్దున్నే పడిగాపులు..
రేషన్‌ బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయాన్నే దుకాణాల వద్ద క్యూ కట్టడంతో పలుచోట్ల కిక్కిరిసిపోయాయి. ఎండలో రోడ్లపై, అరుగులపై గంటల కొద్దీ నిలబడి బియ్యం కోసం అగచాట్లు పడ్డారు. ఇరుకు గదుల్లోని రేషన్‌ దుకాణాల వద్ద చమటలు కక్కుతూ నిరీక్షించారు. బియ్యం మూటలను నెత్తిపై మోసుకుంటూ వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం తిరిగి పనులకు వెళ్లాల్సి ఉన్నందున కార్మికులు భారీగా రేషన్‌ షాపుల దగ్గరకు చేరుకున్నారు. వయసు మళ్లిన వారు బియ్యాన్ని మోసుకెళ్లే శక్తి లేక, సాయం అందించే వారు కానరాక డీలర్‌ ఇచ్చినంత తీసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగారు.

తూకానికి తూట్లు..
కేంద్ర ప్రభుత్వం కార్డుదారుల్లో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కచ్చితత్వంతో కూడిన తూకం, నాణ్యమైన సరఫరా విధానం కోసం తూకం యంత్రాలు, ఈ–పోస్‌ మిషన్లను అనుసంధానం చేసి పంపిణీ చేపట్టాలని సూచించింది. గత ప్రభుత్వంలో ఎండీయూల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ సమయంలో ఇదే విధానాన్ని పాటిస్తూ కచ్చితమైన తూకంతో బియ్యాన్ని అందించారు. ఈ–పోస్‌ మిషన్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయగానే పంపిణీ చేయాల్సిన బియ్యం పరిమాణం కనిపించేది. 

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం వెంకటాపురం గ్రామంలో రేషన్‌ షాపు వద్ద గంటల తరబడి లబ్ధిదారుల నిరీక్షణ 

తూకం మిషన్‌లో సరైన పరిమాణంలో బియ్యాన్ని తూచినప్పుడే ఈ–పోస్‌ మిషన్‌ నుంచి బిల్లు జారీ అయ్యేది. తూకం మిషన్‌పై తక్కువ/ఎక్కువ పరిమాణం వేస్తే ట్రాన్సాక్షన్‌ నిలిచిపోయేలా చర్యలు తీసుకున్నారు. రేషన్‌ వాహనాల ద్వారా ఇంత పారదర్శకంగా జరిగిన సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన తొలిరోజే తూకం యంత్రాలతో పని లేకుండా మాన్యు­వల్‌గా ఈ–పోస్‌ మిషన్లలో పరిమా­ణాన్ని నమోదు చేయడం ద్వారా అక్రమాలకు పచ్చజెండా ఊపింది. డీలర్‌ ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదా­రులు నోరెత్తకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది.

పది రోజుల్లో ఫినిష్‌..!
కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలు ప్రజలకు శాపాలుగా మారాయి. రేషన్‌ కోసం రోడ్లపైకి రావడం పెద్ద ప్రహసనం కాగా, అది కూడా కొద్ది గంటలకే పరిమితం చేశారు. ప్రతి నెలా 10వ తేదీలోపు వస్తేనే బియ్యం దక్కే పరిస్థితి నెలకొంది. నిల్వలు అయిపోతే ఇక ఆ నెల ఖాళీ సంచితో వెనుదిరగాల్సిందే. ఇవన్నీ తొలిరోజు రేషన్‌ షాపులకు వెళ్లిన లబ్ధిదారులకు డీలర్లు చెప్పిన మాటలే!  

అంటే ప్రభుత్వం ఆయా డీలర్ల పరిధిలోని కార్డులకు తగినంత నిల్వలు సరఫరా చేయదా? లేదంటే ఐదు రోజుల ముందుగానే పంపిణీని ముగించి గుట్టు చప్పుడు కాకుండా బియ్యాన్ని తరలించుకునే ఎత్తుగడ వేస్తున్నారా?.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ హయాంలో అనుభవాలను పరిశీలిస్తే వీటికి బలం చేకూరుతోంది. 2019కి ముందు రేషన్‌ షాపుల్లో 10వ తేదీకే బియ్యం పంపిణీ ముగిసేది. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా ఆలకించే నాథుడు ఉండేవారు కాదు. ఇప్పుడు మళ్లీ అలాంటి అరాచక పరిస్థితి పునరావృతమవుతోంది.

‘‘శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల పరిధిలోని ఓ రేషన్‌ దుకాణంలో లబ్ధిదారులను వరుసగా కూర్చోబెట్టి వేలిముద్రలు తీసుకుని బియ్యానికి బదులు నగదు ఇచ్చి పంపించేశారు. వీరిలో అధిక శాతం వృద్ధులే. మరికొందరు మోసుకెళ్లే ఓపిక లేక డీలర్‌ దగ్గరే వదిలేసి ఇచ్చినంత తీసుకుని ఇంటి ముఖం పట్టారు’’  

బడుగు, బలహీన వర్గాల ఉపాధికి గండి..
కూటమి సర్కారు వివక్షతో రేషన్‌ వాహనాలను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల జీవనోపాధిని దెబ్బ తీసింది. 9,260 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ప్రభుత్వ సేవల్లో భాగస్వామ్యం కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వారిని సొంతూరిలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా తోడ్పాటు అందించింది. వీటిపై ఆధారపడి మరో 10 వేల మంది వరకు హెల్పర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నఫళంగా రేషన్‌ వాహనాలను రద్దు చేసి వారి జీవనోపాధికి గండి కొట్టింది.

రేషన్‌ క్యూలో వృద్ధురాలి మృతి
‘అనంత’లో విషాదం..
అనంతపురం: ఇంటికే రేషన్‌ రద్దు నిర్ణయం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది! అనంతపురంలో రేషన్‌ దుకాణం వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడటంతో నీరసించిపోయిన మందల లక్ష్మీదేవి (70) అనే వృద్ధురాలు కుప్పకూలి చనిపోయింది. ఆదివారం అనంతపురం హెచ్చెల్సీ కాలువ సమీపంలోని నిర్మలానంద నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. లక్ష్మీదేవి రేషన్‌ బియ్యం కోసం ఉదయం ఎనిమిది గంటలకు  రేషన్‌ షాపు వద్దకు చేరుకుంది. కుమార్తె ఈశ్వరమ్మతో కలసి క్యూలైన్‌లో నిల్చుంది. 

ఎనిమిది గంటలకు ఇవ్వాల్సిన రేషన్‌ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో క్యూలో ఉన్న లక్ష్మీదేవి నీరసించి ఉదయం 9:45 గంటలకు కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పరీక్షించి చూడగా చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఇద్దరు కుమారులు గతంలో కాలువలో పడి చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటోంది.  రెండు రోజులు మాత్రమే రేషన్‌ ఇస్తారనే ఆందోళనతో క్యూలో నిలబడ్డారని, మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటలకొద్దీ నిలబడటంతో కుప్పకూలి చనిపోయారని స్థానికులు తెలిపారు.

జగన్‌ హయాంలో నిశ్చింతగా..
2014-19 మధ్య టీడీపీ హయాంలో పేదలకు ఇచ్చే బియ్యం తినడానికి ఏమాత్రం పనికొచ్చేవి కాదు. పురుగులు పట్టి, ముక్కిపోయి, రంగు మారి, చెత్త, రాళ్లతో అధ్వాన్నంగా ఉన్న బియ్యాన్ని పేదలు వండుకోలేక, బయట మార్కెట్‌లో కొనలేక నరకం అనుభవించారు. ఈ దుస్థితిని తప్పిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని ప్రవేశపెట్టింది. 

అది కూడా రేషన్‌ వాహనాల్లో ఇంటి వద్దకే చేరవేయడంతో పేదల కష్టాలు తీరిపోయి నిశ్చింతగా వండుకున్నారు. ఫలితంగా 90 శాతానికిపైగా పంపిణీ పెరిగింది. ఇలా కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.41 చొప్పున వెచ్చించింది. అలాంటిది ఇప్పుడు డీలర్లు రూ.10 లబ్ధిదారుల చేతుల్లో పెడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నా కూటమి సర్కారు కళ్లు మూసుకుని కూర్చుంది

Back to Top